రైస్‌ పుల్లర్‌ పేరుతో టోకరా

11 Jan, 2018 11:14 IST|Sakshi

10 లక్షలు పెట్టుబడి పెడితే కోటి సంపాదించ వచ్చని ఎర

మాయ మాటలు నమ్మి భూములను తాకట్టు పెట్టిన రైతులు

పద్మారంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సంఘటన

కొందుర్గు:  సంపాదనకు ఓ రాజ మార్గం ఉందని, రూ.10 లక్షల పెట్టుబడి పెడితే వారం రోజుల్లో కోటి రూపాయలు సంపాదించవచ్చని కొందరు వ్యక్తుల మాయమాటలు నమ్మి ఇద్దరు రైతులు అప్పుల పాలై ఉన్న భూమినీ తాకట్టు పెట్టిన సంఘటన ఒకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  జిల్లేడ్‌చౌదరిగూడ మండలం పద్మారం గ్రామానికి చెందిన భూపాల్‌రెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అయితే సరైన దిగుబడులు రాక అప్పుల పాలయ్యారు. వీరి పరిస్థితిని ఆసరాగా చేసుకొని కొందరు రూ.10 లక్షలు ఖర్చు పెడితే వారం రోజుల్లో కోటి రూపాయలు సంపాదించవచ్చని మాయమాటలు చెప్పి నమ్మించారు.

రైస్‌ పుల్లర్‌ ఖనిజం పేరు చెప్పి..
భూమిలో రైస్‌ పుల్లర్‌ అనే ఖనిజం ఉంటుందని, ఇది కనిపెడితే కోట్లు సంపాదించవచ్చని షాద్‌నగర్‌కు చెందిన కొందరు వ్యక్తులు నమ్మించారు. దీనిని కనిపెట్టడానికి ఓ మిషన్‌ ఉంటుందని, దాని విలువ రూ. కోటి అని చెప్పారు. దీనిని కొన్నవారిలో  వరంగల్, హైదరాబాద్‌లో మంత్రులు, ఐఏఎస్‌ అధికారుల వంటి ప్రముఖులు ఉన్నారని, షాద్‌నగర్‌లోనూ ప్రముఖ వ్యాపారులు ఇందులో పెట్టుబడులు పెట్టి ఇలాంటి మిషన్లు కొనుగోలు చేసి కోట్లు సంపాదించారని చెప్పారు. ప్రస్తుతం నూతన మిషన్‌ కోసం ఇప్పటికే సగానికి పైగా డబ్బులు జమచేయడం జరిగిందని, పెట్టుబడి ప్రకారం సంపాదనలోనూ వాటాలు పంచుకోవాల్సి ఉంటుదని వీరిని నమ్మించారు. మిగతా సగం పెట్టుబడి పెడితే మిషన్‌ కొనుగోలు చేసి కోట్లు సంపాదించవచ్చన్నారు. ఇందుకు ఆశపడిన వెంకటేశ్వర్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి కలిసి తమ భూములను తాకట్టు పెట్టి అప్పులు తీసుకున్నారు. వారం రోజుల్లో తిరిగి ఇస్తామని, వడ్డీ కూడా ఎక్కువగానే ఇస్తామని చెప్పి అప్పులు చేశారు.  

హసీప్‌ ఖాతాలో జమ..
అప్పులు చేసిన మొత్తన్ని వరంగల్‌కు చెందిన హసీప్‌ ఖాతాలో జమచేసినట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. రెండేళ్ల క్రితం డబ్బులు జమచేసినా పైసా సంపాదన లేక.. చేసిన అప్పులు తీర్చేమార్గం లేక రైతన్నలు లబోదిబోమంటున్నారు. ఈ రైతులకు అప్పు ఇచ్చిన వ్యక్తి కూడా మిషన్‌ కొనుగోలుకు పెట్టుబడి పెట్టినట్టు తెలిసింది. కాగా అప్పుల విషయంలో గొడవలు వచ్చి వెంకటేశ్వర్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి పోలీసులను ఆశ్రయించారు. ప్రస్తుతం వీరి పంచాయతి ఏసీపీ వద్దకు చేరుకుంది.

మరిన్ని వార్తలు