పుచ్చకాయతో నష్టాలు

5 Mar, 2019 12:37 IST|Sakshi
సక్రమంగా కాయలు లేని పుచ్చ పంట  

వెంటాడుతున్న తెగుళ్లు

భారీగా తగ్గిన దిగుబడులు

పెట్టుబడులు కూడా రాలేదంటున్న రైతులు 

పుచ్చకాయ తింటే లాభాలనేకం అందుకే వేసవిలో పుచ్చకాయను తినని వారుండరు. కాని పుచ్చ పంటకు తెగులు సొకడంతో దిగుబడి తగ్గి క‌ష్టాల్లో ఉన్న రైతన్నను మార్కెట్లొ ధర వెక్కిరించింది. చివరికి పెట్టుబడి సొమ్ము కూడా చేతికి రాక రైతుకు కన్నీరే మిగిల్చింది.

సాక్షి, చిట్టమూరు: వర్షాభావ పరిస్థితులు మెట్టపంటల సాగు రైతును కుదేలు చేసింది. ఈ ఏడాది పుచ్చ పంట వేసిన రైతులకు నష్టాల ఊబిలో కూరుకుపోయారు. గతేడాది వివిధ ప్రాంతాల్లో వేసిన పంటకు అంతు పట్టని తెగులు సోకడంతో దిగుబడులు తగ్గి రైతులు నష్టపోయారు. ఈ సంవత్సరం అయినా పంట ఆశాజనకంగా ఉంటుందని ఆశించిన రైతులు గతేడాది కంటే ఎక్కువగా నష్టాలను చవిచూశారు. పుచ్చ పంట సాగు చేసిన రైతులకు ఉద్యానవన శాఖ అధికారుల నుంచి  ఎటువంటి సలహాలు, సూచనలు అందలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సరైన సేద్యం పద్ధతులు అవలంబించలేకపోవడంతో పంటలను తెగుళ్లు ఆశించాయి. రైతులు పురుగు మందు దుకాణదారులు చెప్పిన మందులు వాడినా దిగుబడులు అంతంత మాత్రమే వస్తున్నాయన్నారు. 

గూడూరు నియోజకవర్గంలో చిట్టమూరు, కోట, వాకాడు, గూడూరు చిల్లకూరు మండలాల్లో సుమారు 2 వేల ఎకరాల్లో మెట్ట ప్రాంతాల్లో రైతులు పుచ్చ పంట సాగుచేశారు. ప్రస్తుతం కోత దశలో ఉండటంతో రైతులు కాయలు కోసి ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. కాయ సైజును బట్టి వ్యాపారులు రైతుల వద్ద నుంచి కొనుగోలు చేస్తున్నారు. చిన్న సైజు కాయలను వ్యాపారులు కొనుగోలు చేయకపోవడంతో రోడ్ల పక్కన రైతులే అమ్మకాలు చేస్తున్నారు. వేలు పెట్టుబడి పెట్టి చివరకు కాయ సైజు రాకపోవడంతో అప్పుల పాలయ్యామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిట్టమూరు మండలంలో ప్రధానంగా చిల్లమూరు, మొలకలపూడి, రామాపురం గ్రామాల్లో మెట్టు ప్రాంతాల్లో రైతులు పుచ్చసాగు చేశారు. చిట్టమూరు మండలం నుంచి గతంలో దేశ రాజధాని ఢిల్లీకు కూడా ఎగుమతి అయ్యేవి. అయితే ఈ సంవత్సరం కాయ సైజు పెద్దగా రాకపోవడం, నాణ్యత లేకపోవడంతో ఎగుమతులు నిలిచిపోయాయని రైతులు చెబుతున్నారు.  


ధరలు భారీగా పతనం
ఈ ఏడాది పుచ్చకాయల ధరలు భారీగా పనమయ్యాయి. గతేడాది టన్ను రూ.10 వేలు ఉంటే.. ఈ ఏడాది రూ.6 వేల నుంచి రూ.6,500 వరకు ఉన్నాయి. కాయలు చిన్నవి అయితే రూ.4,500 లోపే కొనుగోలు చేస్తున్నారు. కానీ మార్కెట్‌లో వ్యాపారులు మాత్రం కాయల సైజ్‌ను బట్టి విక్రయిస్తుండడంతో టన్ను రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు వస్తుంది. ఆరుగాలం కష్టపడి పండించిన రైతులకంటే.. వ్యాపారులు రెండింతల లాభాలను పొందుతున్నారు. 


తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో పుచ్చసాగు 
నియోజకవర్గంలో ఈ ఏడాది వర్షాలు పూర్తిస్థాయిలో కురవకపోవడంతో రైతులు వరి పంటకు సాగు నీరు లేక ఆరుతడి పంట పుచ్చను సాగు చేశారు. బావులు, గుంతల్లోని నీటి ఆధారంగా పుచ్చసాగు చేశారు. డీజిల్‌ ఇంజన్ల ద్వారా పుచ్చ పంటకు సాగునీరు అందించి వ్యయప్రయాసలు పడి పండించినా చివరకు కష్టమే మిగిలిందని రైతులు వాపోతున్నారు. ఎకరా పుచ్చసాగుకు దుక్కి మొదలు, కోత దశ వరకు సుమారు రూ.30 వేలు ఖర్చు అవుతుంది. అయితే తొలి కోతలో రెండు టన్నులు, రెండో కోతలో రెండు టన్నులు మొత్తం ఎకరాకు 4 నుంచి 5 టన్నుల దిగుబడి మాత్రమే వస్తుందని రైతులు తెలిపారు. అయితే అన్ని బాగుండి గతంలో ఎకరాకు సుమారు 15 టన్నుల వరకు దిగుబడి వచ్చేదని రైతులు పేర్కొన్నారు. ఈ సంవత్సరం ఎకరాకు రూ.10 వేలు నష్టం వస్తుందని రైతులు తెలిపారు.

ఎకరాకు రూ.10 వేలు నష్టం 
నాలుగు ఎకరాల్లో పుచ్చ పంట సాగు చేశాను. దిగుబడి తక్కువగా రావడంతో ఎకరాకు రూ. 10 వేలు నష్టం వచ్చింది. అధికారుల నుంచి  పంట సస్యరక్షణపై ఎటువంటి సలహాలు, సూచనలు లేకపోవడంతో తెగుళ్లను తగ్గించేందుకు పెట్టుబడులు పెరిగాయి.

– సంక్రాంతి కస్తూరయ్య, రైతు, మొలకలపూడి, చిట్టమూరు మండలం
 

డిసెంబర్‌ నెలలో నాటుకోవాలి
రైతులు డిసెంబర్‌ నెలలో విత్తనాలు నాటుకుంటే  పంటకు తెగుళ్లు తగ్గి దిగుబడి పెరుగుతోంది. తామర పురుగు, డైబ్యాక్‌ తెగులు ఎక్కువగా వస్తున్నాయి. వైరస్‌ ఎక్కువగా సోకడంతో తెగుళ్లు వ్యాప్తి చెందుతున్నాయి. రైతులు మేలు రకమైన విత్తనాలను విత్తుకోవాలి. పాతరకం విత్తనాలు వేసుకోవడం వల్ల తెగుళ్లు వస్తున్నాయి. 
– ఆనంద్, ఉద్యానశాఖ అధికారి, గూడూరు 

మరిన్ని వార్తలు