కొత్త గ్రామ పంచాయతీలు 231

18 Jan, 2018 11:19 IST|Sakshi

ప్రతిపాదనలు సిద్ధం చేసిన యంత్రాంగం

గ్రేటర్, మున్సిపాలిటీల్లో 40 పంచాయతీలు విలీనం

మ్యాపులు, స్కెచ్‌లు తయారు చేస్తున్న అధికారగణం

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : జిల్లాలో కొత్త గ్రామపంచాయతీల జాబితా రూపొందించడంపై బుధవారం అధికారులు కసరత్తు చేపట్టారు. జిల్లా పంచాయతీ విభాగం.. ప్రతిపాదిత గ్రామాల సర్వే నంబర్లు, మ్యాపుల రూపకల్పనపై దృష్టిసారించింది. ప్రస్తుతం జిల్లా పరిధిలో 415 గ్రామ పంచాయతీలుండగా తాజా ప్రతిపాదనలతో ఈ సంఖ్య 646కు చేరనుంది. అయితే, నగర శివార్లలోని పంచాయతీలను హైదరాబాద్‌ మహానగరపాలక సంస్థ(జీహెచ్‌ఎంసీ)లో విలీనం చేయాలనే ఆలోచన ప్రభుత్వ పరిశీలనలో ఉండడం.. కొన్ని గ్రామాలను మున్సిపాలిటీలలో కలపాలనే ప్రతిపాదనలు కూడా ఉండడంతో దాదాపు 40 గ్రామపంచాయతీలు జీహెచ్‌ఎంసీలో, మున్సిపాలిటీల్లో విలీనమయ్యే అవకాశం కనిపిస్తోంది. గండిపేట మండలంలోని మొత్తం గ్రామాలు జీహెచ్‌ఎంసీలో విలీనం కానుండగా శంషాబాద్, అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలాల్లో ఎక్కువ పంచాయతీలు గ్రేటర్‌లో కలవనున్నాయి. ఈ మేరకు ఇటీవల జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా పంపింది. మరోవైపు 15వేల జనాభా దాటిన పంచాయతీలను పురపాలక సంఘాలు కూడా చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీంతో ఆమనగల్లు కొత్త మున్సిపాలిటీగా ఆవిర్భవించనుంది. దీంతో ఒకవైపు ఇబ్బడిముబ్బడిగా పంచాయతీలు పెరిగినా.. మరోవైపు కొన్ని గ్రామాలు పంచాయతీరాజ్‌శాఖ నుంచి పురపాలక శాఖ పరిధిలోకి వెళ్లనున్నాయి.

231 పల్లెలకు పంచాయతీ శోభ
500 జనాభా కలిగి ఉండి.. ప్రస్తుత పంచాయతీకి 1.5 కిలోమీటరు దూరంలో ఉన్న ప్రతి పల్లెను గ్రామ పంచాయతీగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే 300 జనాభా ఉన్న ఆవాసాలను కూడా పంచాయతీలు ప్రతిపాదించవచ్చని స్పష్టం చేశారు. మైదాన ప్రాంతాల్లో మాత్రం 500 జనాభానే ప్రాతిపదికగా తీసుకోవాలని నిర్దేశించారు. దీంతో జిల్లావ్యాప్తంగా 231 పల్లెలకు కొత్తగా పంచాయతీ హోదా కలిగే అవకాశం కనబడుతోంది. గత నెలలో ప్రతిపాదించిన సంఖ్య కంటే తాజా కసరత్తులో పంచాయతీల జాబితా పెరగడం అధికారయంత్రాంగాన్ని ఆశ్చర్యపరిచింది. 500 జనాభాను కటాఫ్‌గా నిర్దేశించినందున ప్రతిపాదిత పంచాయతీల సంఖ్య తగ్గుతుందని అంచనా వేసింది. అయితే, ఈ సంఖ్య గణనీయంగా పెరగడం గమనార్హం. అత్యధికంగా మాడ్గుల మండలంలో కొత్త పంచాయతీలు ఏర్పడుతున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. ఈ నెల 25వ తేదీలోపు పంచాయతీల ప్రతిపాదనలు పంపాలని ప్రభుత్వం ఆదేశించడంతో దానికి అనుగుణంగా తర్జనభర్జనలు పడుతోంది. సర్వేనంబర్ల వారీగా, ప్రతిపాదిత పంచాయతీ భూభాగంతో కూడిన మ్యాప్‌ల తయారీలో తలమునకలైంది. ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్న సర్కారు..ఆలోపు కొత్త పంచాయతీరాజ్‌ చట్టానికి ఆమోదముద్ర వేయాలని నిర్ణయించింది. చట్టానికి రాజముద్ర పడడమే తరువాయి పంచాయతీ సమరానికి నగారా మోగించే ఆలోచన చేస్తోంది.

పల్లెల్లో వేడెక్కిన రాజకీయం..
ఆర్నెళ్ల ముందే పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలనే ప్రభుత్వ యోచనతో గ్రామాల్లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. కొంతకాలంగా ఎలాంటి హడావుడీ లేకుండా వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన పల్లెవాసులకు పంచాయతీ పోరు హాట్‌టాపిక్‌ మారింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అనూహ్య ప్రకటన అధికారపార్టీనే కాదు విపక్షాలకూ షాక్‌ ఇచ్చింది. ఇప్పట్లో ఎన్నికలు ఉండవని అనుకుంటున్న రాజకీయ నాయకులకు తాజా పరిణామం సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. ప్రత్యక్ష పద్ధతా, పరోక్ష విధానమా అనే అంశంపై ఇప్పటికే చర్చోపచర్చలు జరుగుతుండగా.. ఇప్పుడు పంచాయతీరాజ్‌ చట్టానికి ప్రభుత్వం పదును పెడుతుండడం, ఫిబ్రవరిలో ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు చేస్తుండడంతో రిజర్వేషన్లపై అప్పుడే చర్చలు మొదలయ్యాయి.

మరిన్ని వార్తలు