ఎమ్మార్పీ ఉఫ్‌!

5 Mar, 2018 11:55 IST|Sakshi

యథేచ్ఛగా అధిక ధరలకు మద్యం విక్రయాలు

‘బెల్టు’ నిర్వాహకుల నుంచి సీసాకు రూ.5–20 వసూలు

వైన్స్‌లు దండుకుంటున్న సొమ్ములో ‘ఆబ్కారీ’కి వాటా

చేష్టలుడిగిన యంత్రాంగం

సాక్షి, రంగారెడ్డి జిల్లా: గరిష్ట చిల్లర ధర (ఎమ్మార్పీ)కు మద్యం అమ్మకాలు జరిగేలా చర్యలు తీసుకోవడంలో ఎక్సైజ్‌శాఖ విఫలమవుతోంది. ఎమ్మార్పీకి మించి జరుగుతున్న విక్రయాలకు కళ్లెం వేయడానికి ప్రభుత్వం పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నా.. వాటిని అమలు చేయడంలో అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రతినెలా వైన్స్‌ల నుంచి మామూళ్లు వసూలు చేస్తూ మద్యం దుకాణాదారులకు కొమ్ము కాస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ముఖ్యంగా బెల్టుషాపుల నిర్వాహకుల నుంచి మద్యం దుకాణాల యజమానులు దండుకోవడంలో ఆబ్కారీ అధికారులు అన్నివిధాలుగా సహకరిస్తున్నారని బహిరంగంగానే చర్చ జరుగుతోంది. మద్యం దుకాణం నిర్వాహకులు బ్రాండ్‌తో సంబంధం లేకుండా ఎమ్మార్పీపై అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. క్వార్టర్‌ సీసాకు రూ.5, హాఫ్‌కు రూ.10, ఫుల్‌ బాటిల్‌కు రూ.20, బీర్‌పై రూ.10 అదనంగా వారినుంచి నొక్కుతున్నారు. వైన్స్‌ల వద్ద అధిక ధరలకు కొనుగోలు చేస్తున్న వీరు.. గ్రామాల్లో మందుబాబులకు మరింత ఎక్కువ ధరలకు మద్యం విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.   

చూసీ చూడనట్లుగా..
జిల్లాలో సరూర్‌నగర్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ పరిధిలో 113, శంషాబాద్‌ ఈఎస్‌ పరిధిలో 74 మద్యం దుకాణాలు నడుస్తున్నాయి. రిటైల్‌ షాప్‌ ఎక్సైజ్‌ ట్యాక్స్‌ (లైసెన్స్‌ ఫీజు) చెల్లించి కొనసాగుతున్న మద్యం దుకాణాలు విధిగా ఎమ్మార్పీని అమలు చేయాలి.
ఈవిషయమై ఇటీవల ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ప్రతి వైన్స్‌ దుకాణం ఎదుట మద్యం ధరల ఎమ్మార్పీలు కనిపించేలా బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించింది. అలాగే బ్రాండ్, పరిమాణం వారీగా లిక్కర్‌ ధరలు సులువుగా తెలుసుకునేందుకు వీలుగా ‘తెలంగాణ లిక్కర్‌ యాప్‌’ను సైతం అందుబాటులోకి తీసుకొచ్చారు.

అధిక ధరల అమ్మకాలపై సులభంగా ఫిర్యాదులు చేసేందుకు ప్రత్యేక వాట్సాప్‌ నంబర్‌ను సైతం రాష్ట్ర ఆబ్కారీ శాఖ ఏర్పాటు చేసింది. ఇదంతా అమల్లోకి వచ్చినా అధిక ధరల నియంత్రణ అంతంతమాత్రంగానే ఉంది. క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవాల్సిన ఎక్సైజ్‌ శాఖ  అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్ని వైన్స్‌లు ఎమ్మార్పీకే మద్యం విక్రయిస్తుండగా.. ఇంకొన్ని మాత్రం నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నాయి.

అక్కడి రూటే సపరేటు!
జిల్లా పరిధిలోని మాడ్గుల మండల జనాభా సుమారు 50 వేలు. మొత్తం 16 గ్రామ పంచాయతీలు ఉండగా వీటి పరిధిలో మరో 11 అనుబంధ గ్రామాలు, 27 తండాలు ఉన్నాయి. ఈ పల్లెలన్నింటికీ స్థానిక వైన్స్‌ నుంచి మద్యం సరఫరా అవుతున్నట్లు సమాచారం. ఇక్కడ మద్యం లభించని గ్రామం లేదంటే అతిశయోక్తి కాదు. వైన్స్‌ నిర్వాహకులే ప్రత్యేక వాహనం ఏర్పాటు చేసి బెల్టు షాపులకు మద్యం పంపిణీ చేస్తున్నట్లు సమాచారం. ఇలా ప్రతివారం దాదాపు అన్ని గ్రామాలకు సరఫరా చేస్తున్నా అటు ఆబ్కారీశాఖ అధికారులు గాని, సివిల్‌ పోలీసులుగాని పట్టించుకోకపోవడం గమనార్హం.

ఈ వ్యవహారం మూడు హాఫ్‌లు.. ఆరు ఫుల్‌ బాటిళ్లు అన్నవిధంగా సాగుతున్నా దాడులు చేసి చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదు. ప్రతినెలా వైన్స్‌ నిర్వాహకుల నుంచి మామూళ్లు పుచ్చుకుంటున్న నేపథ్యంలో ఎక్సైజ్‌ అధికారులు మిన్నకుండిపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మిగిలిన మండలాల్లో ప్రత్యేక వాహనాల ద్వారా సరఫరా లేకపోయినప్పటికీ ఎమ్మార్పీని తుంగలో తొక్కుతున్నారు.  

రెండు ఫిర్యాదులు అందాయి..  
కొన్ని వైన్స్‌లు ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయించినట్లు తమకు ఫిర్యాదులు అందాయని సరూర్‌నగర్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ రఘురాం తెలిపారు. రెండు చోట్ల దాడులు చేసి మద్యం దుకాణాల నిర్వాహకులపై చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఇంకేమైనా ఫిర్యాదులు అందింతే.. తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎమ్మార్పీకి మించి మద్యంపై అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి రాలేదని శంషాబాద్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఎవరినీ ఉపేక్షించేది లేదని, ఆకస్మికంగా దాడులు చేస్తామని హెచ్చరించారు. వాస్తవంగా బెల్టు షాపులు ఎక్కడా లేవన్నారు. ఒకవేళ ఉంటే నిర్వాహకులపై, వీరికి మద్యం సరఫరా చేస్తున్న వైన్స్‌ నిర్వాహకులపై చర్యలుంటాయని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు