చేవెళ్ల సెంటిమెంట్‌! 

18 Feb, 2018 12:02 IST|Sakshi

కాంగ్రెస్‌ పార్టీ బస్సు యాత్ర ఇక్కడి నుంచే.. 

ఈ నెల 26 నుంచి ప్రారంభం 

శ్రీకారం చుట్టనున్న కుంతియా, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 

కాంగ్రెస్‌ పార్టీకి కలిసొచ్చిన చేవెళ్ల 

చేవెళ్ల: మరోసారి ‘చేవెళ్ల సెంటిమెంట్‌’ కొనసాగించాలని కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించింది. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలని భావిస్తున్న ఆ పార్టీ ఇక్కడి నుంచే రాజకీయ యాత్రకు శ్రీకారం చుట్టాలని సంకల్పించింది. ఈనెల 26న చేవెళ్లలో ప్రారంభమయ్యే బస్సు యాత్ర మే 15 వరకు కొనసాగనుంది. 2004, 2009 ఎన్నికల్లో  కాంగ్రెస్‌ గెలుపుబాటకు  కారణమైన వైఎస్‌ ప్రజాప్రస్థానం, జైత్రయాత్రల తరహాలోనే ఈ సారి ఎన్నికలకు చేవెళ్ల సెటింమెంట్‌ అస్త్రాన్ని హస్తం పార్టీ  ప్రయోగించనుంది. 

వైఎస్‌ హఠాన్మరణంతో కాం గ్రెస్‌ పార్టీకి పరాజయాలే ఎదురయ్యాయి. వచ్చే ఎన్నికల్లో విజయానికి బాటలు వేసుకునేందుకు బస్సు యాత్రను ఎక్కడి నుంచి ప్రారంభించాలనే  విషయంపై గాంధీభవన్‌లో తర్జనభర్జనలు పడిన నేతలు చివరకు.. కాంగ్రెస్‌కు తిరుగులేని విజయాలను అందించిన చేవెళ్ల సెంటిమెంట్‌కే ఓకే చెప్పారు. 2004లో  ఉమ్మడి రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల ముందు ప్రతిపక్షనేతగా ఉన్న దివంగత నాయకుడు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి చేవెళ్ల నుంచి ప్రజాప్రస్థానం పేరుతో పాదయాత్ర ప్రారంభించి పార్టీలో నూతనోత్తేజం తీసుకువచ్చారు. 

తదనంతరం ఎన్నికల ప్రచారాన్ని కూడా చేవెళ్ల నుంచి ప్రారంభించి కాంగ్రెస్‌ పార్టీకి విజయాన్ని చేకూర్చారు. దీంతో చేవెళ్ల కాంగ్రెస్‌ పార్టీకి సెంటిమెంట్‌గా మారింది. 2009 ఎన్నికల్లో కూడా ప్రచార యాత్రను చేవెళ్ల నుంచే ప్రారంభించారు. దీంతో పాటు కాంగ్రెస్‌ పార్టీ హయాంలో ప్రభుత్వం ఏ పథకం చేపట్టినా చేవెళ్ల నుంచి ప్రారంభించారు.   

బస్సు యాత్ర సాగేదిలా.. 
కాంగ్రెస్‌ పార్టీ ఏఐసీసీ ఇన్‌చార్జి కుంతియా, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డితోపాటు ఇతర ముఖ్యనేతలు అంతా కలిసి ఈ బస్సు యాత్రను చేవెళ్ల నుంచి ప్రారంభించేందుకు నిర్ణయించారు.  ఈనెల 26న మధ్యాహ్నం చేవెళ్లలో ప్రారంభమై అదే రోజు సాయంత్రం వికారాబాద్‌ జిల్లాకు చేరుకుంటుంది. అక్కడ నుంచి  27న తాండూరుకు చేరుకొని అదే రోజు రాత్రికి సంగారెడ్డి జిల్లాలోకి  వెళ్తుంది.   

మరిన్ని వార్తలు