స్మార్ట్‌గా పాస్‌ పుస్తకం

10 Feb, 2018 17:26 IST|Sakshi

రికార్డుల ప్రక్షాళనతో విప్లవాత్మక మార్పు

డిజిటల్‌ పాస్‌ పుస్తకాల జారీకి రంగం సిద్ధం

18 హై సెక్యూరిటీ ఫీచర్స్‌తో ముద్రణ 

జాతీయ భద్రత ప్రింటింగ్‌ ప్రెస్‌కు బాధ్యతలు 

జిల్లాలో 3.76 లక్షల పట్టాదారు ఖాతాలు

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : భూ రికార్డుల ప్రక్షాళనలో సరికొత్త ఆవిష్కరణలకు తెరలేచింది. భూ వివాదాలకు తావివ్వకుండా రాష్ట్ర సర్కారు డిజిటల్‌ పాస్‌పుస్తకాలకు శ్రీకారం చుడుతోంది. ఇటీవల రెవెన్యూ రికార్డుల నవీకరణ ప్రక్రియను పూర్తి చేసిన యంత్రాంగం.. మార్చి 11న కొత్త పాస్‌పుస్తకాల జారీకి రంగం సిద్ధం చేసింది. ఇందులోభాగంగా ఇప్పటి వరకు అమలులో ఉన్న పాస్‌బుక్‌ల స్థానే ‘స్మార్ట్‌’ కార్డులను ప్రవేశపెడుతోంది. ఇందులో సమగ్ర భూ వివరాలను నిక్షిప్తం చేయనుంది. ఈ సమాచారాన్ని ఆన్‌లైన్‌లో పొందుపరచనుంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకున్న ప్రభుత్వం.. ఈ సమాచారాన్ని తారుమారు చేయకుండా అత్యున్నత భద్రతా ప్రమాణాలను పాటిస్తోంది. ప్రస్తుతం పాస్‌పోర్టుల జారీలో అవలంభిస్తున్న విధానం మాదిరి ఈ కార్డులకు రూపకల్పన చేస్తోంది. ఈ మేరకు ఢిల్లీలోని నేషనల్‌ హై సెక్యూరిటీ ముద్రణ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు రెవెన్యూ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు.  

18 సెక్యూరిటీ ఫీచర్లతో చూడముచ్చటగా.. 
ఈ డిజిటల్‌ పాస్‌పుస్తకాల్లో 18 ఫీచర్లు ఉండనున్నాయి. భూ కేటగిరీ, పట్టాదారు, సాగు విస్తీర్ణం, బ్యాంకు ఖాతా, ఫోన్, ఆధార్‌ నంబర్‌ సహా ముఖ్యమైన సమాచారాన్ని నమోదు చేసేందుకు అనువుగా సాంకేతికతకు జోడించినట్లు తెలిసింది. మార్చి 11న రాష్ట్రవ్యాప్తంగా రైతులకు సరికొత్త  ’స్మార్ట్‌’ పాసు పుస్తకాలను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినందున.. దానికి అనుగుణంగా రెవెన్యూ యంత్రాంగం కసరత్తు చేస్తోంది. గత మూడు రోజులుగా తహసీల్దార్లకు శిక్షణా తరగతులను నిర్వహించింది. అదే రోజు నుంచి రిజిస్ట్రేషన్‌ వ్యవహారాలను కూడా తహసీల్దార్లే చూడనున్నందున దానికి తగ్గట్టుగా శిక్షణ ఇస్తోంది. మరోవైపు హై సెక్యూరిటీ ప్రింటింగ్‌ ప్రెస్‌కు ముద్రణ బాధ్యతలు అప్పజెప్పిన ప్రభుత్వం.. తహసీల్దార్‌ల డిజిటల్‌ సంతకాల సేకరణలో నిమగ్నమైంది. అవసరమైతే, బల్క్‌గా డిజిటల్‌ సంతకాల చేసే వెసులుబాటు కల్పించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. 

పెట్టుబడి సాయంలో కీలకం! 
తెలంగాణ సర్కారు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పెట్టుబడి సాయంలో ఈ కార్డులు కీలకం కానున్నాయి.గతంలో నకిలీ పాస్‌పుస్తకాల బెడద కారణంగా పంటనష్ట పరిహారం, ఇన్‌పుట్‌ సబ్సిడీ, రుణమాఫీ, బ్యాంకు రుణాలతో ప్రభుత్వానికి టోకరా వేసిన ఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం ప్రవేశపెడుతున్న స్మార్ట్‌ కార్డులతో అక్రమాలకు ఆస్కారం ఉండదని ప్రభుత్వం భావిస్తోంది. అంతేగాకుండా ప్రతి ఏడాది ఎకరాకు రూ.8వేలను పెట్టుబడి ప్రోత్సాహకంగా రైతన్నకు అందజేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈ ఖరీఫ్‌లో రూ.4వేల చొప్పున రైతులకు ఇచ్చేలా కార్యాచరణ ప్రణాళిక తయారు చేసింది.  

మరిన్ని వార్తలు