పట్టా భూములకు రిజిస్ట్రేషన్‌ బంద్‌

10 Feb, 2018 17:41 IST|Sakshi

బహదూర్‌గూడ రైతులకు ఇబ్బందులు 

వెబ్‌ పహాణీలో వివరాలు లేకనే రిజిస్ట్రేషన్‌ల నిలిపివేత 

శంషాబాద్‌ రూరల్‌(రాజేంద్రనగర్‌) : ఇల్లు కట్టాలన్నా.. పెళ్లి చేయాలన్నా.. డబ్బుతో కూడుకున్న వ్యవహారం. వీటికి తోడు కుటుంబ అవసరాలు, పిల్లల చదువులు.. ఇవన్నీ తీరాలంటే పేద రైతులు తమ పొలాలను అమ్ముకోవడమే ఏకైక మార్గం. కష్టాలో ఉన్న రైతులు అత్యవసర సమయంలో పట్టా భూములను అమ్ముకుందామంటే వారికి పెద్ద చిక్కే వచ్చి పడింది. శంషాబాద్‌ మండలంలోని బహదూర్‌గూడలో ఉన్న పట్టా భూముల రిజిస్ట్రేషన్‌లను కొన్ని నెలల నుంచి నిలిపివేయడంతో ఆందోళన చెందుతున్నారు.

ఈ గ్రామ రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్లు 1 నుంచి 76 వరకు ఉండగా.. కేవలం సర్వేనంబర్లు 28, 62లో 650 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి. మిగతా సర్వే నంబర్లలో రైతులకు సుమారు 600 ఎకరాల పట్టా భూములుండగా.. వాటిలో సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే ఇక్కడి భూములు మొదటి నుంచి వివాదాస్పదంగా మారడంతో రైతులకు అవస్థలు తప్పడం లేదు. రైతులకు వారి భూములకు సంబంధించిన పట్టా పాస్‌బుక్‌లు, టైటిల్‌ డీడ్‌లు కూడా అందజేశారు. అయితే కొన్నేళ్ల కిందటి నుంచి ఈ భూములకు మ్యూటేషన్‌ను కూడా నిలిపివేశారు. 

నకిలీ డాక్యుమెంట్ల రద్దుతో.. 
సర్వే నంబర్లు 28, 62లోని ప్రభుత్వ భూములకు నకిలీ సర్వే నంబర్లు వేసి అక్రమార్కులు పత్రాలు సృష్టించారు. ఈ భూముల్లో పెద్ద ఎత్తున వెంచరు చేసి అమ్మకానికి పెట్టారు. విషయం వెలుగు చూడడంతో అధికారులు ఈ భూములకు సంబంధించిన నకిలీ పత్రాల సేల్‌ డీడ్‌లను గత అక్టోబరులో రద్దు చేశారు. ఇక్కడి నుంచే రైతులకు కష్టాలు మొదలయ్యాయి. బహదూర్‌గూడలో సర్వే నంబర్లు వివాదాస్పదం కావడంతో పాటు వెబ్‌ పహాణీలో రైతుల వివరాలు నమోదు చేయలేదు. దీంతో స్థానిక సబ్‌ రిజిస్టార్‌ కార్యాలయంలో పట్టా భూములకు రిజిస్ట్రేషన్‌ను నిలిపివేశారు.  

వెంచరులోని ప్లాట్లకు దర్జాగా రిజిస్ట్రేషన్లు.. 
గ్రామంలోని పట్టా భూముల రిజిస్ట్రేషన్‌లకు నిరాకరిస్తున్న అధికారులు ఇక్కడ వెలసిన అక్రమ వెంచర్లలోని ప్లాట్లకు రిజిస్ట్రేషన్‌లు చేస్తున్నారు. జీఓ 111 పరిధిలో వెంచర్లు చేయడం నిషేధం. కానీ ఇక్కడ వెంచర్లు వేసి రియల్‌ వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. 

రిజిస్ట్రేషన్‌ చేయడం లేదు. 
మాకు సర్వే నంబర్లు 73, 14లో రెండు ఎకరాల పట్టా భూమి ఉంది. మా అన్న కూతురు పెళ్లీడుకు వచ్చింది. భూమి అమ్ముకుని పెళ్లి చేద్దామంటే రిజిస్ట్రేషన్‌ నిలిపి వేశారు. ఎవరూ కొనడానికి రావడం లేదు. 
-మల్లేష్, బహదూర్‌గూడ, శంషాబాద్‌.

వెబ్‌ పహాణీలో వివరాలు లేనందుకే.. 
వెబ్‌ పహాణీలో రైతుల వివరాలు లేకపోవడంతోనే రిజిస్ట్రేషన్‌ను నిలిపివేస్తున్నాం. రైతుల వద్ద పాస్‌బుక్‌లు, టైటిల్‌ ఉన్నా నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్‌ చేయడానికి వీలులేదు. వెంచర్లలో గజాల చొప్పున ప్లాట్లు ఉంటాయి కాబట్టి వాటికి వెబ్‌ పహాణీతో సంబంధం ఉండదు.
- ఎంఏ.నయీం, సబ్‌ రిజస్ట్రార్, శంషాబాద్‌. 

రీ సర్వే చేయాల్సి ఉంది 
బహదూర్‌గూడ భూములకు మొదటి నుంచి సర్వే నిర్వహించ లేదు. ఇక్కడ మొత్తం 1250 ఎకరాల భూములుండగా.. ఇందులో 650 ఎకరాలు ప్రభుత్వానికి చెందినవి. మిగతావి రైతుల పట్టా భూములు. వీటికి సర్వే నిర్వహించి కొత్త సర్వే నంబర్లు ఇచ్చిన తర్వాత వెబ్‌ పహాణీలో నమోదు చేస్తాం. వచ్చే నెలలో భూములను సర్వే చేసేందుకు కృషిచేస్తాం.
- సురేష్‌కుమార్, తహసీల్దార్, శంషాబాద్‌.  

మరిన్ని వార్తలు