మేం చేసిందే శాసనం.. వేసిందే శిలాఫలకం

9 Mar, 2019 12:33 IST|Sakshi
కరవది–గుండాయపాలెం రోడ్డు అభివృద్ధి పని శిలాఫలకంలో లేని కాంట్రాక్టర్‌ వివరాలు

ఏం చేసినా చెల్లుతుందన్న భావనలో టీడీపీ నేతలు

శిలాఫలకాలతో హడావుడి

కరవది–గుండాయపాలెం రోడ్డు అభివృద్ధి పని కేటాయింపులో రాజకీయం

సాక్షి, ఒంగోలు సిటీ: హవ్వ..నవ్విపోదురు..నాకేంటీ. ఇదీ టీడీపీ నేతల వరస. మేం రారాజులం అనుకుంటున్నారు. అధికారం మాదే. మేం చెప్పిందే అధికారులు వింటారు. ఏం చేసినా చెల్లుతుందనుకుంటున్నారు. అడిగే వారు ఎక్కడున్నారనుకుంటున్నారు. ఇక  ఇష్టారాజ్యంగా ఎలాంటి పని చేసినా  కొందరు అధికారులు వంత పాడుతున్నారు. తాజాగా ఒంగోలు నియోజకవర్గంలోని కరవది–గుండాయపాలెం రోడ్డు అభివృద్ధి పని కేటాయింపులో అడ్డగోలు వ్యవహారాలు చోటు చేసుకున్నాయి.  ఇంకా టెండర్‌ ఎవరికి ఇవ్వాలో తేలలేదు. గుత్తేదారుని వివరాలు లేవు. దస్త్రమేమో ఆర్‌అండ్‌బీ చీఫ్‌ ఇంజనీరు వద్ద పెండింగ్‌లో ఉంది. అయినా రోడ్డు పనికి శంకుస్థాపన చేసి శిలాఫలకాన్ని వేశారు. ఇదేమి చోద్యమన్న విమర్శలు వస్తున్నాయి.

ఇదీ నేపథ్యం..

ఒంగోలు నియోజకవర్గంలోని కరవది–గుండాయపాలెం మార్గంలో దెబ్బతిన్న రోడ్డును అభివృద్ధి చేయడానికి మేజర్‌ డిస్ట్రిక్ట్‌ ప్లాను కింద నిధుల కేటాయింపు జరిగింది. 0/0 కిమీ నుంచి 13.200 కిమీ పొడవున రోడ్డు అభివృద్ధి పనులకు డిజైన్‌ చేశారు. ఈ పనికి రూ.18 కోట్లు అంచనా వేసి, గత ఏడాది అక్టోబర్‌లో ఈ పనికి టెండర్‌ పిలిచారు. ఇందులో ఎక్కువ భాగం మట్టి పని ఉన్నందున కాంట్రాక్టర్‌కు మంచి లాభం వస్తుంది. పై పెచ్చు అంచనాలు కూడా అధికంగా చూపించారు. దీంతో గుత్తేదారులు పని దక్కించుకోవడానికి పోటీ పడ్డారు. టీడీపీ నాయకుల నుంచి ఈ పని మాకు కావాలంటూ చెప్పకుండా టెండర్లు వేయవద్దని హుకుం ఉన్నా దానిని లెక్క చేయకుండా కొందరు కాంట్రాక్టర్లు టెండర్లు వేశారు. తీరా టెండర్లు తెరిచే సమయానికి ముగ్గురు బరిలో మిగిలారు. ఇందులో ఆరికట్ల వెంకటేశ్వర్లతోపాటు మరో ఇద్దరు మాధవి ఇంజినీరింగ్, మిత్ర ఇంజినీరింగ్‌ కంపెనీలు ఈ పని కోసం టెండర్లు వేశాయి. ఇక్కడే అసలు మెలిక పడింది. 

ఏం తేలకుండానే శిలాఫలకం..

త్వరలోనే ఎన్నికల ప్రకటన జారీ అవుతుందన్న సంకేతాలు వచ్చిన నేపథ్యంలో ఈ వ్యవహారం ఎటూ తేలకుండానే టీడీపీ నేత శిలాఫలకాన్ని వేయించి రోడ్డు పనికి శంకుస్థాపన చేసినట్లుగా అన్పించుకున్నారు. వాస్తవానికి నిబంధనలకు విరుద్ధంగా చేసిన ఈ పనిలో అధికారుల పాత్ర లేకపోలేదు. అదే గ్రామంలో మరో పని కరవది– కొప్పోలు రోడ్డు  పని ఉంది. ఈ పని సుమారు రూ.4.7 కోట్లతో చేయాల్సి ఉంది. ఈ పనిని మిత్ర ఇంజినీరింగ్‌ కంపెనీ వారు టెండర్‌ ద్వారా తీసుకున్నారు. కాంట్రాక్టర్‌ ఈ పనికి కుదిరారు కాబట్టి పని ప్రారంభానికి శంకు స్థాపన చేయడం నియమాలకు, నిబంధనలకు వ్యతిరేకం కాదు. అసలు పని ఒప్పందం జరగకుండా, కాంట్రాక్టర్‌ ఎవరో తేలకుండా కరవది–గుండాయపాలెం రోడ్డు పనికి ఎలా శిలాఫలకం వేసి శంకుస్ధాపన చేస్తారని విమర్శలునెలకున్నాయి. ఇలాగైతే ఎవరు పడితే వారు.. ఎలాగైతే అలా నిబంధనలతో పని లేకుండా రూ.కోట్లు విలువైన పనులను తీసుకోవడం, పర్సంటేజీలను దండుకోవడం వంటి వ్యవహారాలను బహిరంగంగానే చేయడానికి ఈ తరహా పనులే వీలు కల్పిస్తున్నాయి కదా అన్న విమర్శలు నెలకొన్నాయి.

దస్త్రం సీఈ వద్ద పెండింగ్‌లో..

కరవది–గుండాయపాలెం రోడ్డు పని టెండర్‌ వివాదంలో చిక్కుకుంది. మాధవి, మిత్ర ఇంజినీరింగ్‌ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీల మధ్య పోటీ నెలకుంది. ఈ నేపథ్యంలోనే టీడీపీ నేత నేరుగా తాము అనుకున్న గుత్తేదారునికే పని ఇవ్వమని లేఖ రాశారు. ఈ లేఖపై ఆర్‌అండ్‌బీ మంత్రి, ఇతర రాష్ట్ర స్థాయి అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చారు. అక్టోబర్‌ నుంచి ఈ ఏడాది మార్చి వరకు ఆర్‌అండ్‌బీ అధికారులు కాలాన్ని నెట్టుకొచ్చారు. ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో ఎన్నికల్లో ఎవరు పట్టించుకుంటారనుకున్నారేమో హడావుడిగా శిలాఫలకం తయారు చేయించి శంకుస్థాపన చేశారు.

టీడీపీ నాయకులు చెప్పిందే వేదం..

టీడీపీ నాయకులు మాత్రం కాంట్రాక్టర్లకు ఇప్పుడైనా మించిపోయింది లేదు. టెండర్లను వెనక్కి తీసుకోమని ఒత్తిడి తెచ్చినా వీరు మాత్రం తొణకకుండా వేసిన టెండర్‌ను కదిలించలేదు. అధికారులు ఇక సమయం మించిపోతుందని భావించి టెండర్లను తెరిచారు. ఇందులో ఆరికట్ల వెంకటేశ్వుర్ల టెండర్‌ను సాంకేతికంగా పలు కారణాలను చూపించి తొలగించారు. ఇక మిగిలిన మాధవి, మిత్ర కంపెనీలకు చెందిన కాంట్రాక్టర్లులో మాధవి ఇంజినీరింగ్‌ వారు 6.66 శాతం పని అంచనాల కన్నా తక్కువ ధరకు కోట్‌ చేశారు. మిత్ర ఇంజినీరింగ్‌ వారు 4.95 శాతం పని అంచనా విలువ కన్నా అధికంగా కోట్‌ చేశారు. వీరిద్దరి మధ్య టెండర్‌లో సుమారు రూ.2 కోట్లకుపైగా తేడా ఉంది. తక్కువ ధర వేసిన వారికి టెండర్‌  ఇస్తే ప్రభుత్వానికి రూ.2 కోట్లు డబ్బు మిగులుతుంది. అలా కాదని సిఫార్సుకు తలొంచి నేత చెప్పిన వారికే టెండర్‌  ఇస్తే ప్రజల డబ్బు రూ.2 కోట్లకుపైగా దుర్వినియోగం అవుతుంది. ఇదంతా తెర వెనుక జరగాల్సిన పంచాయితీ తెర బయటకు వచ్చేసింది. ఒకరికొకరు  పోటీ పడడంతో వాస్తవాలు వెలుగు చూశాయి. అధికారులు  వ్యవహారంలో ఇరకాటంలో పడ్డారు. అధికార పార్టీ నేత మాత్రం అధికారులపై ఎలాగైనా ఈ పని చేసి మా గుత్తేదారునికే పని ఇవ్వాలని ఒత్తిడి తెచ్చారన్న విమర్శలున్నాయి.

అధికారుల అడ్డగోలుతనం

ఆరికట్ల వెంకటేశ్వర్లు తన టెండర్‌ను సాంకేతిక కారణాలతో తిరస్కరించారంటూ ఎలా..ఏవిధంగా..ఏ అంశాలను చూపించి తొలగించారని, తనకు న్యాయం చేయాలని హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో రిట్‌ పిటీషన్‌ నెంబర్‌ 41601/2018కింద విచారణ దశలో ఉంది. ఇదిలా ఉండగా ఆర్‌అండ్‌బీ అధికారులు అడ్డగోలుగా వ్యవహరించారన్న విమర్శలు నెలకొన్నాయి. పని ఎవరైనా ఆదాయం చేకూర్చి పెట్టే వారికి ఇస్తారు. ఇక్కడ మాత్రం  ఎక్కువ మొత్తానికి కోట్‌ చేసిన వారికి టెండర్‌ ఇవ్వడానికి నేత ఒత్తిడికి తలొగ్గి వ్యవహరించారన్న విమర్శలు నెలకొన్నాయి. ఒక వైపు హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉండగానే మరో వైపు టెండరుపై చర్యలు తీసుకోవడం అడ్డగోలు వ్యవహారాన్ని బట్టబయలు చేస్తోంది. కమిషనర్‌ ఆఫ్‌ టెండర్స్‌ (సీవోటీ) వారు కూడా ఇది తప్పని తిరస్కరించడం గమనార్హం. 94 జీవోను అనుసరించి 25.2 కండీషన్‌ ప్రకారం ఉన్న నిబంధనలను కూడా వీరు పాటించలేదని విమర్శలు ఉన్నాయి. ఎక్కువ మొత్తానికి కోట్‌ చేసిన గుత్తేదారుని వద్ద నుంచి వాలంటరీ రిబేటుకు ఒప్పందాన్ని తీసుకున్నారు.

జీవోలో ఎక్కువ ధరకు  కోట్‌ చేసిన వారి కన్నా తక్కువ ధర ఉన్న వారు ఉన్నప్పుడు ఎలాంటి సంప్రదింపులకు తావు లేదని నిబంధనలు స్పష్టం చేస్తున్నా వీటిని తుంగలో తొక్కి అధికారులు వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఒక వైపు ఆరికట్ల కోర్టు కేసు, మరో వైపు తక్కువ ధరకు టెండర్‌ వేసిన గుత్తేదారుని టెండర్‌ ఫోర్సులో ఉండగా ఎక్కువ మొత్తానికి కోట్‌ చేసిన గుత్తేదారునికి ఇవ్వమని సిఫార్సు చేయడం వెనుక రాజకీయ రగడ చోటు చేసుకుంది. అధికారులు ఈ సిఫార్సులను సీఈ వద్దకు పంపితే ఆయన ఇంకా చర్యలు తీసుకోలేదు. ఇంకా ఏ జవాబు రాయలేదు. హైకోర్టులో విచారణ పెండింగ్‌లో ఉంది. ఈ నేపథ్యంలోనే టీడీపీ నేత మాత్రం ఆత్రంగా ఈ వివాదాస్పద పనికి శంకుస్ధాపన చేయడం గమనార్హం. శిలాఫలకంపై కాంట్రాక్టర్‌ వివరాలు, ఇతర వివరాలు లేకుండానే అధికారుల పేర్లతో శిలాఫలకాన్ని ఆవిష్కరించడం విమర్శలకు తావిచ్చింది. మేం..రారాజులం అన్న అధికార పార్టీ నేత దర్పం ఈ వ్యవహారంతో ప్రజల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. 

మరిన్ని వార్తలు