నేడో.. రేపో.. ‘రెవెన్యూ’ ప్రక్షాళన

11 Jan, 2018 11:17 IST|Sakshi

తహసీల్దార్ల బదిలీలపై యంత్రాంగం దృష్టి

జాబితా కూర్పుపై కలెక్టర్, జేసీ, డీఆర్‌ఓ కసరత్తు

పనితీరు ప్రామాణికంగా పోస్టింగ్‌లు

సంక్రాంతి లోపు ప్రక్రియ పూర్తయ్యే అవకాశం

రెవెన్యూ అధికారుల ప్రక్షాళనకు తెరలేచింది. భూ రికార్డుల ప్రక్షాళన ముగియడంతో తహసీల్దార్ల బదిలీలపై జిల్లా యంత్రాంగం దృష్టిసారించింది. ఇటీవల పదోన్నతులతో ఖాళీ అయిన పోస్టులను భర్తీ చేయడమేగాకుండా పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా మరికొందరికి స్థానచలనం కలిగించాలని నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం కసరత్తు ప్రారంభించిన జిల్లా పాలనాధికారులు.. నేడో, రేపో బదిలీల జాబితాకు తుదిరూపు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.


సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: సెప్టెంబర్‌ 15వ తేదీ నుంచి డిసెంబర్‌ 31 వరకు భూరికార్డుల నవీకరణ ప్రక్రియ కొనసాగింది. ఇది దాదాపుగా ముగింపు దశకు చేరుకోవడంతో తహసీల్దార్లకు స్థానభ్రంశం కలిగించే దిశగా యంత్రాంగం ఆలోచన చేస్తోంది. గతంలో కొందరు బదిలీ చేయాలని అభ్యర్థించినప్పటికీ రికార్డుల నవీకరణ జరుగుతున్నందున సున్నితంగా తోసిపుచ్చారు. వీరి అభ్యర్థనలను తాజా ప్రతిపాదనల్లో పరిశీలిస్తున్నారు.

పనితీరే గీటురాయి
రికార్డుల శుద్ధీకరణలో సమర్థవంతంగా పనిచేసిన తహసీల్దార్లకు కీలక పోస్టింగ్‌లు అప్పగించి.. పనితీరు బాగాలేని వారికి అప్రాధాన్య స్థానాలను కేటాయించాలని భావిస్తోంది. డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతులు లభించడంతో కలెక్టరేట్‌ పరిపాలనాధికారి సత్యనారాయణరాజు, చేవెళ్ల తహసీల్దార్‌ గోపిరామ్, యూఎల్‌సీ తహసీల్దార్‌ సూర్యప్రకాశ్‌ బదిలీపై వెళ్లారు. వీరి స్థానంలో ముగ్గురు తహసీల్దార్లను ప్రధాన భూ పరిపాలనాధికారి కార్యాలయం(సీసీఎల్‌ఏ) కేటాయించింది. ఈ నేపథ్యంలో ఖాళీ అయిన స్థానాలతోపాటు కొన్ని మండలాల అధికారుల మార్పులు, చేర్పులు చేయాలని జిల్లా యంత్రాంగం యోచిస్తోంది. ఈ మేరకు బుధవారం కలెక్టర్, జాయింట్‌ కలెక్టర్, డీఆర్‌ఓ జాబితా కూర్పుపై మల్లగుల్లాలు పడ్డట్లు అధికారవర్గాల ద్వారా తెలిసింది.

పనితీరును ప్రామాణికంగా చేసుకొని పోస్టింగ్‌లు ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. తాజా సంకేతాలను పరిశీలిస్తే సంక్రాంతిలోపు రెవెన్యూ ప్రక్షాళన జరిగే అవకాశం కనిపిస్తోంది. ఇదిలావుండగా, కొందరు ప్రజాప్రతినిధులు కూడా తహసీల్దార్ల బదిలీలపై పట్టుబడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎన్నికలు సమీపిస్తున్నందున.. చూసీచూడనట్లు వ్యవహరించే అధికారులకు పోస్టింగ్‌లు ఇవ్వాలని సిఫార్సులు చేస్తున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. ఈ క్రమంలో పోస్టింగ్‌లపై ఎమ్మెల్యేల ముద్ర ఉండే అవకాశం లేకపోలేదనే ప్రచారమూ వినిపిస్తోంది.

మరిన్ని వార్తలు