దూరపు దేశంలో నరక యాతన

30 Dec, 2017 11:02 IST|Sakshi
అక్కెనపల్లి మల్లయ్య, గల్ఫ్‌ బాధితుడు

కంపెనీ బయట పనిచేసినందుకు జైలు శిక్ష

ఎట్టకేలకే ఇంటికి చేరిన మర్తనపేట వాసి

భార్య మృతి.. భిక్షాటనే గతి..

ఊరి బయట పశువుల గుడిసెలో నివాసం

రాజన్న సిరిసిల్ల: కోనరావుపేట మండలం మర్తనపేటకు చెందిన అక్కెనపల్లి మల్లయ్య(55) కూలి పనులు చేస్తూ జీవించేవాడు. ఆయన 1995లో బహ్రెయిన్‌ వెళ్లాడు. మనామ సిటీలో పనరానా కంపనీలో పనికి కుదిరాడు. నెలకు 45 దినార్ల జీతం. ఇండియన్‌ కరెన్సీలో రూ.4000. రెండేళ్ల పాటు పనిచేసి మర్తనపేట చేరాడు. అందరిలోనూ ఒకింత గుర్తింపు లభించింది. ఊరిలో భూమి కొనాలని అప్పట్లో రూ.85 వేలకు మూడెకరాల భూమిని కొనుగోలు చేశాడు. బయానాగా రూ.35వేలు చెల్లించి, మిగతా రూ.50 వేలను గల్ఫ్‌ వెళ్లాక పంపిస్తానని చెప్పాడు. ఎంతో సంతోషంతో మళ్లీ బహ్రెయిన్‌ వెళ్లిన మల్లయ్య.. ఆ కంపనీలో పనిచేస్తే భూమి అప్పు తీరదని భావించి బయటకు వెళ్లాడు. బయట పని చేస్తూ ఇంటికి నెలకు రూ.10వేల చొప్పున పంపాడు. రెండు నెలలకే వీసా గడువు తీరిపోయింది. పాస్‌పోర్టు లేదు. వీసా లేదు. అయినా అక్కడే పని చేస్తూ భూమికి డబ్బులు చెల్లించాడు. ఆ తర్వాత మల్లయ్యకు కష్టాలు మొదలయ్యాయి. వీసా లేదని పోలీసులు అరెస్ట్‌ చేసి జైలులో ఉంచారు.

ఇంటికి ఫోన్‌ చేసే అవకాశం లేదు. ఉత్తరం వేసే వీలు లేకపోయింది. బహ్రెయిన్‌ జైలులో ఉన్న మల్లయ్య సమాచారం భార్య లక్ష్మికి అందలేదు. ఐదేళ్లు జైలులో ఉండడంతో ఇంటి వద్ద భార్యకు ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. కొన్ని రోజుల తర్వాత ఆమె అనారోగ్యంతో మరణించింది. భార్య చనిపోయిన విషయమూ మల్లయ్యకు తెలియని దుస్థితి. కేరళకు చెందిన ఓ అధికారి జోక్యంతో మల్లయ్య జైలునుంచి బయటకు వచ్చారు. అప్పటికే అనారోగ్యంతో ఉన్న మల్లయ్య భిక్షాటన చేస్తూ బతుకుసాగించాడు. మళ్లీ పోలీసులు పట్టుకుని జైలులో వేశారు. మూడు నెలలకు జైలు నుంచి విముక్తి లభించింది. ఆరోగ్య క్షీణించి పక్షవాతం వచ్చింది. నడువలేని స్థితిలో ఉన్న మల్లయ్యకు ఊరిలో భార్య చనిపోయిన విషయం తెలిసింది. ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకొని బహ్రెయిన్‌లోని భారత రాయభార కార్యాలయాన్ని ఆశ్రయించాడు. సొంత ఊరి నుంచి నివాస ధ్రువీకరణ పత్రాలు పంపితేనే ఇండియాకు పంపిస్తామని స్పష్టం చేశారు. ఊరి నుంచి ధ్రువీకరణ పత్రాలు పంపేవారు లేకపోయారు. ఇలా పదేళ్ల పాటు అక్కడే భిక్షాటన చేస్తూ.. ఇండియాకు వచ్చే ప్రయత్నం చేశాడు. ఎంబసీ జోక్యంతో రెండేళ్ల కిందట ఇల్లు చేరాడు. 

ఊరవతల ఒంటరిగా..
మల్లయ్య ఊరి బయట పూరి గుడిసెలో నివాసం ఉంటున్నాడు. ఊరిలో స్థలం లేక.. ఇల్లు లేక పశువుల కోసం వేసి గుడిసెలో బతుకు సాగిస్తున్నాడు. ఊరిలోని వాళ్లే మల్లయ్యకు ఏడాదిగా తిండి పెడుతున్నారు. ఇంటింటికి వెళ్లి భిక్షాటన చేస్తున్నాడు. ప్రభుత్వం ఆసరా పింఛన్‌ మంజూరు చేసింది. రూ.1500 పింఛన్‌ డబ్బులతో మల్లయ్య జీవిస్తున్నాడు. మూడు చక్రాల సైకిల్‌ను     ప్రభుత్వం ఇచ్చింది.

రూ.10 లక్షల ప్రమాద బీమా
గల్ఫ్‌తో సహా 18 ఈసీఆర్‌ దేశాలకు వెళ్లే ఈసీఆర్‌ కేటగిరీ పాస్‌పోర్ట్‌ కలిగిన కార్మికులకు భారత ప్రభుత్వం ‘ప్రవాసీ భారతీయ బీమా యోజన’ అనే ఇన్సూరెన్స్‌ పథకాన్ని ’మాండేటరీ’ (చట్టప్రకారం తప్పనిసరి) గా అమలు చేస్తున్నది. 2017 ఆగస్టు 1 నుంచి కొన్ని నిబంధనలను సరళతరం చేశారు. రూ.10 లక్షల ప్రమాద బీమా విదేశాలతోపాటు, భారత్‌లో కూడా వర్తిస్తుంది. యజమాని మారిన సందర్భంలో కూడా వర్తిస్తుంది. రెండేళ్ల కోసం రూ.275, మూడేళ్ళ కోసం రూ.375 ప్రీమియం చెల్లించాలి. ఆన్‌లైన్‌లో కూడా రెన్యూవల్‌ చేసుకోవచ్చు. గాయాలు, అనారోగ్యం, జబ్బు, వ్యాధుల చిత్సకు రూ.ఒక లక్ష ఆరోగ్య బీమా వర్తిస్తుంది. భారత్‌లో ఉన్న కుటుంబ సభ్యుల చికిత్సకు రూ.50 వేలు, మహిళా ప్రవాసీ కార్మికుల ప్రసూతి సాయం రూ.35 వేలు, విదేశీ ఉద్యోగ సంబంధ న్యాయ సహాయం కోసం రూ.45 వేలు, మెడికల్‌ అన్‌ఫిట్‌ గానీ, ఒప్పందం కంటే ముందే ఉద్యోగం కోల్పోయిన సందర్భంలో గానీ విదేశం నుంచి భారత్‌కు రావడానికి విమాన ప్రయాణ టికెట్టు ఇస్తారు. ప్రమాదంలో చనిపోయినప్పుడు శవపేటికను తరలించడానికి, ప్రమాదం వలన శాశ్వత అంగవైకల్యం ఏర్పడినప్పుడు కూడా విమాన ప్రయాణ టికెట్టు ఇస్తారు. ఇన్సూరెన్స్‌ క్లెయిమ్‌ను https://emigrate.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు.

ఇల్లు చేరుతానని అనుకోలేదు..
జైలులో అనేక కష్టాలు పడ్డాను. మన తెలుగువాళ్లు చాలా మంది కలిసే వాళ్లు. అనారో గ్యంతో పక్షవాతం రావడంతో పనిచేయలేకపోయాను. ఇండియాకు వచ్చేందుకు చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. పుట్టిపెరిగిన ఊరిలో కన్ను మూయాలని అనుకున్నారు. మర్తనపేటలోనే ఉంటున్నా. నాకొచ్చిన కష్టాలు పగోళ్లకు కూడా రావద్దు. – అక్కెనపల్లి మల్లయ్య, గల్ఫ్‌ బాధితుడు

సౌదీలో కనీస వేతనాలు  
భారత ప్రభుత్వం 2014లో సౌదీ ప్రభుత్వానికి ప్రతిపాదించిన కనీస వేతనాలు ఈవిధంగా ఉన్నాయి. భవన నిర్మాణ కూలీలు, నైపుణ్యం లేని, పాక్షిక నైపుణ్యం కలిగిన కూలీలు, క్లీనర్లు, ఇంటి పని మనుషులు, అన్ని రకాల హెల్పర్లు, గార్డెనర్లు, వ్యవసాయ కూలీలకు 1500 రియాళ్ళు. నైపుణ్యం కలిగిన తాపీ మేస్త్రీలు, కార్పెంటర్లు, స్టీల్‌ ఫిక్సర్లు, ప్లంబర్లు, వెల్డర్లు, క్రేన్‌ ఆపరేటర్లు, ఏసీ టెక్నీషియన్లు, ఫ్యాబ్రికేటెర్లు, డెంటర్లు, టైల్‌ ఫిక్సర్లు, మెకానిక్లు,  జనరల్‌ ఎలక్ట్రీషియన్లు, ఆటో ఎలక్ట్రీషియన్లు, డెకొరేటర్లు, టైలర్లు, మత్స్యకారులతోపాటు హోటళ్లలో పనిచేసే వంట మనుషులు, వేటర్లు, సూపర్‌వైజర్లకు 1700. భారీ యంత్రాలు నడిపే ఆపరేటర్లకు 1900 రియాళ్లు. నర్సు, లాబ్‌ టెక్నీషియన్, ఎక్స్రే టెక్నీషియన్, క్లర్కు, సెక్రటరీ లాంటి వైద్య సిబ్బందికి 2100. అకౌంటెంట్, కంప్యూటర్‌ ఆపరేటర్, డ్రాఫ్ట్‌మన్‌లకు 2500. కంప్యూటర్‌ ప్రోగ్రామర్‌కు 3500 రియాళ్ళు.

జనవరి 3న ఢిల్లీలో ఓపెన్‌ హౌజ్‌
గల్ఫ్‌తో సహా 18 ఈసీఆర్‌ దేశాలకు వలస వెళ్లేవారు, వాపస్‌ వచ్చినవారి సమస్యలను వినడానికి ప్రతినెల మొదటి బుధవారం ఢిల్లీలోని విదేశాంగ శాఖ, ప్రొటెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ ఎమిగ్రెంట్స్‌ (పీజీఈ) కార్యాలయంలో ’ఓపెన్‌ హౌస్‌’ (ప్రవాసి ప్రజావాణి) నిర్వహిం చనున్నారు. జనవరి 3న బుధవారం ఢిల్లీలోని చాణక్యపురి, అక్బర్‌ భవన్‌లో గల పీజీఈ కార్యాలయంలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ’ఓపెన్‌ హౌస్‌’ నిర్వహిస్తారు. వివరాలకు ఫోన్‌ నెం. 011 2467 3965 ఈ–మెయిల్‌:pge@mea.gov.in లో సంప్రదించవచ్చు.(సిరిసిల్ల నుంచి వూరడి మల్లికార్జున్‌)

మరిన్ని వార్తలు