కేంద్ర బడ్జెట్‌ ట్రైలర్‌ మాత్రమే..

3 Feb, 2019 04:24 IST|Sakshi

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌ వ్యాఖ్య 

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌ ట్రైలర్‌ మాత్రమేనని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌ వ్యాఖ్యానించారు. ఈ బడ్జెట్‌ జనరంజకంగా ఉందని, ఇదే ఇంత బాగా ఉంటే.. జూలై లో ఉండే పూర్తిస్థాయి వార్షిక బడ్జెట్‌ ఎలా ఉంటుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చని చెప్పారు. శనివారం నిజా మాబాద్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.స్వాతంత్య్రం వచ్చాక తొలిసారిగా పేదలకు పది శాతం రిజర్వేషన్లు అందించాలనే నిర్ణయం ప్రభుత్వం తీసుకుందన్నారు. రూ.5 లక్షల ఆదాయం పన్ను మినహాయింపు నిర్ణయంతో దేశంలో నాలుగు కోట్ల మధ్యతరగతి ప్రజలకు లబ్ధి చేకూరుతుందని చెప్పారు. అసంఘటితరంగ కార్మికులకు రూ.3 వేల పెన్షన్‌ పథకంతో సుమారు 30 కోట్ల మందికి ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు.  

తెలంగాణ రైతులకు బంపర్‌ ఆఫర్‌
బడ్జెట్‌లో రైతుబంధు పథకాన్ని కాపీ కొట్టారనే విమర్శలను రాంమాధవ్‌ ఖండించారు. కేంద్రం రైతులకు రూ.6 వేలు ఇస్తూ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించాల్సింది పోయి.. విమర్శించడం తగదన్నారు. రాష్ట్రం ఇచ్చే పెట్టుబడి సాయం తోపాటు, కేంద్రం ఇచ్చే డబ్బులు కూడా రైతులకు అందుతాయన్నారు. రాష్ట్ర ప్రజలకు ఇది బంపర్‌ ఆఫర్‌ అని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ప్రస్తావన లేదని ప్రశ్నించగా.. ఏపీ ప్రజా ప్రతినిధులకు నిరసన తెలపడం తప్ప వేరే పనిలేదన్నారు.  

మోదీ భయంతోనే కేసీఆర్‌ ముందస్తుకు..
ప్రధాని మోదీ హవాలో ఓటమి పాలవుతామనే భయంతోనే సీఎం కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్లారని రాంమాధవ్‌ విమర్శించారు. మోదీకి దీటైన నాయకులు ఏ పార్టీలో లేరన్నారు. ఫ్రంట్ల పేరుతో విజయవాడ నుంచి ఒకరు, హైదరాబాద్‌ నుంచి ఒకరు చేస్తున్న ప్రయత్నాలు ఫలించవన్నారు. 

13న రాష్ట్రానికి అమిత్‌షా.. 
ఈ నెల 13న నిజామాబాద్‌లో జరిగే పార్టీ కార్యకర్తల సమావేశానికి బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్‌ షా హాజరుకానున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్‌ తెలిపారు. ఫిబ్రవరి 5న కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ సికింద్రాబాద్, మల్కాజ్‌గిరి, హైదరాబాద్‌ పార్లమెంట్‌కు సంబంధించి బూత్‌ ఇన్‌చార్జిల సమ్మేళన కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు.    

మరిన్ని వార్తలు