ఓటు దొంగలున్నారు.. జాగ్రత్త!

5 Mar, 2019 13:30 IST|Sakshi

కలువాయిలో ఒక్కరోజే 2,200 ఫామ్‌–7 దరఖాస్తులు 

జిల్లాలోని పలు నియోజకవర్గంలో గెలుపోటములను తారుమారు చేసే ఓటర్లు సంఖ్య మూడు వేల నుంచి నాలుగువేలు మాత్రమే. ఇది గత ఐదు అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థుల మెజారిటీ చూస్తే తెలుస్తుంది. ఉదాహరణకు  2014లో టీడీపీ అభ్యర్థి కె.రామకృష్ణ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కొమ్మి లక్షయ్యనాయుడుపై 5,635 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. మూడు వేలు నుంచి నాలుగు వేలు ఓట్లు అటు పడాల్సినవి ఇటు పడితే ఫలితాలు తారుమారే. ఈ క్రమంలో ఈ ఏడాది ఎప్పుడూ లేని విధంగా ఓట్లు తొలగింపుల కోసం ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో వస్తున్న దరఖాస్తులు చూస్తుంటే ఎన్నికల్లో లబ్ధికోసం ఓ వర్గం చేస్తున్న పాలి ట్రిక్స్‌గా  న్యూట్రల్‌ ఓటర్లు అభిప్రాయ పడుతున్నారు.


సాక్షి, వెంకటగిరి: వెంకటగిరి నియోజకవర్గంలో ఫామ్‌–7 దరఖాస్తులు (ఓట్లు తొలగింపులకు సంబంధించిన ఫామ్స్‌) రోజు రోజుకు పెరుగుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ముఖ్యంగా ప్రతిపక్షపార్టీ సానుభూతిపరులైన ఓటర్లే లక్ష్యంగా వేల సంఖ్యల్లో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో నమోదవుతున్నాయిని వైఎస్సార్‌సీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. మొన్నటి వరకు చిత్తూరు జిల్లాకే పరిమితం అయిన  ఈ జాఢ్యం ఆ జిల్లా సరిహద్దు నియోజకవర్గం అయిన వెంకటగిరికీ పాకింది. ఎవరు చేస్తున్నారో.. ఎక్కడ నుంచి చేస్తున్నారో .. ఎందుకు చేస్తున్నారో.. ఇలా గంపగుత్తుగా వస్తున్న «ఓట్ల తొలగింపు దరఖాస్తులపై అధికారులు పక్కగా విచారణ చేపట్టి ఓట్లు దొంగల అక్రమాలకు చరమగీతం పాడాలని ప్రతిపక్షపార్టీ నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. అయితే దరఖాస్తులు వచ్చినంతమాత్రాన ఓట్లు తొలగించే ప్రసక్తే లేదని, క్షేత్రస్థాయిలో నోటీసులు జారీ చేసి విచారణ చేపట్టిన తరువాత సరైన  కారణాలతోనే ఓట్లు తొలగింపులు చేస్తామని అధికారులు చెబుతున్నా, అది క్షేత్ర స్థాయిలో ఎంత వరకు సాధ్యమని, అధికారపార్టీ ఒత్తిళ్లకు తలొగ్గకుండా అధికారులు వేలసంఖ్యలో వచ్చిన దరఖాస్తులపై విచారణ చేయడం సాధ్యమయ్యే పనికాదంటూ పలువురు పెదవి విరుస్తున్నారు. 
 

2,200 క్లెయిములతో విస్తుపోయిన అధికారులు
కలవాయి మండలంలో ఓటు తొలగింపులకు సంబంధించి మొత్తం 2,200 క్లెయిములు అందడంతో అధికారులు అవాక్కయ్యారు. ఈ దరఖాస్తులన్నీ రాత్రికి రాత్రే ఒక్క రోజే రావడంతో నియోజకవర్గ ఎన్నికల అధికారి మురళి మండలంలోని రెవెన్యూ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. పక్కాగా విచారణ చేపట్టాలని ఆదేశించారు. కలువాయి మండలంలోని 43 పోలింగ్‌ స్టేషన్లు ఉండగా 26 పోలింగ్‌ స్టేషన్ల పరిధిలో 26 మంది పేరున 2,263 ఫామ్‌–7 క్లెయిములు ఆన్‌లైన్‌లో నమోదయ్యాయి. ఈ క్లెయిములన్నీ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ బూత్‌ కమిటీ మాజీ కన్వీనర్లు, ప్రస్తుత కన్వీనర్ల పేరున దరఖాస్తులు అందాయి. వీటిలో మెజారిటీ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, సానుభూతిపరుల ఓట్లు కావడం గమనార్హం.  

ఈ ఫొటోలోని వ్యక్తి పేరు సామల మోహన్‌రెడ్డి. కలువాయి  మండలం బాలాజీ రావుపేటకు చెందిన వైఎ స్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ బూత్‌ కమిటీ కన్వీనర్‌. చిత్రమేమిటంటే మోహన్‌రెడ్డి తన ఓటును తొలగించాలని ఆన్‌లైన్‌ ద్వారా ఫామ్‌–7 దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు విచారణకు రావడంతో అవాక్కయ్యాడు. ఇంకా మోహన్‌రెడ్డి గ్రామానికి చెందిన మరో 30 మంది ఓట్లు తొలగించాలని ఆన్‌లైన్‌లో ఫామ్‌–7 దరఖాస్తు చేసినట్లు నమోదైందని అధికారులు మోహన్‌రెడ్డికి వివరించడంతో విస్తుపోయాడు. తనకు తెలియకుండా అలా ఎవరు చేశారో అర్థం కావడం లేద ని అధికారులు పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి దోషులను గుర్తించి శిక్షించాలని కోరుతున్నాడు.

 ఈ ఫొటోలోని వ్యక్తి పేరు చల్లా రమణారెడ్డి. కలువాయి మండలం బ్రాహ్మణపల్లికి చెందిన వైఎస్సార్‌సీపీ బూత్‌ కమిటీ కన్వీనర్‌గా పనిచేస్తున్నాడు. ఆయన పేరుతో 169 ఓట్లు తొలగించాలని ఆన్‌లైన్‌లో ఫామ్‌–7 దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు. ఆ క్లెయిమ్‌లలో మోహన్‌రెడ్డి భార్యతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, వైఎస్సార్‌సీపీకి  చెందిన వారి పేర్లు ఉన్నాయి. మోహన్‌రెడ్డికి తెలియకుండా ఆయన పేరుతో ఆన్‌లైన్‌లో క్లెయిములు పెట్టిన వారిని గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నాడు

దరఖాస్తులను పక్కాగా పరిశీలించాలి  
వెంకటగిరి నియోజకవర్గంలో వేలాదిగా వచ్చిన ఫామ్‌–7 దరఖాస్తులపై అధికారులు క్షేత్రస్థాయిలో పక్కాగా విచారణ జరిపించాలి. ప్రతి దరఖాస్తుకు సంబంధించి ఇంటింటికీ వెళ్లి విచారణ చేపట్టాలి. ఓట్లు తొలగింపులపై ఓటర్లలో ఉన్న ఆందోళనను తొలగించాల్సిన బాధ్యత అధికారులదే.


– జి.ఢిల్లీబాబు, వైఎస్సార్‌సీపీ పట్టణ కన్వీనర్, వెంకటగిరి

ఆన్‌లైన్‌లో వచ్చిన ఫారమ్‌–7 దరఖాస్తులు 

వెంకటగిరి  344
కలువాయి  2200
రాపూరు 145
సైదాపురం  683
బాలాయపల్లి 229
డక్కిలి 300
మొత్తం 3901


 

మరిన్ని వార్తలు