గట్టెక్కిన జ్వెరెవ్‌

29 May, 2019 03:24 IST|Sakshi

ఐదు సెట్‌ల పోరులో నెగ్గిన జర్మనీ యువతార

కష్టపడి గెలిచిన టాప్‌ సీడ్‌ ఒసాకా

తొలి రౌండ్‌లోనే ఓడిన మాజీ చాంపియన్‌ ఒస్టాపెంకో

పారిస్‌: ఫ్రెంచ్‌ ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌ విభాగంలో టైటిల్‌ ఫేవరెట్స్‌లో ఒకడైన అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ అతికష్టమ్మీద తొలి రౌండ్‌ అడ్డంకిని అధిగమించాడు. 21 ఏళ్ల ఈ జర్మనీ యువతార మంగళవారం జరిగిన తొలి రౌండ్‌ మ్యాచ్‌లో 7–6 (7/4), 6–3, 2–6, 6–7 (5/7), 6–3తో జాన్‌ మిల్‌మన్‌ (ఆస్ట్రేలియా)పై నెగ్గి ఊపిరి పీల్చుకున్నాడు. 4 గంటల 11 నిమిషాలపాటు జరిగిన ఈ పోరులో జ్వెరెవ్‌ వరుసగా రెండు సెట్‌లలో నెగ్గినా... ఆ తర్వాతి రెండు సెట్‌లను కోల్పోయాడు. అయితే నిర్ణాయక ఐదో సెట్‌లో తేరుకొని విజయాన్ని దక్కించుకున్నాడు. గతేడాది యూఎస్‌ ఓపెన్‌లో రోజర్‌ ఫెడరర్‌ను ఓడించిన మిల్‌మన్‌ నాలుగో సెట్‌లో 2–4తో వెనుకబడిన దశలో పుంజుకొని స్కోరును సమం చేశాడు.

టైబ్రేక్‌లో సెట్‌ను గెలిచి జ్వెరెవ్‌కు చెమటలు పట్టించాడు. అయితే నిర్ణాయక ఐదో సెట్‌లోని ఎనిమిదో గేమ్‌లో మిల్‌మన్‌ సర్వీస్‌ను బ్రేక్‌ చేసి, తొమ్మిదో గేమ్‌లో తన సర్వీస్‌ను నిలబెట్టుకొని జ్వెరెవ్‌ ప్రత్యర్థి ఆట కట్టించాడు. ఇతర తొలి రౌండ్‌ మ్యాచ్‌ల్లో ఎనిమిదో సీడ్‌ డెల్‌ పొట్రో (అర్జెంటీనా) 3–6, 6–2, 6–1, 6–4తో నికొలస్‌ జారీ (చిలీ)పై, తొమ్మిదో సీడ్‌ ఫాగ్‌నిని (ఇటలీ) 6–3, 6–0, 3–6, 6–3తో ఆండ్రియా సెప్పి (ఇటలీ)పై, పదో సీడ్‌ ఖచనోవ్‌ (రష్యా) 6–1, 6–1, 6–4తో స్టెబ్‌ (జర్మనీ)పై గెలిచి రెండో రౌండ్‌లోకి ప్రవేశించారు.మహిళల సింగిల్స్‌ విభాగంలో టాప్‌ సీడ్, ప్రపంచ నంబర్‌వన్‌ నయోమి ఒసాకా (జపాన్‌) రెండో రౌండ్‌ చేరేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.

ప్రపంచ 90వ ర్యాంకర్‌ అనా కరోలినా ష్మెదిలోవా (స్లొవేకియా)తో జరిగిన తొలి రౌండ్‌లో ఒసాకా 0–6, 7–6 (7/4), 6–1తో నెగ్గింది. గంటా 54 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఒసాకా 38 అనవసర తప్పిదాలు చేసింది. మరో మ్యాచ్‌లో 2017 ఫ్రెంచ్‌ ఓపెన్‌ చాంపియన్‌ జెలెనా ఒస్టాపెంకో (లాత్వియా) వరుసగా రెండో ఏడాది తొలి రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టింది. ప్రపంచ మాజీ నంబర్‌వన్‌ విక్టోరియా అజరెంకా (బెలారస్‌) 6–4, 7–6 (7/4)తో ఒస్టాపెంకోను ఓడించింది. ఈ మ్యాచ్‌లో ఒస్టాపెంకో ఏకంగా 60 అనవసర తప్పిదాలు చేయడం గమనార్హం. మరో మ్యాచ్‌లో 17వ సీడ్‌ అనా కొంటావీట్‌ (ఎస్తోనియా) 6–3, 2–6, 2–6తో కరోలినా ముచోవా (చెక్‌ రిపబ్లిక్‌) చేతిలో ఓడిపోయింది.   

Read latest Quote News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు