పోరు గాలి.. వేట ఖాళీ

8 Mar, 2019 14:49 IST|Sakshi
తిరగబడిన బోటును బయటకు లాగుతున్న మత్స్యకారులు

సాక్షి, వాకాడు: సముద్రంపై ప్రతికూల వాతావరణం కారణంగా 25 రోజులుగా పోరు గాలి వీస్తుండడంతో వేట సజావుగా సాగడం లేదు. సాధారణంగా మార్చిలో మత్స్యసంపద ఎక్కువగా దొరుకుతుందని గంగపుత్రులకు ఎంతో కాలం వస్తున్న నమ్మకం. అలాంటిది ఈ సారి మార్చి ప్రారంభమై వారం రోజులు గడుస్తున్నా పోరుగాలి తగ్గకపోవడంతో మత్స్యకారులు పెట్టుకున్న ఆశలు అడియాశలయ్యాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు సముద్రంలో వలేసి గాలించినా ఒక్క చేపైనా దొరకపోగా శ్రమతోపాటు, డీజిల్, కూలీలు ఖర్చులు పెరిగిపోతున్నాయి. దీంతో వేట తప్ప మరేపని తెలియని మత్స్యకారులు పూట గడవక ఆకలితో అలమటిస్తున్నారు. వేటే జీవనాధారంగా చేసుకుని తెల్లవారు జామునే వల బుజాన వేసుకుని సముద్రాన్ని గాలించి మంచి మత్స్యసంపదతో సంతోషంగా కనిపించే సాగర పుత్రులు తీరంలో దిగాలు చెందుతున్నారు. 

ఒడ్డుకు పరిమితమైన బోట్లు
ఇటీవల పలు జిల్లాలో వచ్చిన వరుస తుపాన్లు, ప్రతికూల వాతావరణం వెరసి వేట నిలిచిపోయి బోట్లు ఒడ్డుకు పరిమితమయ్యాయి. ఇంతకు ముందు మాదిరిగా సముద్రంలో మత్స్య సంపద విరివిగా దొరకడంలేదు. ఎందుకంటే దాదాపు నెల రోజులుగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకుని సముద్రంపై పోరు గాలి నెలకుని బోట్లు తిరగబడుతున్నాయి. దీంతో డీజిల్‌ ఖర్చులు వృథా చేసుకుని మత్స్యకారులు పోయిన దారినే వెనుతిరిగి వచ్చేస్తున్నారు.

దానికితోడు తీరంలో నెలకొని ఉన్న పలు పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థ జలాలు కండలేరు క్రీక్‌లోకి వదిలి, క్రీక్‌ నుంచి సముద్రంలో కలవడంతో వాకాడు, కోట, చిల్లకూరు, మండలాల తీర ప్రాంతాల్లో మత్స్య సంపద పూర్తిగా నసించిపోయి మత్స్యకారులు జీవనం కోల్పోతున్నారు. రోజంతా సముద్రంపై గాలించినా మత్స్యకారులకు శ్రమ తప్ప ఫలితం దక్కడంలేదు. దీంతో వేట కొరకు తెచ్చిన పెట్టుబడుల రుణాలకు వడ్డీలు కట్టలేకున్నామని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

2,650 మంది వేటకెళ్లే మత్స్యకారులు
నియోజకవర్గం పరిధిలోని వాకాడు, కోట, చిల్లకూరు మండలాల్లో 24 మత్స్యకార గ్రామాల్లో 2,650 మంది వేట చేసే మత్స్యకారులు, 1,920 బోట్లు ఉన్నాయి. ఒక్కో బోటుపై యజమానులతోపాటు కూలీలతో కలిపి దాదాపు మూడు నుంచి ఐదు కుటుంబాల వరకు మత్స్య సంపదపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. వేట లేకపోవడంతో బోట్లు ఒడ్డుకు చేర్చి లంగరు వేసి ఉన్నాయి. ప్రస్తుతం మత్స్యకార కుటుంబాలు అప్పులు చేసి పూట గడుపుతున్నా, మరికొందరు పస్తులుంటున్నారు. ఈ పరిస్థితి అన్ని మండలాల మత్స్యకార గ్రామాల్లో నెలకొని ఉంది. వేటనే నమ్ముకుని కుటుంబాన్ని పోషించే కొందరు మత్స్యకారులు ఎంచేయాలో దిక్కుతోచక వివిధ పనుల్లో దినసరి కూలీలుగా మారుతున్నారు.

ఇది ఇలా ఉంటే గత ఏడాది విధించిన వేట విరామం డబ్బులు ఇంతవరకు సక్రమంగా అందకపోవడం, వచ్చిన డబ్బుల్లో కూడా మధ్యవర్తులు దండుకోవడం కనిపిస్తోంది. కొందరు మత్స్యకారులు సముద్రంలో చేపలవేట లేక, చేతిలో పనిలేక కాలక్షేపం కోసం కొన్ని వ్యసనాలకు బానిసలవుతున్నారు. తమను అన్ని విధాలా ఆదుకుంటున్నామని పదే పదే చెబుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని మత్స్యకారులు వాపోతున్నారు. తమ బాధలు గుర్తించి వెంటనే సాయం అందించాలని మత్సకారులు కోరుతున్నారు. 

రోజంతా గాలించినా చేపలు దొరకడంలేదు
నెల రోజులుగా సముద్రంపై పోరుగాలి కొడుతుండడంతో రోజంతా గాలించినా ఒక్క చేప కూడా దొరకడంలేదు. దీంతో పూట గడవక మా కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. వారం నుంచి కూలికి వెళ్లి జీవనం సాగిస్తున్నాం.

 – సోమయ్య మత్స్యకారుడు, తూపిలిపాళెం 

మరిన్ని వార్తలు