అర్హులందరికీ సంక్షేమ పథకాలు: చంద్రబాబు

3 Jan, 2018 02:29 IST|Sakshi
దర్శిలో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో మాట్లాడుతున్న సీఎం

సాక్షి ప్రతినిధి, ఒంగోలు:  రాజకీయాలకతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథ కాలు అందజేస్తామని సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు. అటవీశాఖ మంత్రి శిద్దా రాఘవరావు సొంత నియోజకవర్గమైన దర్శిలో మంగళవారం జరిగిన ఐదవ విడత ‘జన్మభూమి–మా ఊరు’ప్రారంభ కార్యక్రమంలో సీఎం ప్రసంగించారు. జన్మభూమి కార్యక్రమాన్ని గతంలోకంటే భిన్నంగా రోజుకో అంశం చొప్పున 9 రోజులపాటు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

రాష్ట్ర జనాభాలోని 80 శాతం మందికి ప్రభుత్వ పథకాలు తృప్తినివ్వాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నట్లు చెప్పారు. ప్రాజెక్టుల నుంచి ఒక పంటకు నీరివ్వాలని నిర్ణయించామన్నారు. ప్రభుత్వమే రైతుల ఉత్పత్తులు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. డ్వాక్రా మహిళలకు రూ.10 వేలు ఇస్తున్నామన్నారు. రూ.680 కోట్ల వడ్డీ లేని రుణాలిచ్చామన్నారు. ఆహార భద్రత కింద రాష్ట్రంలో 1.42 లక్షల రేషన్‌కార్డులు ఇస్తున్నట్లు చెప్పారు. కేంద్రం చక్కెరను నిలిపివేస్తే జనవరి నుంచి అరకేజీ చక్కెరతోపాటు నిత్యావసర సరుకులను సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. 

ఆరు జిల్లాల్లో నూరు శాతం మరుగుదొడ్లు.. 
రాష్ట్రంలో 6 జిల్లాల్లో నూరు శాతం మరుగుదొడ్లు నిర్మించామని సీఎం చెప్పారు. ప్రకాశం జిల్లాలో నూరుశాతం మరుగుదొడ్లు పూర్తి చేసినట్లు ప్రకటించారు. రాష్ట్రంలో 19 లక్షల ఇళ్లు నిర్మిస్తున్నట్లు చెప్పారు. ‘‘బీసీలకు, కాపులకు కార్పొరేషన్‌ పెట్టి నిధులిస్తున్నాం. మసీదు, చర్చిలకు ఆర్థిక సాయం చేస్తున్నాం. అగ్రవర్ణ పేదలకు సహాయం చేసేందుకు రూ.750 కోట్లు కేటాయిస్తున్నాం’’అని పేర్కొన్నారు.  పోలవరం జీవనాడి అని, దీనిని పూర్తి చేస్తామని పేర్కొన్నారు. జన్మభూమిలోపు నూరు శాతం సమస్యలు పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో మంత్రులు నారాయణ, శిద్దా రాఘవరావు, ఎమ్మెల్సీ కరణం బలరాం, కలెక్టర్‌ వినయ్‌చంద్‌ తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు