35 గ్రామాలకు ఉప్పునీరే దిక్కు ..

15 Mar, 2019 09:07 IST|Sakshi
తాగునీటికోసం ఆందోళన చేస్తున్న తీర ప్రాంతాల మహిళలు (ఫైల్‌)

సాక్షి, వాకాడు: పాలకుల నిర్లక్ష్యం.. అధికారుల అలసత్వం వెరసి మండలంలోని 35 తీర ప్రాంత గ్రామాల్లో గత ఐదేళ్లుగా ఉప్పు జలగండం పట్టి పీడిస్తోంది. నాగరికత కొత్త పుంతలు తొక్కుతున్నా.. తీరప్రాంత వాసులకు గుక్కెడు మంచినీళ్లు దొరక్క తీవ్ర అవస్థలు పడుతున్నారు. మండలంలో 68 గ్రామాల్లో 10.5 వేల కుటుంబాలు, 38 వేల మంది జనాభా నివసిస్తున్నారు. అందులో 204 చేతి పంపులు ఉండగా, వాటిలో 164 మాత్రమే వినియోగంలో ఉన్నాయి.

నిడిగుర్తి, రెడ్డిపాళెం, బాలాజీ నగర్, నిమ్మవానితిప్ప, వేణుగోపాల్‌పురం, నిడిగుర్తి గొల్లపాళెం, శ్రీహరిపురం, కొండూరుపాళెం, శ్రీనివాసపురం, దుగ్గరాజపట్నం, కొత్తూరు, అంజలాపురం, కాకివాకం, పంబలి, నిడిగుర్తి, శ్రీపురం, తీపలపూడి, మూలపడవ, రాజ్యలక్ష్మీపురం, మొనపాళెం, వైట్‌కుప్పం, నలగామల, పున్నమానితిప్ప, నిడిగుర్తి గొల్లపాళెం, రెడ్డిపాళెం, మాధవాపురం, ముట్టెంబాక, కల్లూరు, దుర్గవరం, పల్లెపాళెం ఇలా 35 గ్రామాల్లో వేసవి వస్తే సరి త్రాగునీరు ఉప్పునీరుగా మారిపోయి ప్రజలు అల్లాడుతుంటారు. ఐతే వీరి గురించి అధికార పక్షం నాయకులు గానీ, అధికారులుగానీ పట్టించుకోవడం లేదు.

వీరికి సురక్షిత మంచినీరు అందించేందుకు వాకాడు స్వర్ణముఖి నది పరివాహక ప్రాంతంలో వెసులుబాటు ఉన్నప్పటికీ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో స్వర్ణముఖి నదిలో ఏర్పాటు చేసిన పాత పైలెట్‌ ప్రాజెక్టు పట్ల పాలకులు, కాంట్రాక్టుల నిర్లక్ష్యం కారణంగా తాగునీరు సక్రమంగా అందడంలేదు. అక్కడక్కడ పైపు లైన్లు పగిలిపోయి మరమ్మత్తులకు గురైనప్పటికీ వాటిని పట్టించుకోవడం లేదు. ఫలితంగా తీర గ్రామాల ప్రజలు దాహార్తితో అల్లాడుతూ సుదూర ప్రాంతాల నుంచి ట్యాంకర్లు ద్వారా నీటిని తెచ్చుకుని గొంతు తడుపుకుంటున్నారు.

కొన్ని గ్రామాల్లో స్థానికులు, దాతల చందాలతో మంచినీరు దొరికే ప్రాంతాల్లో గ్రామస్తులే బోరు పాయింట్లు నిర్మించుకుని తాగునీరు తెచ్చుకుంటున్నారు. తీరప్రాంత గ్రామాల్లో భవన నిర్మాణాలు చేపట్టేందుకు ఉప్పునీరు పనికిరాదు. మండలంలో శాశ్వత తాగునీటి పరిష్కారం కొరకు వాకాడు స్వర్ణముఖి వద్ద మరో మంచినీటి ప్రాజెక్టు నిర్మించాలని మండల ప్రజలు కోరుచున్నారు.

తాగేందుకు ఉప్పునీరే గతి
స్నానాలు చేయాలన్నా.. వంట చేసుకోవాలన్నా ఉప్పునీరు కావడంతో చాలా ఇబ్బందిగా ఉంది. మంచినీళ్లు తాగి సంవత్సరాలు గడుస్తున్నాయి. ఎప్పుడైనా పట్టణ ప్రాంతాలకు వెళ్లినప్పుడు మా త్రమే మంచినీళ్లు తాగుతున్నాం. మిగిలిన సమయంలో ఉప్పునీరే తాగుతున్నాం.– నల్లపురెడ్డి మునస్వామిరెడ్డి, వేణుగోపాలపురం

ఇళ్లు కట్టుకోలేకపోతున్నాం

గ్రామాల్లో లభిస్తున్న ఉప్పునీరు కారణంగా ఇళ్లు కట్టుకోలేకపోతున్నాం. సిమెంటులో ఉప్పునీరు కలిపితే నిర్మాణాలు దెబ్బతింటున్నాయి. మండలంలోని 35 గ్రామాల్లో ఇదే పరిస్థితి ఉంది. గత ఐదేళ్లుగా తాగునీటి సమస్య వెంటాడుతోంది. – మునస్వామి, ఓడపాళె

ఆందోళన చేసినా పట్టించుకోలేదు

గ్రామంలో తాగునీరు ఉప్పునీరుగా మారి ఎంతో కాలంగా ఇబ్బందులు పడుతున్నాం. దీనిపై అనేక సార్లు ఆందోళన చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు. ఫలితంగా ఉప్పునీరు తాగే బతుకుతున్నాం.– పోలయ్య మత్స్యకార కాపు, కొండూరుపాళెం  

మరిన్ని వార్తలు