విళంబినామం.. ఎవరికి వరం

18 Mar, 2018 11:42 IST|Sakshi

ఈ సంవత్సరం ఏ నాయకుడికి కలిసొచ్చేనో.. 

కొందరు నేతలకు ఒడిదుడుకులు తప్పవంటున్న జ్యోతిష్యులు 

ఆసక్తికరంగా రాజకీయ పంచాంగం 

షడ్రుచుల సమ్మిళితం ఉగాది పచ్చడి. ఈ పచ్చడి సారం మన జీవితానికే కాదు.. భవిష్యత్తుకూ వర్తిస్తుంది. జీవన గమనంలో ఎప్పుడు ఏ రుచి చవి చూస్తామో తెలియదు. ఏదీ భవిష్యత్తును ప్రభావితం చేస్తుందో తెలియదు. నమ్మకం, విశ్వాసమనే పునాదులపై ఏర్పడ్డ మన సమాజాన్ని జ్యోతిష్యం, పంచాంగం బలంగా ప్రభావితం చేస్తున్నాయి. భవిష్యవాణిని తెలుసుకోవాలనే కుతూహలం ప్రతి ఒక్కరిలోనూ కనిపిస్తుంది. తెలుగు పండగైన ఉగాది రోజున పంచాంగాన్ని తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతారు. ఈ నేపథ్యంలో విళంబినామ సంవత్సరంలో కొందరు నేతల భవిష్యత్తు ఎలా ఉండబోతుంది.. రాజకీయంగా వారెదుర్కొనే ఆటుపోట్లు ఏమిటి తదితర అంశాలపై పంచాంగకర్తలను అడిగి తెలుసుకునే చిరు ప్రయత్నం చేశాం. పేర్లు, రాశుల ద్వారా వారి భవిష్యత్తును అంచనా వేసిన జ్యోతిష్యులు.. ఈ ఏడాది ఏ రాశివారికి అనుకూలం? ఎవరికి ప్రతికూలం అనేది విశ్లేషించారు. ఈ రాజకీయ పంచాంగం మీకోసం.. సరదాగా.. 

సింహ రాశి: ఈ ఏడాది అంతగా అనుకూలంగా లేదు. గురువు 3వ స్థానంలో, శని 5వ స్థానంలో ఉంటాడు. ఆదాయం 11, వ్యయం 11, పూజ్యం 3, అవమానం 6. ప్రత్యర్థులు పైచేయి సాధించే అవకాశముంది. సన్నిహితులు కూడా బలహీనపరిచే వీలుంది. మొత్తమ్మీద విళంబి సంవత్సరం నిరాశజనకంగానే ఉండనుంది. 
పి.మహేందర్‌రెడ్డి, రాష్ట్ర రవాణాశాఖ మంత్రి 


కుంభ రాశి: విళంబి నామ సంవత్సరం అన్ని విధాలా కలిసి రానుంది. సమాజంలో తమ స్థానాన్ని నిలబెట్టుకుంటారు. గురువు 8వ స్థానంలో, శని 11వ స్థానంలో ఉంటాడు. ఆదాయం 8, వ్యయం 14, పూజ్యం 7, అవ మానం 1. మొదలు పెట్టిన పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. నూతన పనులు ప్రారంభిస్తారు. అప్పగించిన బాధ్యతలను సకాలంలో పూర్తి చేసి.. పెద్దల మన్ననలు పొందుతారు.
సబితా ఇంద్రారెడ్డి, మాజీ మంత్రి 

తుల రాశి: ఈ ఏడాది పట్టిందల్లా బంగారమే కానుంది. ఆదాయం 11, వ్యయం 5, పూజ్యం 2, అవమానం 2, గురువు 2వ స్థానంలో ఉండి శని సంచారం 3వ స్థానంలో ఉండడం వల్ల చేపట్టే పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ప్రతి కార్యంలోనూ ఇతరుల సహకారం సంపూర్ణంగా లభిస్తుంది. సందర్భానికి తగ్గట్టుగా వ్యవహరించడం ద్వారా తన పలుకుబడిని పెంపొందించుకుంటారు.
రామ్మోహన్‌రెడ్డి, పరిగి ఎమ్మెల్యే 

సింహ రాశి: ఈ ఏడాది ఆశావహంగా లేదు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తికావు. సొంత వాళ్లు కూడా వ్యతిరేకంగా మారే అవకాశముంది. గురు 3వ స్థానంలో, శని 5వ స్థానంలో ఉంటాడు. ఆదాయం 11, వ్యయం11, పూజ్యం 3, అవమానం 6. ఈసారి శ్రమకు తగిన ఫలితాలు తక్కువగా ఉన్నాయి.
మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యే, ఇబ్రహీంపట్నం 

మిథునరాశి:  ఆరోగ్యం, మానసిక ఆందోళన తప్పదు. మొదలుపెట్టే ప్రతి పనులకు ఆటంకం కలిగి తీవ్ర జాప్యం జరుగుతుంది. శని 7వ స్థానంలో, గురువు 6, 7 స్థానాల్లో ఉండడం ఈ పరిస్థితి తలెత్తుతోంది. వ్యయం కూడా ఎక్కువే. పేరు ప్రఖ్యాతులు దెబ్బతినే అవకాశం ఉంటుంది.
కొప్పుల హరీశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే

వృషభ రాశి: చేపట్టే ప్రతి పని నిర్ణీత వ్యవధిలో పూర్తికాదు. ఆరోగ్య సమస్యలుంటాయి. ఈ సంవత్సరం శని 2వ స్థానంలో, గురువు 12వ స్థానాల్లో ఉండడంతో ఈ పరిణామం జరుగుతుంది. వ్యయ నియంత్రణ ఉండదు. మిశ్రమ ఫలితాలు ఉంటాయి. నిర్ణయాలు ఆచితూచి తీసుకోవాల్సివుంటుంది. సానుభూతిని సంపాదించుకుంటారు.    
యాదయ్య, ఎమ్మెల్యే, చేవెళ్ల 

తుల రాశి: విళంబి నామ సంవత్సరం అన్ని విధాలా కలిసిరానుంది. ఆదాయం 11, వ్యయం 5, పూజ్యం 2, అవమానం 2, గురువు 2వ స్థానంలో ఉండి శని సంచారం 3వ స్థానంలో ఉండడంతో సమాజంలో కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. రాజకీయంగా కూడా మంచి గౌరవం దక్కుతుంది. కార్యనిర్వహణలో జాగ్రత్తగా వ్యవహరిస్తారు. ఈ ఏడాది లాభదాయకంగా కూడా ఉంటుంది. 
మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్, ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ కూడా ఇదే రాశి కావడంతో అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది.
రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే, కొడంగల్‌
 

మరిన్ని వార్తలు