సిరిసిల్లలో మెగా పవర్‌లూమ్‌ క్లస్టర్‌

21 Jan, 2018 03:02 IST|Sakshi

ఏర్పాటు చేయాలని కేంద్రానికి మంత్రి కేటీఆర్‌ లేఖ

సాక్షి, హైదరాబాద్‌:  టెక్స్‌టైల్‌ రంగం సమగ్రాభివృద్ధి కోసం సిరిసిల్లలో మెగా పవర్‌లూమ్‌ క్లస్టర్‌ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. సిరిసిల్లలో పవర్‌లూమ్‌ యూనిట్ల అభివృద్ధికోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు కేంద్రం అండగా ఉండాలన్నారు. సమీకృత పవర్‌లూమ్‌ క్లస్టర్‌ అభివృద్ధి పథకం (సీపీసీడీఎస్‌) కింద సిరిసిల్లకు మెగా క్లస్టర్‌ను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్ర జౌళి శాఖ మంత్రి స్మృతి ఇరానీకి లేఖ రాశారు. సిరిసిల్ల ప్రాంతంలో సుమారు 80 శాతం మంది పవర్‌ లూమ్‌ రంగంపైనే ఆధారపడి ఉన్నారని కేటీఆర్‌ ఆ లేఖలో పేర్కొన్నారు. దాదాపు 36 వేల పవర్‌లూమ్‌ యూనిట్లు అక్కడ ఉన్నాయన్నారు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా పవర్‌ లూమ్‌లను ఆధునీకరించకపోవడంతో అధిక విద్యుత్‌ వినియోగం జరుగుతోందన్నారు. అంతేకాకుండా నిర్వాహకులకు పెట్టుబడి స్థోమత సరిగా లేకపోవడంతో ముడిసరుకు కోసం వ్యాపారులపైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఉందన్నారు.

అలాగే నైపుణ్యంగల కార్మికులు, మౌలిక సౌకర్యాల కొరత వేధిస్తోందన్నారు. ఈ సమస్యలవల్ల దేశంలోని మిగతా పవర్‌లూమ్‌ పరిశ్రమలతో సిరిసిల్ల పోటీపడలేకపోతోందని పేర్కొన్నారు. వీటిని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం సిరిసిల్ల పవర్‌లూమ్‌ రంగానికి తక్షణ ఉపశమనం కలిగించేందుకు కొన్ని చర్యలు తీసుకుందన్నారు. అందులో భాగంగానే స్కూల్‌ యూనిఫాంలతో పాటు ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగంగా పేదలకు అందించేందుకు చీరలకు ఆర్డర్‌లను ఇచ్చిందని వివరించారు. అలాగే ప్రభుత్వ విభాగాలకు అవసరమైన దుస్తులను కొనడం వం టి కార్యక్రమాలను చేపట్టిందని తెలిపారు. అయితే సిరిసిల్ల పవర్‌ లూమ్‌ రంగం సమగ్రాభివృద్ధికి మరిన్ని చర్యలు అవసరమని, ఇందుకోసం మెగా పవర్‌లూమ్‌ క్లస్టర్‌ను ఏర్పాటు చేస్తే ఈ రంగంపై ఆధారపడ్డ వేలాది మందికి గరిష్ట ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు. 2013–14లో ఈరోడ్, భివండీ ప్రాంతాల్లో మెగా పవర్‌లూమ్‌ క్లస్టర్‌లను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని కేటీఆర్‌ గుర్తు చేశారు. వాటి ఏర్పాటుతో అక్కడ గణనీయమైన అభివృద్ధి జరిగిందన్నారు. అదే తరహాలో సిరిసిల్ల కార్మికులకు కూడా చేయూతనివ్వాలని కోరారు.   

జ్యూరిచ్‌లో కేటీఆర్‌కు ఘన స్వాగతం
దావొస్‌లో జరుగుతున్న వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరంలో పాల్గొనేందుకు స్విట్జర్లాండ్‌ చేరుకున్న పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌కు జ్యూరిచ్‌ విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. ప్రవాస భారతీయులు, టీఆర్‌ఎస్‌ ఎన్నారై విభాగం నేతలు కేటీఆర్‌కు పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు. 5 రోజుల పర్యటనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి బృందం శనివారం జ్యూరిచ్‌ చేరుకుంది. ఆదివారం ఇక్కడ పలు సమావేశాల్లో పాల్గొన్న అనంతరం ఈ బృందం దావోస్‌లో జరగనున్న ప్రపంచ ఎకనమిక్‌ ఫోరం సదస్సుకు వెళ్లనుంది. కేటీఆర్‌ ప్రత్యేక ఆహ్వానితుడిగా సదస్సుకు హాజరవుతున్నారు. 22 నుంచి 26 వరకు ఫోరంలో కేటీఆర్‌ పలు కంపెనీల ప్రతినిధులతో సమావేశం కావడంతోపాటు, సమావేశాల్లో ప్రసంగిస్తారు. ఎన్నారై టీఆర్‌ఎస్‌ నాయకులు మహేష్, అనిల్‌ కూర్మాచలం, అశోక్, నవీన్, తెలంగాణ జాగృతి యూకే ప్రతినిధి స్పందన మంత్రికి స్వాగతం పలికారు.  

Read latest Rajanna News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు