సనేమిరా..

18 Jan, 2018 09:43 IST|Sakshi

మున్సిపాలిటీల్లో విలీనంపై గ్రామాల్లో విముఖత

విలీన ప్రతిపాదనలు వ్యతిరేకిస్తూ తీర్మానాలు

పన్నుల భారం, ‘ఉపాధి’ దొరకదనే ఆందోళన

మున్సిపాలిటీల పరిధి విస్తరణ, కొత్తగా మున్సిపాలిటీలు, నగర పంచాయతీల ఏర్పాటు దిశగా రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు వేగవంతం చేసింది. పట్టణ రూపు రేఖలు కలిగిన గ్రామ పంచాయతీలను సమీప మున్సిపాలిటీల్లో విలీనం చేయడంపైనా.. ఆయా మున్సిపల్‌ టౌన్‌ ప్లానింగ్‌ విభాగాలు ప్రతిపాదనలు రూపొందించాయి. అయితే మున్సిపాలిటీలో విలీనమైతే పన్నుల భారం పెరగడంతో పాటు, ఉపాధి అవకాశాలు దూరమవుతాయనే అభిప్రాయం సంబంధిత పంచాయతీల్లో నెలకొంది. దీంతో విలీన ప్రతిపాదనలను వ్యతిరేకిస్తూ సంబంధిత పంచాయతీలు తీర్మానాలు చేస్తున్నాయి. – సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి

మెరుగైన పాలన లక్ష్యంగా వేగంగా పట్టణీకరణ దిశగా అడుగులు వేస్తున్న గ్రామాలకు మున్సిపాలిటీలు, నగర పంచాయతీ హోదా కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అదే సమయంలో మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు 3 నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాలను కూడా సమీప మున్సిపాలిటీల్లో విలీనం చేయాలని ప్రతిపాదిస్తోంది. ఈ మేరకు జిల్లాలోని సంగారెడ్డి, జహీరాబాద్, సదాశివపేట మున్సిపాలిటీలతో పాటు అందోల్‌ – జోగిపేట నగర పంచాయతీల పరిధిని విస్తరించాలని సంబంధిత టౌన్‌ ప్లానింగ్‌ విభాగాలు ప్రతిపాదనలు కూడా సిద్ధం చేశాయి. ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తే జిల్లాలోని 25 గ్రామ పంచాయతీలు సమీప మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో విలీనం కానున్నాయి. అయితే మున్సిపాలిటీల్లో విలీనం ప్రతిపాదనలను సంబంధిత గ్రామ పంచాయతీలు ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నాయి. మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో విలీనంపై అభిప్రాయం తెలపాల్సిందిగా 25 పంచాయతీలకు జిల్లా పంచాయతీ విభాగం లేఖలు రాసింది. తాము మున్సిపాలిటీల్లో విలీనం కాబోమని సదాశివపేట మండలంలోని ఏడు గ్రామ పంచాయతీలు తీర్మానం చేశాయి. సంగారెడ్డి, జహీరాబాద్‌ మున్సిపాలిటీల్లో విలీనాన్ని వ్యతిరేకిస్తున్న కొన్ని పంచాయతీలు కూడా వ్యతిరేకంగా తీర్మానాలు చేశాయి.  జిల్లాలోని మరో 11 పంచాయతీలకు సంబంధించి కూడా తీర్మానాలు చేయాల్సి ఉండగా, అన్ని గ్రామాల్లోనూ విలీనంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

పన్నులు, ఉపాధిపై ఆందోళన
మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు 3 నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న పంచాయతీలను విలీనం చేయాలనే ప్రతిపాదనలపై సంబంధిత గ్రామాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. విలీనంతో ఆస్తి పన్ను, నల్లా పన్నుతో పాటు ఇతర పన్నుల భారం పెరుగుతుందనే అభిప్రాయం సంబంధిత గ్రామాల ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. ఇంటి నిర్మాణ అనుమతులు పొందడం కష్టమవుతుందని, ప్రతీ చిన్న పనికీ మున్సిపల్‌ కేంద్రానికి వెళ్లాలంటే దూరాభారం తప్పదనే భావన నెలకొంది. మున్సిపాలిటీ హోదా దక్కితే ఉపాధి హామీ పథకం జాబితా నుంచి సంబంధిత గ్రామాలను తొలగిస్తారు. అదే జరిగితే ప్రత్యామ్నాయ ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు పడతామనే అభిప్రాయం రైతులు, రైతు కూలీలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో విలీనానికి వ్యతిరేకంగా తీర్మానాలు చేయడంతోపాటు, స్థానిక శాసన సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులపైనా ఒత్తిడి తెస్తున్నారు. అయితే మున్సిపాలిటీలకు అత్యంత సమీపంలో ఉండే గ్రామాల్లో మాత్రం విలీనంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. స్థిరాస్తి ధరలు పెరగడంతోపాటు మెరుగైన మౌలిక సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయనే అభిప్రాయం నెలకొంది.

‘అమృత్‌’పై సంగారెడ్డి కన్ను!
లక్షకు పైబడిన జనాభా ఉన్న మున్సిపాలిటీలకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ అమృత్‌ (అటల్‌ మిషన్‌ ఫర్‌ రీజువినేషన్‌ అండ్‌ అర్బన్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌) హోదా ఇస్తోంది. అమృత్‌ హోదా దక్కితే సంగారెడ్డి మున్సిపాలిటీకి ఏటా రూ.20 కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.100 కోట్ల మేర నిధులు అందే వీలుంటుంది. అయితే  2011 జనాభా లెక్కల ప్రకారం సంగారెడ్డి మున్సిపాలిటీ జనాభా 72,395 కాగా.. ప్రస్తుతం 80వేలకు చేరిందని అంచనా. ఈ నేపథ్యంలో సంగారెడ్డి మున్సిపాలిటీకి సమీపంలో ఉన్న మల్కాపూర్, పోతిరెడ్డిపల్లి, కంది, మహ్మద్‌షాపూర్, కులబ్‌గూర్, తాళ్లపల్లి, కల్పగూరు, చింతల్‌పల్లి తదితర గ్రామ పంచాయతీలను విలీనం చేయాలని మున్సిపల్‌ టౌన్‌ ప్లానింగ్‌ విభాగం ప్రతిపాదించింది. అయితే మున్సిపాలిటీలో విలీనంపై విముఖతను వ్యక్తం చేస్తున్న సంబంధిత పంచాయతీలు వ్యతిరేకిస్తూ తీర్మానాలు చేయాలని నిర్ణయించాయి.


అభివృద్ధి కుంటుపడుతుంది
జహీరాబాద్‌ మున్సిపాలిటీలో పస్తాపూర్‌ విలీన ప్రతిపాదనను గ్రామస్తులు వ్యతిరేకిస్తున్నారు. నాతో సహా 14 మంది వార్డు సభ్యులు, ఎంపీటీసీ సభ్యుడు కూడా విలీనాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానంపై సంతకాలు చేశారు. నిధుల కొరతతో మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి జరగడం లేదు. మాకు అందుబాటులో ఉన్న నిధులతో గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు వంటి సౌకర్యాలను ఏర్పాటు చేసుకున్నాం. పన్నుల భారం పెరుగుతుందనే ఆందోళన కూడా గ్రామస్తులు వ్యక్తం చేస్తున్నారు. –పెద్దమర్రి రామకృష్ణారెడ్డి, సర్పంచ్, పస్తాపూర్, జహీరాబాద్‌ మండలం

గ్రేడ్‌ మారితే మరిన్ని నిధులు వస్తాయి
ప్రస్తుతం మూడో గ్రేడ్‌ మున్సిపాలిటీగా ఉన్న సదాశివపేటలో ఏడు గ్రామ పంచాయతీలను విలీనం చేయాలని ప్రతిపాదిస్తున్నాం. మున్సిపాలిటీ విస్తీర్ణం పెరిగితే మొదటి గ్రేడ్‌కు అప్‌గ్రేడ్‌ అవడంతోపాటు, ఆదాయం పెరుగుతుంది. ప్రభుత్వ పరంగా వచ్చే నిధులు, గ్రాంట్లు ఎక్కువ మొత్తంలో వస్తాయి. తద్వారా విలీన గ్రామాల్లోనూ మెరుగైన మౌలిక వసతులు కల్పించే వీలుంటుంది. మరోవైపు సంబంధిత గ్రామాల్లో ఇళ్లు, ఇళ్ల స్థలాల విలువ కూడా పెరుగుతుంది. – పట్నం విజయలక్ష్మి,  చైర్‌పర్సన్, సదాశివపేట మున్సిపాలిటీ

మరిన్ని వార్తలు