కదిలించే కథనం.. ఆన్‌లైన్‌ క్లాస్‌లో టీచర్‌కు అవమానం

17 Jul, 2020 08:42 IST|Sakshi

టీచర్లను ఏడిపించడం.. వారిని ఎగతాళి చేస్తూ మాట్లాడటం వంటి చేష్టల్ని హీరోయిజంగా చూపిస్తారు సినిమాల్లో. కానీ వాస్తవంగా ఆ పరిస్థితులు ఎంత కఠినంగా ఉంటాయో.. ఎంతటి వేదనను కల్గిస్తాయో.. మనం ఊహించలేము. తాజాగా ఇందుకు సంబంధించిన స్టోరీ ఒకటి ప్రస్తుతం సోషల్‌మీడియాలో తెగ వైరలవుతోంది. తప్పకుండా ప్రతి ఒక్కరు చదివి, షేర్‌ చేసుకుని.. నిజ జీవితంలో ఇలాంటి పనులు చేయకూడదని కోరుతున్నారు నెటిజనులు. ఆ వివరాలు.. కరోనా వైరస్‌ కట్టడి కోసం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించిన సంగతి తెలిసిందే. దాంతో విద్యాసంస్థలు మూతపడ్డాయి. సాధారణంగా ప్రతి ఏడాది ఈ పాటికి అకాడమిక్‌ ఇయర్‌ ప్రారంభించాల్సిన సమయం. కానీ కరోనా వైరస్‌ నానాటికి విజృంభిస్తుండటంతో... విద్యా సంస్థలను ఇంకా తెరవలేదు. కానీ ప్రైవేట్‌ విద్యా సంస్థలు మాత్రం ఆన్‌లైన్‌ క్లాస్‌లు నడుపుతున్నాయి. 

ఈ క్రమంలో నెలరోజుల క్రితం ఓ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ తమ టీచర్లను పిలిచి ఈ ఏడాది ఆన్‌లైన్‌ క్లాస్‌లు తీసుకోవాల్సిందిగా ఆదేశించాడు. ప్రిన్సిపాల్‌ మాటలు వినగానే ఓ 55 ఏళ్ల టీచర్‌కు గుండెల్లో దడ మొదలయ్యింది. ఎందుకంటే ఆయనకు ఇంకా స్మార్ట్‌ఫోన్‌ వాడకం గురించి పూర్తిగా తెలీదు. అలాంటిది ఆన్‌లైన్‌లో క్లాస్‌లు తీసుకోవడం అంటే ఇక ఆయన పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. తనకు చేతకాదని చెప్తే యాజమాన్యం జాబ్‌ నుంచి తొలగిస్తుంది. ఈ వయసులో ఆయనకు మరో ఉద్యోగం దొరకడం అంటే చాలా కష్టం. ఈ సమస్య గురించి కూతురుతో చెప్పాడు. ఆమె తండ్రికి ధైర్యం చెప్పి.. జూమ్‌లో ఆన్‌లైన్‌ క్లాస్‌ ఎలా తీసుకోవాలి.. స్మార్ట్‌ఫోన్‌ వాడకం గురించి కొన్ని బెసిక్స్‌ నేర్పింది. పిల్లలకు పాఠాలు చెప్పాలంటే బోర్డు కావాలని చెప్పి దాన్ని కూడా తెప్పించాడు సదరు ఉపాధ్యాయుడు. ఫస్ట్‌ రోజు క్లాస్‌లో బాగా కనిపించాలనే ఉద్దేశంతో కొత్త షర్ట్‌ తీసుకున్నాడు. ఇక ఆన్‌లైన్‌ క్లాస్‌లు మొదలు పెట్టే రోజు రానే వచ్చింది. అన్ని సిద్ధం చేసుకుని పాఠం ప్రారంభించాడు. (సోషల్ మీడియాలో టీచర్ల మార్ఫింగ్ ఫొటోలు)

కానీ మొదటి సారి కెమరా ముందు నిల్చుని పాఠం చెప్పాలంటే కాస్తా భయపడ్డాడు. గొంతు వణుకుతోంది. ఆయన ఇలా ఇబ్బంది పడుతుండగా ఓ గుర్తు తెలియని ఐడీ నుంచి కొన్ని అసభ్యకరమైన మాటలు వినిపించాయి. అసలే ఆన్‌లైన్‌ గురించి సరిగా తెలియని ఆ టీచర్‌.. ఈ చర్యలకు మరింత భయపడ్డాడు. ఎలా స్పందించాలో అర్థం కాలేదు.. విద్యార్థుల మీద అరిచాడు. కానీ ఆ మాటలు మాత్రం ఆగలేదు. ఆయన ఇన్నేళ్లు సంపాదించుకున్న గౌరవం కొన్ని సెకన్లలో తుడిచిపెట్టుకుపోయింది. దాంతో వీడియోను మ్యూట్‌ చేశాడు. కానీ ఆ విద్యార్థి అన్‌మ్యూట్‌ చేసి.. టీచర్‌ను ఎగతాళి చేస్తూనే ఉన్నాడు. ఇదంతా ఆ విద్యార్థికి వినోదంగా అనిపిస్తుంది. దీన్నుంచి బయటపడాలంటే క్లాస్‌ను ముగించడం ఒక్కటే మార్గం. కానీ రేపు ఇలానే జరుగుతుంది. మరి అప్పుడేం చేయాలి. ప్రస్తుతం ఈ ఉద్యోగం చేయడం అతడికి ఎంతో అవసరం. దాంతో దుఖం తన్నుకొచ్చింది. (‘ఆన్‌లైన్‌’ ఆదేశాలపై కోర్టుకు వెళ్లిన హార్వర్డ్, ఎంఐటీ)

కుమార్తెను పిలిచి ఒక్కసారిగా బోరున ఏడ్చాడు. ఇన్నేళ్లు ఎందరికో విద్యాబుద్ధులు నేర్పిన వ్యక్తి.. ఈ అవమానాన్ని తట్టుకోలేకపోయాడు. ఏడుస్తూనే ఉన్నాడు. మరుసటి రోజును తలుచుకుంటే.. ఆ రాత్రి అతడికి నిద్ర కూడా పట్టలేదు. విద్యార్థులకు వినోదం.. అతడికి ప్రాణసంకటంగా మారింది పరిస్థితి. ‘టీచర్లను ఎగతాళి చేసి మీరు వినోదం పొందుతారేమో కానీ.. భవిష్యత్తులో మీరు బాధపడతారు’ అంటూ షేర్‌ చేసిన ఈ కథనం ప్రతి ఒక్కరిని ఆలోచింపచేస్తోంది. అయితే  ఈ ఘటన ఎక్కడ జరిగిందనే వివరాలు వెల్లడి కాలేదు. 

మరిన్ని వార్తలు