‘హరిద్ర’..ఇక సర్వాంగ సుందరం

29 Jan, 2018 20:24 IST|Sakshi
హరిద్ర వాగు సర్వేలో ఇరిగేషన్‌ అధికారులు

ఇక నిరంతరం జలగంగ

యాత్రికులకు ‘నదీ’ సౌకర్యం

ఆధ్యాత్మిక, పర్యాటక శోభితం

నాచగిరి ప్రగతికి తొలిమెట్టు

సీఎం హామీ అమలు.. 

సర్వే పనులు షురూ

వర్గల్‌(గజ్వేల్‌) : సహజసిద్ధ కొండ గుహల్లో స్వయంభువుగా శ్రీలక్ష్మీ నారసింహుడు వెలసిన భవ్య క్షేత్రం..తూర్పు దిశలో స్వామి వారి పాదాలు తాకుతూ అర్ధ చంద్రాకృతిలో ఉత్తరం మీదుగా పడమర వైపు పరవళ్లు తొక్కుతూ సాగిపోయే పవిత్ర హరిద్రా నది ప్రవాహం..వెరసి రెండో యాదాద్రిగా భక్తజనాదరణ చూరగొంటున్న వర్గల్‌ మండలం నాచారం గుట్ట శ్రీలక్ష్మీ నృసింహ క్షేత్రం. అయితే, ఒకప్పుడు గలగల పారిన హరిద్ర నేడు.. వానలు కరువై, బావులు అంతర్ధానమై, గొట్టపు బావులు వట్టిపోతున్న వేళ.. ఉనికి కోల్పోయే దుస్థితి దాపురించింది. నాచగిరికి కంఠహారం కావాల్సిన ఈ నది మురుగుకూపంగా మారింది. తాజాగా, సీఎం కేసీఆర్‌ హామీతో ‘హరిద్రా’ నదికి మోక్షం లభించింది. నిరంతర జలకళ, సుందరీకరణతో అలరారనున్నది. ఇందులో భాగంగా ఆదివారం సర్వే పనులు మొదలయ్యాయి.

800 మీటర్ల పొడవునా ‘హరిద్ర’ తీరం
నాచారం గుట్ట శ్రీలక్ష్మీ నృసింహ క్షేత్రం మీదుగా 800 మీటర్ల పొడవునా హరిద్రానది ప్రవహిస్తుంది. దక్షిణ భారతదేశంలో ఎక్కడాలేని విధంగా ఈ ప్రవాహం క్షేత్రం చుట్టూరా అర్ధచంద్రాకృతిలో తాకుతూ తూర్పు దిశ నుంచి ప్రారంభమై ఉత్తరం మీదుగా పడమటి వైపు సాగిపోతుంది. ఈశాన్యంలో జలకళ ఉండడం ప్రాశస్త్యంగా భావిస్తారు. çహరిద్రానది ప్రవహించే మార్గాన్ని పసుపులేరుగా, హల్దీవాగుగా ఈ ప్రాంత ప్రజలు పిలుస్తుంటారు. నాచారం వద్ద ఎగువ భాగంలో గతంలో వాగుకు అడ్డంగా ఆనకట్ట నిర్మించారు. వాగు పొంగి పొరలితేనే దిగువకు నీళ్లు అనే పరిస్థితి.. దీంతో ఆలయం ముందు నుంచి ప్రవహించాల్సిన వాగులో నీటి నిల్వలు కరువై పిచ్చిమొక్కలకు ఆలవాలమైంది. దుర్ఘంధం పంచే మురుగు కూపంగా మారింది.

 సీఎం కేసీఆర్‌ హామీతో మోక్షం..
ఈ నెల 17న తూప్రాన్‌ నుంచి గజ్వేల్‌ వైపు వెళుతున్న సీఎం కేసీఆర్‌ ఆలయ ఛైర్మన్, స్థానికుల అభ్యర్థన మేరకు  నాచారం గుట్ట బ్రిడ్జివద్ద రెండు నిమిషాలు ఆగారు. నాచగిరి క్షేత్రానికి వన్నెలద్దేలా ‘హరిద్ర’ సుందరీకరించాలని, యేడాది పొడవునా నీరుండేలా తీర్చిదిద్దాలని ఆదేశించారు. దీంతో భక్తజనులకు నదీ స్నానం చేసే అవకాశం చేరువకానున్నది. సర్వాంగ సుందరంగా హరిద్రను తీర్చిదిద్దే పనులకు తొలి అడుగుపడింది.

ఇరిగేషన్‌ బృందం సర్వే ప్రారంభం
రిటైర్డ్‌ ఎస్‌ఈ, ఉమ్మడి జిల్లా నీటిపారుదల విభాగం ప్రభుత్వ సలహాదారు మల్లయ్య నేతృత్వంలో మండల ఇరిగేషన్‌ ఏఈ విష్ణువర్ధన్‌రెడ్డి, టోటల్‌ స్టేషన్‌ ఆపరేటర్, మరో ముగ్గురు సహాయకులతో కూడిన బృందం నాచగిరి వద్ద హరిద్రా (హల్దీ వాగు) సర్వేకు ఆదివారం శ్రీకారం చుట్టింది. వాగు లోతు, వెడల్పు, కాంటూరు లెవెల్స్‌తో డిజిటల్‌ విధానంలో, ఆధునిక యంత్రాలతో కొలతల సేకరణలో బృందం నిమగ్నమైంది. ఎక్కడెక్కడ చెక్‌డ్యామ్‌లు నిర్మించాలి, నీటి నిల్వ సామర్థ్యం, గోడల నిర్మాణం పరిగణలోకి తీసుకుని సర్వే చేపట్టారు. మంగళవారంలోగా అంచనాలతో కూడిన  ప్రతిపాదనలు సిద్ధం చేసి జిల్లా కలెక్టర్‌కు నివేదిస్తారు.

రెండో దశలో సుందరీకరణ కోసం సర్వే
ఇరిగేషన్‌ బృందం హరిద్ర ప్రక్షాళన, నీటి నిల్వ లకు సర్వే ముగిసిన తరువాత రెండో దశలో హరిద్ర సుందరీకరణకు టూరిజం శాఖ రంగంలోకి దిగనుంది. మాస్టర్‌ప్లాన్‌లో అంతర్భాగమై న హరిద్రా నది సుందరీకరణకు వీలుగా పర్యాటక ఆదరణ చూరగొనేలా ల్యాండ్‌ స్కేపింగ్, చిన్న గార్డెన్, గ్రీనరీ, లైట్లు, పిల్లలు ఆడుకునే ప్లే ఏరియా, దేవతార్చనకు వీలుగా ప్రత్యేకంగా పూలతోట,  పెడల్‌ బోట్లు, ఆధ్యాత్మికత పరిఢవిల్లేలా దేవతా విగ్రహాల ప్రతిమలు, హరిద్రా అందాలను ఇనుమడింపజేయనున్నాయి. 

పుణ్యక్షేత్రం వద్ద నదీ సౌకర్యం
సీఎం కేసీఆర్‌ నాచగిరి క్షేత్రం వద్ద ‘హరిద్ర’ నది యేడాది పొడవునా జీవకళ ఉట్టిపడేలా జలకళతో తీర్చిదిద్దనున్న నేపథ్యంలో  సందర్శనకు వచ్చే భక్తులకు నదీ సౌకర్యం చేరువకానున్నది. మూడు చెక్‌డ్యామ్‌లు, మూడు స్నానపు ఘాట్లు, పురుషులకు, మహిళలకు దుస్తులు మార్చుకునేందుకు వేర్వేరు గదులు, ఇతర సౌకర్యాలు డ్యామ్‌ల వద్దనే కల్పించనున్నాం. మిషన్‌ కాకతీయ ద్వారా జూన్‌లోగా హరిద్రపై డ్యామ్‌ల నిర్మాణం, సుందరీకరణ పూర్తి చేయాలన్నదే మా సంకల్పం. ఇందుకోసం సర్వేకు శ్రీకారం చుట్టాం. జూన్‌లో కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి కొండపోచమ్మ ద్వారా ఇతర చెరువులు, వాగులతోపాటు, నాచగిరి హరిద్ర నదిని అనుసంధానం చేస్తాం.
– గడా అధికారి హన్మంతరావు

మరిన్ని వార్తలు