అగ్రి వర్సిటీ తెలంగాణకే గర్వకారణం

1 Feb, 2018 19:20 IST|Sakshi
యూనివర్సిటీ అధికారులతో సమావేశమైన కమిటీ సభ్యులు

దేశంలోనే 12వ ర్యాంకు సాధించడంపై హర్షం

యూనివర్సిటీని సందర్శించిన లెజిస్లేచర్‌ కమిటీ

యూనివర్సిటీ అభివృద్ధిపై వీసీకి అభినందనలు

వెనుకబడిన తరగతులకు సీట్ల కేటాయింపుపై సమీక్ష

రాజేంద్రనగర్‌ : వెనుకబడిన తరగతుల వారికి ఉద్యోగాలు, విద్యార్థులకు రిజర్వేషన్లు కల్పించడంలో ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆదర్శంగా నిలుస్తుందని, వెనుకబడిన తరగతుల సంక్షేమంపై ఏర్పడిన లెజిస్లేచర్‌ కమిటీ అభిప్రాయపడింది. విశ్వవిద్యాలయంలో వెనుకబడిన తరగతుల సంక్షేమం కోసం జరుగుతున్న కార్యక్రమాలను పరిశీలించడంతో పాటు ఉద్యోగుల నియామకం, అడ్మిషన్లలో రిజర్వేషన్లు పాటించడంపై సభా సంఘం చైర్మన్‌ వి.గంగాధర్‌గౌడ్‌ నేతృత్వంలోని కమిటీ బుధవారం విశ్వవిద్యాలయంలో పర్యటించి అధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం కమిటీ చైర్మన్‌ వి.గంగాధర్‌గౌడ్, కమిటీ సభ్యులు ఆర్‌.కృష్ణయ్య, టి.ప్రకాష్‌గౌడ్, సి.విఠల్‌రెడ్డి, వీసీ వి.ప్రవీణ్‌రావు, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎస్‌.సుధీర్‌కుమార్‌ వివ రాలను మీడియాకు వెల్లడించారు.

విశ్వ విద్యాలయంలో 738 ప్రభుత్వ అను మతి పొందిన టీచింగ్‌ పోస్టులు ఉంటే అందులో 361 మంది ఉద్యోగంలో ఉన్నారని, వారిలో 132 మంది వెనుకబడిన తరగతుల ఉద్యోగులు(36.5 శాతం) ఉన్నట్లు గుర్తించామన్నారు. అలాగే 1437 నాన్‌ టీచింగ్‌ పోస్టులకుగాను 918 మంది సర్వీసులో ఉంటే వారిలో 399 మంది(43.4 శాతం) వెనుకబడిన తరగతుల వారు ఉన్నట్లు ఆయన తెలిపారు. అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులలో 44.35 శాతం మంది, డిప్లొమో కోర్సులలో 63 శాతం మంది వెనుకబడిన తరగతుల విద్యార్థులకు అడ్మిషన్లు కల్పించినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. వెనుకబడిన తరగతులకు కేటాయించిన రిజిర్వేషన్ల కంటే అధికంగా ఇవ్వడంపై  కమిటీ చైర్మన్‌ వీసీని అభినందించారు. విశ్వవిద్యాలయం ఏర్పడిన అనతికాలంలోనే దేశంలో 12వ ర్యాంకును సాధించడమే కాకుండా దక్షి ణాది రాష్ట్రాలలో 3వ ర్యాంకు పొందడం రాష్ట్రానికి గర్వకారణం అన్నారు.

ఏడు పంటలకు సంబంధించి 13 రకాల నూతన వంగడాలను విడుదల చేసి రైతులకు ఎంతో సేవ చేస్తుందన్నారు. విదేశాలలో వ్యవసాయంలో ఉన్నత విద్యను అభ్యసించడానికి వెనుకబడిన తరగతుల విద్యార్థులను ప్రోత్సహించాలని కోరా రు. విశ్వవిద్యాలయంలోని బీసీ ఉద్యోగుల సంక్షేమం కోసం బీసీ సెల్‌ను కూ డా ఏర్పాటు చేయాలని కమిటీ సూచించింది. విశ్వవిద్యాలయంలోని డిగ్రీ సీట్లు పెంచడానికి కూడా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. గీత కార్మికులను దృష్టిలో ఉంచుకుని అధిక దిగుబడినిచ్చే ఈత చెట్ల రకాలను రూపొందించాలన్నారు. అంతకుముందు బోధన, బోధనేతర, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల నుంచి కమిటీ విజ్ఞాపన పత్రాలను స్వీకరించింది. వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని వీసీతోపాటు ప్రభుత్వానికి నివేదించనున్నట్లు గంగాధర్‌గౌడ్‌ తెలిపారు.

 

>
మరిన్ని వార్తలు