అందమైన జంటల కోసం అందమైన ప్రాంతాలు!

23 Oct, 2019 14:34 IST|Sakshi

ప్రేమలో పడితే ప్రపంచాన్నే మరచిపోతారు అంటారు. అది నిజమే అన్నట్టుగా ప్రేమించిన చాలా మంది జంటలు వారున్న ప్రదేశం నుండి తాము ప్రేమించిన వారితో కలసి  కొత్త ప్రదేశాలకు వెళ్లాలని ఆశ పడుతూ ఉంటారు. అయితే చిక్కంతా ఆ ప్రాంతాలు ఎక్కడున్నాయి.  అక్కడ వారి అభిరుచికి తగ్గట్టుగా ఏం  ఉంటాయో తెలుసుకోవడంలోనే వస్తుంది. సాధారణంగా ప్రేమిం‍చుకున్న వారు, కొత్తగా పెళ్లైన వారు ఆగ్రాలోని తాజ్‌మహల్‌, ఊటీ, కొడైకెనాల్‌, మున్నార్‌,  కశ్మీర్‌, శ్రీనగర్‌, డార్జిలింగ్‌,నైనిటాల్‌,కులుమనాలీ లాంటి ప్రాంతాలను తమ హాలిడే స్పాట్స్‌గా ఎంచుకుంటూ ఉంటారు. అయితే ఇవే కాకుండా భారతదేశంలో ప్రేమికులకు ఆహ్లాదం కలిగించే ప్రాంతాలు చాలా ఉన్నాయి.అయితే చాలా మంది ప్రేమికులు,భార్యభర్తలు ఇష్టపడే రోమాంటిక్‌ ప్రాంతాలు మన భారతదేశంలోనే చాలానే ఉన్నాయి. 

అండమాన్‌ దీవులు: ఈ ప్రాంతాన్ని ప్రేమికుల స్వర్గసీమ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉండే దీవులు ఎంతో అందంగా, ఆహ్లాదాన్ని కలిగించే విధంగా ఉంటాయి. ఇక్కడికి వెళ్లిన వారు కేవలం ప్రకృతి అందాలను చూడటంతో పాటు వాటర్‌ గేమ్స్‌, స్కూబాడ్రైవింగ్‌లాంటివి చాలా బాగా ఎంజాయ్‌ చేయవచ్చు. 


కన్యాకుమారి:తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రేమికులు వీక్షించడానికి చాలా అందమైన ప్రాంతాలు ఉన్నాయి. భారతదేశపు దక్షిణ సరిహద్దుగా ఉన్న ఈ ప్రాంతంలో బంగాళఖాతం, అరేబియా సముద్రాలు కలుస్తాయి. సూర్యాస్తమయ సమయంలో బీచ్‌ ఒడ్డున మీరు ప్రేమించే వ్యక్తితో కూర్చొని ఆ దృశ్యాన్ని చూస్తే ఎప్పటికి ఒక మధురజ్ఞాపకంగా అది మీ జీవితంలో నిలిచిపోతుంది. 


కూర్గ్‌: కర్ణాటకలోని కూర్గ్‌ స్కాట్‌లాండ్‌ ఆఫ్‌ ఇండియాగా పేరుగాంచింది. ఆకాశాన్ని తాకుతున్నట్లు ఉండే ఎతైనా జలపాతాలు వాటి చుట్టూ ఉండే కాఫీ తోటల నుండి వచ్చే సువాసనలు మనసుకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి. వీటితో పాటు గంధపుచెట్ల అడవులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఇలాంటి ప్రదేశానికి మీరు ప్రేమించిన వ్యక్తితో వెళితే కచ్ఛితంగా ఎంజాయ్‌ చేయవచ్చు.   


జైసల్మీర్‌: రాజస్తాన్‌లోని ఎడారి ప్రాంతమైన జైసల్మీర్‌ ప్రేమికులకు బెస్ట్‌ ప్లేస్‌ అనే చొప్పవచ్చు. రాత్రిపూట ప్రేమించిన వ్యక్తి ఒడిలో పడుకొని నిర్మలమైన ఆకాశంలో నక్షత్రాలు చూస్తూ కబురులు చెప్పుకునేందుకు వీలుగా ఇక్కడ టెంట్లను ఏర్పాటు చేస్తారు. ఇవే ఇక్కడి ప్రధాన ఆకర్షణగా చెప్పవచ్చు. ప్రశాంతంగా ఒకరి భావాలు ఒకరితో పంచుకోవడంతో పాటు అద్బుతమైన ఎన్నో ప్రాంతాలను చూడొచ్చు. 


గుల్మర్గ్‌: పెళ్లైన కొత్తజంట హనీమూన్‌ కోసం ఎక్కడికి వెళ్లాలి అని  వెతుకుతూ ఉంటే అలాంటి వారికి జమ్మూ కశ్మీర్‌లోని గుల్మర్గ్‌ బెస్ట్‌ చాయిస్‌ అని చెప్పొచ్చు. ఎందుకంటే మంచుకొండల్లో ఆటలు ఆడుకుంటూ చుట్టూ ఉండే పచ్చని ప్రకృతిని చూస్తూ ప్రేమించిన వారితో గడిపే ఆ క్షణాలు కచ్చితంగా అద్బుతంగా ఉంటాయి. ఈ ప్రాంతంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే మరో అంశం తూలిఫ్‌ పూల తోటలు. వీటిని చూడగానే ప్రేమ జంటలు కొత్త కొత్తగా ఉన్నది స్వర్గమిక్కడే అన్నది అని సాంగ్‌ వేసుకోక మానరు. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే మీ రొమాంటిక్‌ ప్లేస్‌ లిస్ట్‌లోకి దీనిని కూడా చేర్చేయండి. 


రణతంబోర్‌: జంతు ప్రేమికులు ఎవరైనా జంటగా మారితే కచ్చితంగా వారు రాజస్తాన్‌లోని రణతంబోర్‌ను వారి హాలిడే స్పాట్‌లో చేర్చేయండి. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఉండే అనేక పశుసంరక్షణ కేంద్రాలను, విభిన్న పక్షిజాతులను  చిలుకగోరింకల్లాగా కలసి చూడొచ్చు. వాటితో పాటు జీప్‌ సఫారీ, ఏనుగు సవారీ వంటి వాటిని ఆశ్వాదించవచ్చు. 


చిరపుంజి: ఈ ప్రాంతంలో ఎప్పుడూ వర్షం కురుస్తూ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. మీరు ప్రేమించే వారితో అక్కడికి వెళితే కచ్చితంగా చిటపట చినుకులు పడుతూ ఉంటే చెలికాడే చెంతనవుంటే అనే పాట గుర్తురాక మానదు. ఎతైన జలపాతలు, పక్షుల కిలకిలరావాలను, పచ్చిక బయళ్లతో అందంగా ఉండే ప్రకృతిని చూసి పులకించిపోవచ్చు. 


శ్రీనగర్‌: మీ హనీమూన్‌కు శ్రీనగర్‌ను ఎంచుకుంటే మీరు ఊహించిన దాని కంటే ఆనందంగా గడుపుతారనే చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ వుండే హౌస్‌బోట్లలో దాల్‌ సరస్సులో మీ భాగస్వామి చేయిపట్టుకుని అందాలను వీక్షిస్తుంటే మళ్లీ మళ్లీ ఇది రాని రోజు అనే అనుభూతి కలుగుతుంది. అక్కడ ఉండే సరసులు, ఎతైన కొండలతో పాటు అక్కడ ఉండే విభిన్న సంస్కృతి కూడా ఎంతో ఆకట్టుకుంటుంది. 


జోద్‌పూర్‌: రాజస్తాన్‌లోని జోద్‌పూర్‌ హానిమూన్‌ కపుల్స్‌కు ఒక చక్కటి పర్యాటకప్రాంతంగా చెప్పవచ్చు. రాత్రి పూట నగరాన్ని చూస్తే నీలిరంగు కాంతిలో వెలిగిపోతూ ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది. దీంతో పాటు మెహర్‌ఘర్‌ కోట, అనేక ప్రాచీన కట్టడాలను చూడొచ్చు. తాము ప్రేమించే వారితో పాటు షాపింగ్‌ చేస్తూ మంచి మంచి గిఫ్ట్స్‌ కొనివ్వండానికి ఈ ప్రాంతం చాలా బాగుంటుంది. 


 పుదుచ్చేరి: కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో అనువణువున ఫ్రెంచ్‌ వారి సంస్కృతి కనిపిస్తూ ఉంటుంది. అందుకే దీనిని లిటిల్‌పారిస్‌ పేరుతోపిలుస్తారు. ఇక్కడ ఎన్నో కోటలు, మంచి హోటల్స్‌ , రిసార్ట్స్‌ల్లో మీ పార్టనర్‌తో కలసి ఎంజాయ్‌ చెయ్యెచ్చు. సో మీరు కూడా ఆలస్యం చేయకుండా వెంటనే వీటిలో మీకు నచ్చిన హాలిడే స్పాట్‌ను ఎంచుకొని వెళ్లి ఎంజాయ్‌ చేసి వచ్చేయండి. 

Read latest Romance News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా