ఎయిర్‌పోర్ట్‌ దాకా..

2 Jan, 2018 03:03 IST|Sakshi

పీవీ ఎక్స్‌ప్రెస్‌ వే పొడిగించాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం

అంచనా వ్యయం 400 (రూ. కోట్లలో)

ఫ్లై ఓవర్‌ విస్తరణకు కార్యాచరణ ప్రణాళిక

ఎన్‌హెచ్‌ఏఐకు నిర్మాణ బాధ్యతలు

మరింత సులువుకానున్న ప్రయాణం

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి
హైదరాబాద్‌ నగరం నుంచి రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి సులువుగా రాకపోకలు సాగించేందుకు పీవీ నర్సింహారావు ఎక్స్‌ప్రెస్‌ వేను పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఫ్లై ఓవర్‌ను ఎయిర్‌పోర్ట్‌ వరకు విస్తరించేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. ప్రస్తుతం మాసబ్‌ట్యాంక్‌లోని సరోజినీదేవి కంటి ఆస్పత్రి నుంచి ఆరాంఘర్‌ చౌరస్తా వరకు ఉన్న ఈ ఫ్లై ఓవర్‌ను బెంగళూరు జాతీయ రహదారి నుంచి ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లే మార్గంతో అనుసంధానం చేయాలని ప్రతిపాదించింది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో పీవీ ఎక్స్‌ప్రెస్‌ వేకు అంకురార్పణ జరిగింది. సుమారు రూ.600 కోట్ల వ్యయంతో, 11.06 కిలోమీటర్ల పొడవున నిర్మితమైన ఈ ఫ్లైఓవర్‌ దేశంలోనే అతి పెద్దది. ఈ వంతెనతో బెంగళూరు జాతీయ రహదారి, ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లే వాహనదారులకు కొంత ఊరట కలుగుతోంది. ఈ నేపథ్యంలో ఆరాంఘర్‌ వద్ద ముగుస్తున్న ఈ ఫ్లై ఓవర్‌ను విమానాశ్రయం వరకు పొడిగిస్తే ప్రయాణం మరింత సులువుగా ఉంటుందనే అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న సర్కారు ఆ దిశగా కసరత్తు మొదలు పెట్టింది.

వంతెన ముగిసిన తర్వాత వెంటనే గగన్‌ పహాడ్‌ ‘వై’జంక్షన్‌ ఉండటం, శంషాబాద్‌ పట్టణంలో విపరీతమైన ట్రాఫిక్‌ పెరిగిన నేపథ్యంలో ఈ ఫ్లై ఓవర్‌ను ఎయిర్‌పోర్టు వరకు కొనసాగిస్తే బాగుంటుందనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది. ఈ మేరకు ఎక్స్‌ప్రెస్‌ వే నిర్మాణ బాధ్యతను జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ)కు అప్పగించింది. సుమారు 10 కిలోమీటర్ల పొడవు ఉండే ఈ మార్గం డిజైన్‌ను ఎన్‌హెచ్‌ఏఐ రూపొందిస్తోంది. రూ.400 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేస్తున్న ఇంజనీరింగ్‌ విభాగం.. మార్గమధ్యంలో రెండు చోట్ల దిగేలా ర్యాంపులు ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తోంది. ఫ్లై ఓవర్‌ నిర్మాణం కోసం కొన్ని చోట్ల భూ సేకరణ చేయాల్సి ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది.

మరిన్ని వార్తలు