ఆటో రాణి

11 Feb, 2018 12:33 IST|Sakshi
ఇద్దరు పిల్లలు సాయితేజ, సాయి మనోజ్‌లతో ఎస్తేర్‌ రాణి

ఆటో నడుపుతూ బతుకు బండి సాగిస్తున్న ఎస్తేర్‌రాణి

పురుషాధిపత్యాన్ని సవాల్‌ చేస్తున్న ఉమన్‌ ఆటోడ్రైవర్‌

ఒంగోలులోని మదర్‌ థెరిస్సా కాలనీ.. ఉదయాన్నే ఓ యువతి ఇంటి ముందు తన ఆటోను శుభ్రం చేసుకుంటోంది. ఆ సమయంలో మరో ఆటో డ్రైవర్‌ ఆమె ఆటోను ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టి పారిపోయాడు. తనకు జరిగిన అవమానాన్ని తట్టుకోలేకపోయిన ఆ యువతి వారం రోజుల పాటు వెతికి ఆ ఆటో డ్రైవర్‌ను పట్టుకుని పోలీసులకు ఫిర్యాదు చేసి జైలుకు పంపే వరకు ఊరుకోలేదు. 

మళ్లీ ఆమే..తోటి ఆటో డ్రైవర్‌ వచ్చి పక్కన కూర్చొని భుజంపై చేయి వేశాడు. అంతే అతని చెంప ఛెళ్లుమనిపించింది. ఆటో బాడుగకు వెళ్లినప్పుడు ‘ఆటో కావాలి..రేటెంత..’ అంటూ అసభ్యంగా మాట్లాడిన ఓ తుంటరి తాట తీసింది. 

ఆడతనాన్ని కాదు..ఆధిపత్య పోరులో నలిగిన అసహనాన్ని..అబలను కాదు..జీవిత పాఠాలతో రాటుదేలిన అంకుశాన్ని..తనువునేమి చూస్తావు..తలరాతను మార్చుకున్న నా తడాఖా చూడువంటగది దాటి వడివడిగాబతుకు బండి నడుపుతున్న నా తెగువను చూడు

ఒంగోలు వన్‌టౌన్‌: అడుగడుగునా పొంచి ఉన్న మృగాల కోరలు వంచుతూ మొండి ధైర్యంతో తనను తాను కాపాడుకుంటూ..భర్త లేకపోయినా ఇద్దరు పిల్లల్ని కంటికి రెప్పలా చూసుకుంటూ  బతుకు పోరు సాగిస్తోంది ఉమన్‌ ఆటో డ్రైవర్‌ ఎస్తేర్‌ రాణి. ఆమె జీవితంలోకి తొంగిచూస్తే..ఎంతో వేదన..మరెంతో తెగువ కళ్లముందు కదులుతుంది. ఒంగోలు మదర్‌థెరిస్సా కాలనీలో నివాసముంటున్న ఉప్పు సరళ.. భవన నిర్మాణ కార్మికురాలిగా పనిచేస్తున్న క్రమంలో మళయాళీ అయిన ప్రకాష్‌తో పరిచయం పెళ్లికి దారి తీసింది.  సరళ, ప్రకాష్‌ దంపతులకు పుట్టిన మొదటి సంతానం ఎస్తేర్‌ రాణి, రెండవ సంతానం ఏసుబాబు. రాణి ఏడో తరగతి వరకూ చదివి కుటుంబ ఆర్థిక పరిస్థితి కారణంగా చదువు మానేసింది. తమ్ముడు టెంట్‌ హౌస్‌ కార్మికుడిగా, రాణి తల్లితోపాటు భవన నిర్మాణ కూలీగా మారింది. మట్టి మనుషుల జీవితాల్లో నిత్యం తొంగి చూసే ఆర్థిక సమస్యలు, వ్యసనాల కారణంగా తల్లీ కూతురు, తండ్రీ కొడుకులుగా కుటుంబం రెండుగా విడిపోయింది. తండ్రి, తమ్ముడు ఏసుబాబును తీసుకుని నగరంలోని ఒక టెంట్‌ హౌస్‌లో పని చేసుకుంటూ జీవిస్తుండగా రాణి..తల్లితో కలిసి అదే కాలనీలో ఉంటూ అమ్మతోపాటే కూలీగా మారింది.

ఆ క్రమంలోనే పదిహేడేళ్ల వయస్సులో రాణికి భవన నిర్మాణ కార్మికుడైన రెడ్డి నరేంద్రతో  2012లో  వివాహం అయింది. రాణి, నరేంద్రలకు ఇద్దరు పిల్లలు. పెద్దబ్బాయి సాయితేజ, చిన్నకొడుకు సాయిమనోజ్‌ . కంకర పనికి వెళ్లి రోజుకు రూ.350 సంపాదిస్తూ రాణి కుటుంబ బరువు బాధ్యతలు మోస్తుండటంతో నరేంద్ర చెడు వ్యసనాలకు బానిసై కాలేయం దెబ్బతిని 2015లో మరణించాడు. భర్త మరణంతో దిక్కుతోచని రాణి కుంగిపోలేదు. కూలి పని మానేసి బంధువుల వద్ద ఆటో నడపడం నేర్చుకుంది. 2015లో ఒంగోలు మున్సిపల్‌ ఆఫీసులో 26 మంది ఉమెన్‌ ఆటో డ్రైవర్లకు అప్పటి కలెక్టర్‌ లోన్‌ సౌకర్యం ద్వారా ఆటోలు పంపిణీ చేశారు. రాణి కూడా ఒక ఆటో తీసుకుంది. ఆటో ద్వారా వచ్చే ఆదాయంలో కొంత బ్యాంక్‌కు చెల్లించడమే కాకుండా కుటుంబ భారాన్ని సమర్ధించుకుంటూ ఇద్దరు పిల్లల్ని చదివించుకుంటూ రూ.10 వేలు అప్పు చేసి మరో ఆటోను కొనుగోలు చేసింది. ప్రస్తుతం రెండు ఆటోల ద్వారా వచ్చే ఆదాయంతో సమాజంలో గౌరవ ప్రదమైన జీవనంతో తానెవరికీ తీసిపోనని నిరూపిస్తోంది.  ఆటో నడుపుతున్న కొత్తలో కుర్రాళ్లు ఆటోలతో, బైక్‌లతో వెంటపడి ఫోన్‌ నంబర్‌ ఇవ్వమని వేధించినా తెగువతో రోడ్డు మీదకు వచ్చిన ఎస్తేర్‌ రాణి అడుగడుగునా ఎదురవుతున్న సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటూ ముందుకు సాగుతోంది.  

పిల్లల భవిష్యత్తే ముఖ్యం
చిన్న వయసులోనే భర్తను కోల్పోయిన రాణిని మరో పెళ్లి చేసుకోమని ఎవరైనా సలహా ఇస్తే..‘పరాయి పిల్లలను తన పిల్లలుగా చూసే మరో మగాడు ఈ సమాజం లో ఉంటాడా’ అంటూ ఎదురు ప్రశ్ని స్తుంది. ‘నా తల్లి, నేను పడిన కష్టాలు నా పిల్లలు చూడకూడదు’ అంటూ గుండెనిండా ధైర్యాన్ని నింపుకుని మాట్లాడే రాణి ని చూస్తే ఎవరికైనా ముచ్చటేస్తుంది. ఆర్టీసీలో ఉద్యోగం సంపాదించడమే తన లక్ష్యంగా చెబుతున్న ఆటోరాణి ఆశయం నెరవేరాలని, చితికిన కుటుంబాన్ని అపురూపంగా మలచుకున్న ఆమె ఎందరో మహిళలకు ఆదర్శంగా నిలవాలని కోరుకుందాం. 

మరిన్ని వార్తలు