రాజన్న గుడిచెరువులో శివద్వీపం

21 Jan, 2018 03:08 IST|Sakshi
శివుని విగ్రహం నమూనా చిత్రపటం

     వీటీడీఏ సమావేశంలో నిర్ణయం 

     తుది నివేదిక సిద్ధం  

     నేడు నిర్వాసితులకు రూ.6.38 కోట్లు పంపిణీ 

వేములవాడ: వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి గుడిచెరువులో శివద్వీపం నిర్మించేందుకు వీటీడీఏ నిర్ణయించింది. వేములవాడ ఆలయ అభివృద్ధి అథారిటీ(వీటీడీఏ) వైస్‌ చైర్మన్‌ ఎం.పురుషోత్తంరెడ్డి అధ్యక్షతన శనివారం హైదరాబాద్‌లో నాలుగు గంటలపాటు సమావేశం నిర్వహించారు. సీఎం కేసీఆర్‌ వేములవాడలో రెండు పర్యాయాలు పర్యటించి వెళ్లాక రాజన్న గుడి, నాంపల్లిగుట్ట, పట్టణ అభివృద్ధికి ప్రత్యేకంగా వీటీడీఏ ఏర్పాటు చేశారు. ఇందుకోసం రూ.400 కోట్లతో ప్రణాళిక సిద్ధం చేశారు. ఓ పర్యాయం శృంగేరి పీఠాధిపతి అనుమతి తీసుకున్నారు. వీటిపై రూపొందించిన పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ను కమిటీ పరిశీలించింది.

రాజన్నగుడి అభివృద్ధి కోసం 35 ఎకరాల్లో పనులు చేపట్టాలని, గుడిచెరువులోని 9 ఎకరాల్లో శివద్వీపం ఏర్పాటు చేసి శివుని భారీ విగ్రహం నెలకొల్పాలని, కట్టకింద బస్టాండ్‌ను రైల్వేస్టేషన్‌తో అనుసంధానించాలని, అక్కడి నుంచి భక్తులు నేరుగా ఆలయంలోకి వచ్చేందుకు ర్యాంపు ఏర్పాటు చేయాలని, బద్ధిపోచమ్మ ఆలయంలో రూ.20 కోట్ల వ్యయంతో బోనాల మంటపం నిర్మించాలని, సంకెపల్లి వద్ద చెక్‌డ్యాం నిర్మించి పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దాలని తీర్మానించారు.

గుడిచెరువులో ఏడాదిపొడవునా గోదావరి జలాలు అందుబాటులో ఉండేలా రూ.17 కోట్ల వ్యయంతో మిడ్‌మానేరు డెడ్‌స్టోరేజీ నుంచి నీటిని పంపింగ్‌ చేయాలని నిర్ణయించారు. తుది నివేదికను త్వరలో సీఎం కేసీఆర్‌కు సమర్పించాలని భావిస్తున్నారు. సమావేశంలో ఎమ్మెల్యే రమేశ్‌బాబు, వీటీడీఏ సెక్రటరీ భుజంగరావు, ఈవో దూస రాజేశ్వర్, ఈఈ రాజయ్య, డీఈ రఘునందన్, ఆర్కిటెక్‌ నాగరాజు, ముక్తేశ్వర్‌ తదితరులు పాల్గొన్నారు. కాగా, నిర్వాసితుల కోసం తొలివిడత పరిహారంగా ఆదివారం రూ.6.38 కోట్లు పంపిణీ చేస్తామని ఎమ్మెల్యే రమేశ్‌బాబు తెలిపారు.  

మరిన్ని వార్తలు