టీడీపీ నేత కబ్జా పర్వం

17 Jun, 2019 09:04 IST|Sakshi
టీడీపీ నేత ఆక్రమించిన పెన్నా పొరంబోకు, పెన్నా పొరంబోకు భూముల్లోకి వేసిన రోడ్డు

దళితులు, ప్రభుత్వ, పెన్నా పొరంబోకు భూముల ఆక్రమణ

దర్జాగా భూములు లీజుకు  

ప్రశ్నించిన దళితులపై దాష్టీకం 

సాక్షి, ఆత్మకూరు(చేజర్ల): ఆ గ్రామంలో ఆ నేతదే పెత్తనం. ఆయన మాటకు ఎవరైనా ఎదురు చెప్తే ఇక అంతే. గత ప్రభుత్వ కాలంలో అధికార బలంతో మండల స్థాయి అధికారులను లోబరుచుకున్నాడు. దళితులకు ప్రభుత్వం పంపిణీ చేసిన భూములతో పాటు పెన్నా పొరంబోకు, ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నారు. దర్జాగా లీజుకు ఇచ్చి ఏటా లక్షలాది రూపాయలు జేబులో వేసుకుంటున్నాడు. దళితులు ఎవరైనా ప్రశ్నిస్తే  దిక్కున్న చోట చెప్పుకోండి అంటూ బెదిరిస్తున్నాడు. మాజీ శాసనసభ్యుడి అండతో సదరు టీడీపీ నేత సాగిస్తున్న దాష్టీకానికి స్థానిక వీఆర్వో సైతం మద్దతుగా నిలవడంతో దళితులు ఎవ్వరికి చెప్పుకోవాలో  తెలియక సతమతమవుతున్నారు.   

చేజర్ల మండలం పుల్లనీళ్లపల్లిలో సర్వే నంబర్లు 183, 185, 191లోని 40 ఎకరాల పెన్నా  పొరంబోకును దివంగత సీఎం వైఎస్సార్‌ హయాంలో నలబై దళిత కుటుంబాలకు పంపిణీ చేశారు. కొందరికి పాసు పుస్తకాలు సైతం అందజేశారు. మరికొందరికి హద్దులు చూపాల్సి ఉంది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఈ భూములపై కన్నేసిన టీడీపీ నేత  దళితుల నుంచి పాసుపుస్తకాలు తీసుకుని తన ఆధీనంలో ఉంచుకున్నాడు. గ్రామ నాయకుడే కదాని నమ్మిన దళితులు పాసుపుస్తకాలు అందజేశారు. పెన్నా పొరంబోకును సదరు నాయకుడు చదును చేసి తన ఆధీనంలో ఉంచుకుని దర్జాగా వేరుశనగ సాగుకు ఇతర ప్రాంతాల వారికి(రామతీర్థ, అల్లూరు) లీజుకు ఇచ్చాడు. ఏటా ఎకరాకు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు వివిధ స్థాయిల్లో లీజు దండుకుంటున్నాడని బాధితులు తెలిపారు.

గ్రామంలోని శ్మశాన వాటిక వెనుక ఉన్న పెన్నా పొరంబోకు సుమారు 30 ఎకరాలకు పైగా ఆక్రమించి వివిధ బినామీ పేర్లతో పట్టాలు సైతం తెచ్చుకున్నాడు. పొలాల వద్దకు పెన్నా నదిలోనే మెటల్‌ రోడ్డు సైతం వేసుకున్నాడు. ఈ భూమిలో దర్జాగా విద్యుత్‌ శాఖ అధికారుల సాయంతో ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేయించుకుని  మోటార్లు బిగించి ఏటా రెండు పంటలు వేరుశనగ సాగుకు లీజుకు ఇస్తున్నాడు. ఇలా పెన్నా పొరంబోకు 70 ఎకరాలను అధికారం అండతో కబ్జా చేశాడు. సంగం రోడ్డు పక్కనే సర్వే నంబర్‌ 511లోని 12 ఎకరాలు ప్రభుత్వ భూమిని ఆక్రమించాడు. ఇందులోని 8 ఎకరాలను తాను వేరే వ్యక్తుల వద్ద కొనుగోలు చేసినట్లు చెప్పుకుంటున్నాడు. ఈ భూమి సమీపంలో దళితుడైన సబ్బు పుల్లయ్యకు  ఉన్న 4 ఎకరాల భూమిని తన భూమిలో కలిపేసుకున్నాడు.  పుల్లయ్య, ఆయన కుమారుడు వెంకటేశ్వర్లు భూమి తమదని, గతంలో బోర్లు సైతం వేసుకున్నామని చెబుతున్నా వారి వేదన అరణ్య రోదనగా మారింది.


తహసీల్దార్‌కు ఫిర్యాదు 
గత మూడ్రోజుల క్రితం చేజర్ల తహసీల్దార్‌ విజయజ్యోతికి టీడీపీ నేత భూముల ఆక్రమణపై దళిత యువకుడు ఫిర్యాదు చేశారు. దీంతో తహసీల్దార్‌ విచారణ జరపాలని స్థానిక వీఆర్వోను ఆదేశించింది. అయితే టీడీపీ నేతకు వత్తాసు పలికే సదరు వీఆర్వో తూతూ మంత్రంగా విచారణ జరిపాడు. టీడీపీ నేత ఆధీనంలో ఉండే భూమి సర్వే నంబరు 179లో ఉందని తహసీల్దార్‌ను పక్కదారి పట్టించాడు.

వీఆర్వో కీలక పాత్ర 
టీడీపీ నేత కబ్జాల పర్వంలో స్థానికంగా పనిచేస్తున్న వీఆర్వో కీలక సూత్రధారిగా వ్యవహరిస్తున్నాడు. వీఆర్వో ప్రభుత్వ భూములకు బినామీ పేర్లతో పట్టాలు తయారు చేసి అడంగల్‌లో సైతం నమోదు చేయించి నాయకుడికి అప్పగించాడని దళితులు ఆరోపిస్తున్నారు. సదరు వీఆర్వో ఏడేళ్లుగా గ్రామంలోనే పనిచేస్తున్నాడు. 2016లో ఓ మారు బదిలీ అయినా టీడీపీ నేత అండతో కొద్ది రోజులకే గ్రామానికి మళ్లీ బదిలీ చేయించుకున్నాడు. ఇటీవల ప్రభుత్వం మారడం..తహసీల్దార్‌ సైతం భూములపై విచారణ జరపాలని ఆదేశించడంతో వేరే ప్రాంతానికి బదిలీ చేయించుకునేందుకు ప్రయత్నిస్తుండడం గమనార్హం. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపి ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకోవడంతో పాటు తమ భూములను అప్పగించాలని దళితులు వేడుకుంటున్నారు. 

పాసుపుస్తకం తీసుకుని బెదిరిస్తున్నాడు
ప్రభుత్వం భూమితో పాటు పట్టా పాసుపుస్తకం సైతం మంజూరు చేసింది. ఏడాది పాటు సాగు చేసుకున్న తరువాత నా పాసు పుస్తకాన్ని టీడీపీ నాయకుడు తీసుకున్నాడు. ఇప్పుడు భూమి  తనదేనని అడుగు పెట్టనీయడం లేదు. ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలి.  
– ఎం నరసింహులు, పుల్లనీళ్లపల్లి

అధికారులు న్యాయం చేయాలి
ప్రభుత్వం మంజూరు చేసిన భూమిని టీడీపీ నాయకుడు తన ఆధీనంలో ఉంచుకున్నాడు. ప్రభుత్వం భూములు మంజూరు చేసినట్లు ఆయనే చెప్పడంతో నమ్మకంతో పట్టించుకోలేదు. తీరా ఇప్పుడు అడిగితే అసలు మీకు హక్కే లేదంటూ దాష్టీకానికి పాల్పడుతున్నాడు. అధికారులు స్పందించి న్యాయం చేయాలి. 
–  బొర్రా పెద్దన్న, పుల్లనీళ్లపల్లి

భూమిని ఆక్రమించాడు
మా తాతల కాలం నుంచి సర్వేనంబర్‌ 511లోని భూమిని సాగు చేసుకుంటున్నాం. మూడేళ్ల కిందట బోర్లు సైతం వేయించుకున్నాం. గత ప్రభుత్వ హయాంలో టీడీపీ నేత భూమిని ఆక్రమించుకుని అడిగితే దౌర్జన్యానికి పాల్పడుతున్నాడు. 
– సబ్బు వెంకటేశ్వర్లు, పుల్లనీళ్లపల్లి

భూముల సర్వేకు ఆదేశించాం
టీడీపీ నేత అక్రమణలపై బాధితులు ఫిర్యాదు చేశారు. పెన్నా పొరంబోకు భూములపై సర్వే జరపాలని సర్వేయర్‌కు సూచించాం. ఆక్రమణలను గుర్తించి తొలగించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆర్‌ఐ, వీఆర్వోలను ఆదేశించాం. 
–విజయజ్యోతికుమారి, తహసీల్దార్, చేజర్ల 

Read latest Psr-nellore News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా