అభివృద్ధి పథంలో జెడ్పీని నడిపిస్తున్నాం

1 Jan, 2018 12:26 IST|Sakshi

నెల్లూరు(అర్బన్‌): అభివృద్ధి పనులకు నిధులు చాలకున్నా.. ప్రభుత్వం గ్రాంట్‌లు నిలిపివేసినా.. ఉన్న కొద్ది పాటి నిధులతోనే జిల్లా పరిషత్‌ను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నానని జెడ్పీ చైర్మన్‌ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి అన్నారు. ఆయన చైర్మన్‌ అయి మూడున్నరేళ్లు కావస్తున్న సందర్భంగా నూతన సంవత్సరం–2018ను పురస్కరించుకుని ఆదివారం నగరంలోని జెడ్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి, మాట్లాడారు. తాను బాధ్యతలు చేపట్టిన వెంటనే అర్ధంతరంగా  ఆగిపోయిన జెడ్పీ కార్యాలయానికి రూ.2కోట్ల నిధులు మంజూరు చేయించి పూర్తి చేయించినట్లు పేర్కొన్నారు. మరుగున పడిన జెడ్పీ అతిథి భవనాన్ని రూ.30లక్షలతో మరమ్మతులు చేయించినట్లు చెప్పారు.

 జెడ్పీ పాఠశాలలు, హాస్టళ్లలో రూ.2కోట్లతో టాయిలెట్స్, ఇతర మరమ్మతులు చేపట్టినట్లు వివరించారు. పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించేందుకు మార్గదర్శిని పుస్తకాన్ని రూ.50లక్షలతో ప్రచురించి, విద్యార్థులకు అందజేసినట్లు తెలిపారు. దీంతో ఉత్తమ ఫలితాలు సాధించినట్లు తెలిపారు. ఈ పుస్తకాన్ని మిగతా జిల్లాలతో పాటు తెలంగాణ ప్రభుత్వం కూడా కాపీరైట్స్‌ గురించి అడుగుతున్నాయని ఆనందం వ్యక్తం చేశారు. ఈ పనులు తనకు ఎంతో సంతృప్తి నిచ్చాయన్నారు. అలాగే 2014–15లో రూ.5 కోట్లతో జిల్లా అంతటా తాగునీటి బోర్లు వేయించామన్నారు. 2015–16లో ఒకేసారి 900 బోర్లు వేయించి ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తొలగించడం గొప్ప విషయమన్నారు. 

తాను పదవీ బాధ్యతలు చేపట్టే సమయానికి జెడ్పీ  రూ.10 కోట్ల లోటు బడ్జెట్‌తో ఉందన్నారు. గతంలో ప్రభుత్వం నుంచి గ్రాంట్‌లు, ఆర్థిక సంఘం నిధులు, ఇసుక సీనరేజీ జెడ్పీకి ప్రధాన ఆదాయ వనరులుగా ఉండేవన్నారు. తాను బాధ్యతలు చేపట్టాక అవన్ని ఆగిపోయాయని తెలిపారు. అలాగే జిల్లాస్థాయిలో పదో తరగతి పరీక్ష ఫలితాల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానం సాధించిన విద్యార్థులకు రూ.15వేలు, రూ.10వేలు, రూ.5వేలు చొప్పున నగదు బహుమతులను, నియోజకవర్గ స్థాయిలో కూడా ఇలాగే అందిస్తున్నామన్నారు. గ్రిగ్స్‌ టోర్నమెంట్‌ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మత్య్సకారులకు రూ.2.70కోట్లతో వలలు, సైకిళ్లు, వికలాంగులకు రూ.15లక్షలతో ట్రై సైకిళ్లు, అన్ని మండలాల్లో మహిళలకు కుట్టుమిషన్లు పంపిణీతో పాటు, కారుణ్య నియామకం కింద 72 మందికి ఉద్యోగాలు కల్పించామన్నారు. 

సిబ్బంది లేకపోవడం బాధాకరం
జెడ్పీ పాఠశాలల్లో ఉపాధ్యాయులతో పాటు వాచ్‌మెన్లు, స్వీపర్లు కొరత తీవ్రంగా ఉండటం బాధాకరమన్నారు. ఏ ప్రభుత్వమైనా విద్యకు అధిక నిధులు కేటాయించి మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్‌ చేశారు.

మా(జెడ్పీ) డబ్బులు మాకివ్వాలి
అన్ని జిల్లాల్లో జరిగిన తీరుకు విరుద్ధంగా జెడ్పీ నుంచి ఉద్యోగులకు 2004 నుంచి రూ.28 కోట్లు పింఛన్లు చెల్లించామన్నారు. వాస్తవానికి పింఛన్లు ప్రభుత్వమే ట్రెజరీ ద్వారా చెల్లించాల్సి ఉందన్నారు. తాను బాధ్యతలు చేపట్టాక లోపాన్ని గుర్తించి ట్రెజరీ ద్వారా ఉద్యోగులకు పింఛన్‌లు ఇచ్చే ఏర్పాట్లు చేశామన్నారు. ఇప్పటి వరకు మా(జెడ్పీ) పరంగా చెల్లించిన నిధులు రూ.28 కోట్లు రీయింబర్స్‌మెంట్‌ కింద ప్రభుత్వం విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇవి వస్తే అభివృద్ధి పనులకు డోకా ఉండదన్నారు. తాము ప్రతిపక్షంలో ఉన్నామని వివక్ష చూపకుండా ప్రభుత్వం నిధులు విడుదల చేయాలని కోరారు. తమకు సహకరించిన అధికార, ప్రతిపక్ష ప్రతినిధులకు, అధికారులకు అభినందనలు తెలిపారు. 

>
మరిన్ని వార్తలు