102 ఏళ్ల బామ్మ సాహసానికి సలాం!!

13 Dec, 2018 15:59 IST|Sakshi

ఎత్తైన ప్రదేశాల నుంచి కిందకి చూస్తే కళ్లు తిరగటం సహజం. మనలో చాలా మందికి ఇలాంటి అనుభవం ఎపుడో ఒకసారి ఎదురయ్యే ఉంటుంది. అయితే ఇరిన్‌ ఒషక్‌ అనే బామ్మ మాత్రం ఇందుకు మినహాయింపు.102 ఏళ్ల వయసులో ఏకంగా 14 వేల అడుగుల ఎత్తు నుంచి స్కైడైవింగ్‌ చేసి.. ఈ ఫీట్‌ చేసిన అత్యంత పెద్ద వయస్కురాలిగా సరికొత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నారు. దక్షిణ ఆస్ట్రేలియాలోని లాంగ్‌హార్న్‌ క్రీక్‌ ఇందుకు వేదిక అయింది. శిక్షకురాలితో కలిసి బామ్మ గాల్లో విహరించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో బామ్మ సాహసాన్ని నెటిజన్లు ప్రశంసించడంతో పాటు.. ఇలా చేయడానికి గల కారణాన్ని తెలుసుకుని ఆమె పెద్ద మనసుకు సలాం అంటున్నారు.

అసలు విషయమేమిటంటే... దక్షిణ ఆస్ట్రేలియాకు చెందిన న్యూరాన్‌ మోటార్‌ డిసీజ్‌ అసోసియేషన్‌ వ్యాధిగ్రస్తుల చికిత్స కోసం విరాళాలు సేకరిస్తోంది. ఇందులో భాగంగా తన వంతు సాయం చేసేందుకు ఒషక్‌ ముందుకు వచ్చారు. స్కైడైవింగ్‌ చేయడం ద్వారా సమకూరే ఆదాయాన్ని చారిటీ కోసం వినియోగించేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఆదివారం జరిగిన స్కైడైవింగ్‌ ఈవెంట్‌లో పాల్గొని విజయవంతంగా స్టంట్‌ పూర్తి చేశారు. అయితే ఇలాంటి స్టంట్‌ చేయడం బామ్మకు ఇదే మొదటిసారి కాదు. 2016లో స్కైడైవింగ్‌ చేసి... తద్వారా వచ్చిన సొమ్మును కూడా విరాళంగా ఇచ్చేశారు. ఆపదలో ఉన్న వారికి సాయం చేయాలనుకునే గుణం ఉంటే చాలు అందుకు వయసు, వయోభారం అడ్డంకి కానేకాదు అనే విషయాన్ని బామ్మ నిరూపించారు అంటూ నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

>
మరిన్ని వార్తలు