వృద్ధురాలి హత్య కేసులో నిందితుడి అరెస్ట్‌

16 Apr, 2018 06:50 IST|Sakshi
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న డీఎస్పీ కఠారి రఘు    

రూ.4.63 లక్షల విలువైన నగలు

సెల్‌ఫోన్, ట్యాబ్, కెమెరా స్వాధీనం

కావలిరూరల్‌ : ఈ నెల 2న హత్యకు గురైన ఓ వృద్ధురాలి కేసులో నిందితుడు షేక్‌ రసూల్‌ను ఆదివారం కావలి ఒకటో పట్టణ పోలీసులు అరెస్ట్‌ చేశారు. స్థానిక డీఎస్పీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ కఠారి రఘు నిందితుడి వివరాలు వెల్లడించారు.   పట్టణంలోని ఇషాక్‌మియా వీధిలో నివసం ఉంటున్న శైలారాణి దంపతులు ఈ నెల 2వ తేదీ ఉదయం ఉద్యోగానికి వెళ్లారు. ఇంట్లో శైలారాణి తల్లి కోసూరి పద్మావతమ్మ(76) ఒక్కటే ఉంది. శైలారాణి విధులు ముగించుకుని ఆ రోజు మధాహ్నం ఇంటికి వచ్చి చూడగా మరణించి ఉంది. వృద్ధురాలు కావడంతో బీపీ, హార్ట్‌ అటాక్‌తోనో మరణించి ఉంటుందని కుటుంబ సభ్యులు భావించారు.

అనంతరం మృతురాలి స్వగ్రామం ప్రకాశం జిల్లా శింగరాయకొండ మండలం మూలగుంటపాడులో అంత్యక్రియలు నిర్వహిం చారు. ఈ నెల 12న ఇంటికి వచ్చి ఇంట్లోని బంగారు నగలను చూసుకోగా అవి కనిపించలేదు. వాటితో పాటు ఒక ట్యాబ్, సెల్‌ఫోన్, కెమెరా సైతం అపహరణకు గురైనట్లు గుర్తించారు. దీంతో నగల కోసం పద్మావతమ్మను హతమార్చినట్లు అనుమనాలు తలెత్తాయి. అయితే ఘటన జరిగిన రోజు శైలారాణి విధులకు వెళ్లిన తర్వాత తల్లికి ఫోన్‌ చేసిన సమయంలో పనిమనిషి, గతంలో కప్‌బోర్డులు తయారు చేసిన కార్పెంటర్‌ వచ్చి వెళ్లారని తెలిపిన విషయం గుర్తు చేసుకుంది. కార్పెంట ర్‌  రసూల్‌ ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడని నిర్ధారించుకుని ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సీఐ ఎం.రోశయ్య, ఎస్సై గుంజి అంకమ్మ, హెడ్‌ కానిస్టేబుళ్లు రవికుమార్, విజయ్‌కుమార్, కానిస్టేబుల్‌ సతీష్‌ నిందితుడిన  అదుపులోకి తీసుకుని విచారించడంతో నేరం అంగీకరించారు. దీంతో అతన్ని అరెస్ట్‌ చేసి, అపహరించి కుదువ పెట్టిన 147 గ్రాముల బంగారు నగలు, సెల్‌ఫోన్, ట్యాబ్‌లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.4.63 లక్షలు ఉంటుందని తెలిపారు. ఈ కేసులో నిందితుడు రసూల్‌ది స్వస్థలం బుచ్చిరెడ్డిపాళెం మండలం మునులపూడి కాగా ప్రస్తుతం ప్రకాశం జిల్లా లింగసముద్రం మండలం పెద్దపవనిలో ఉంటున్నాడు. ఈ హత్య కేసులో త్వరగా నిందితుడిని పట్టుకున్న సీఐ, ఎస్సై, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.   

మరిన్ని వార్తలు