నెల్లూరుకు ఔటర్‌ రింగ్‌రోడ్డు

7 Jan, 2018 13:46 IST|Sakshi

2019 మార్చికల్లా దగదర్తి విమానాశ్రయం పూర్తి

సీఎం చంద్రబాబునాయుడు

నెల్లూరు రూరల్‌: నెల్లూరు నగరానికి ఔటర్‌ రింగ్‌రోడ్డు ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటిం చారు. నెల్లూరు మండలంలోని కోడూరుపాడులో శనివారం నిర్వహించిన జన్మభూమి–మా ఊరు సభలో సీఎం మాట్లాడారు. నెల్లూరు అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఔటర్‌ రింగ్‌రోడ్డు ప్రతిపాదనను తయారు చేయాలని అధికారులకు ఆదేశించారు. జాతీయ రహదారుల అభివృద్ధిలో భాగంగా వెంకటగిరి పట్టణానికి ఎక్స్‌ప్రెస్‌ వే వేస్తున్నట్లు తెలిపారు. కోడూరుపాడు నూతన లేవుట్‌లో పేదలకు ఇళ్ల స్థలాలు, పక్కా ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. నెల్లూరు జాతీయ రహదారి నుంచి కోడూరుపాడు వరకు నాలుగు కిలోమీటర్ల మేర రోడ్డు విస్తరించి అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. జిల్లాలో దగదర్తి విమానాశ్రయం పనులను 2019 మార్చి కల్లా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

 కృష్ణపట్నం ప్రాంతంలో సెజ్‌ను ఏర్పాటు చేసి పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. నెల్లూరు నుంచి చెన్నై వరకు ఇండ్రస్టియల్‌ కారిడార్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. భవిష్యత్‌ అవసరాల దృష్టా జిల్లాలో మూడు ఎయిర్‌పోర్టులను తీసుకొస్తామన్నారు. కాకినాడ నుంచి పాండిచ్చేరి వరకు బకింగ్‌హోం కెనాల్‌ను ద్వారా జలరవాణాను అభివృద్ధి చేస్తామన్నారు. జన్మభూమి–మా ఊరు ప్రాధాన్యత, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఫైబర్‌ గ్రిడ్‌ ద్వారా ప్రతి కుటుంబానికి రూ.149కే ఇంటర్‌నెట్‌ సౌకర్యం కల్పిస్తామన్నారు. గ్రామాల్లో అంతర్గత రోడ్లు, పంచాయతీ కార్యాలయాలకు నూతన భవనాలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. తొలుత జన్మభూమి ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు.

బలిజపాళెం అంగన్‌వాడీ కేంద్రం చిన్నారులను సీఎం చంద్రబాబు పలు ప్రశ్నలు అడగ్గా చిన్నారులు సరైన సమాధానాలు చెప్పడంతో సంతృప్తి వ్యక్తం చేశారు. ఆ స్కూల్‌కు ఏమి కావాలో అంగన్‌వాడీ కార్యకర్తను కోరుకోమనడంతో నూతన భవనం కావాలని అడిగారు. వెంటనేనూతన భవనానికి రూ.20 లక్షలు మంజూరు చేస్తూ, కార్యకర్తకు రూ.25వేలు ఇన్సెంటివ్‌ ప్రకటించారు. మున్సిపల్‌ జూనియర్‌ కళాశాల విద్యార్థులు మాట్లాడుతూ తాము డాక్టర్‌ చదవాలని సీఎంను కోరగా వారి చదువు కోసం ఒక్కొక్కరికి రూ.50వేలు వంతున డిపాజిట్‌ చేస్తున్నట్లు చెప్పారు. తొలుత హెలిప్యాడ్‌ వద్ద టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర, మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డి పుష్పగుచ్ఛం అందజేసి సీఎంకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్వయం సహాయక సంఘాలకు రూ.6 కోట్ల రుణాల చెక్‌ను పంపిణీ చేశారు.

 ఈ సందర్భంగా స్వచ్ఛ భారత్‌(గ్రామీణ్‌), ఉద్యాన శాఖ, వ్యవసాయ శాఖ, మత్స్యశాఖ, పశుసంవర్థక శాఖ, డ్వామా, ఐసీడీఎస్, మెప్మా, హౌసింగ్‌ శాఖలు ఏర్పాటు చేసిన ప్రత్యేక స్టాల్స్‌ను చంద్రబాబు పరిశీలించారు. గర్భిణులకు సీమంతాలు చేశారు. అనంతరం సంక్రాంతి సంబరాలను ప్రారంభించారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు అమర్‌నా«థ్‌రెడ్డి, పి.నారాయణ, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, బొల్లినేని రామారావు, పాశం సునీల్‌కుమార్, ఎమ్మెల్సీలు బీద రవిచంద్ర, వాకాటి నారాయణరెడ్డి, స్త్రీ, శిశుసంక్షేమ శాఖ చైర్‌పర్సన్‌ నన్నపనేని రాజకుమారి, మాజీ ఎమ్మెల్యేలు, బీద మస్తాన్‌రావు, ఆదాల ప్రభాకర్‌రెడ్డి, ముంగమూరు శ్రీధర్‌కృష్ణారెడ్డి, పరసారత్నం, కంభం విజయరామిరెడ్డి, డీసీసీబీ చైర్మన్‌ మెట్టుకూరు ధనుంజయరెడ్డి, విజయ డెయిరీ చైర్మన్‌ కొండ్రెడ్డి రంగారెడ్డి, నగర మేయర్‌ అబ్దుల్‌ అజీజ్, స్థానిక కార్పొరేటర్‌ లేబూరు పరమేశ్వరరెడ్డి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు