బాక్సింగ్‌తో దొంగకు చుక్కలు చూపించాడు

20 Feb, 2020 14:13 IST|Sakshi

కార్డిఫ్‌ : అమెరికాలో ఒక వృద్దుడు తన బాక్సింగ్‌ పంచ్‌లతో ఒక దొంగకు చుక్కలు చూపెట్టిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాలు.. యూకేలో కార్డిఫ్‌లో నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతంలో 77 ఏళ్ల వ్యక్తి తన కారును పార్క్‌ చేసి డబ్బులు డ్రా చేసేందుకు ఏటీఎం సెంటర్‌కు వెళ్లాడు. డబ్బులు డ్రా చేసి బయటకు వచ్చాడు. ఇంతవరకు బాగానే ఉంది. ఆ ముసలాయన తిరిగి కారు వద్దకు వెళుతుండగా ఒక వ్యక్తి ముసుగు వేసుకొని అతనికి అడ్డు వచ్చి డబ్బులు ఇవ్వమంటూ దౌర్జన్యం చేశాడు. అయితే అసలు మలుపు ఇక్కడే చోటుచేసుకుంది. దీనికి తాత భయపడక పోగా దొంగపై తన బాక్సింగ్‌ నైపుణ్యాన్ని ప్రదర్శించాడు.

దొంగకు తన పంచ్‌లతో ముచ్చెమటలు పట్టించాడు. ఆ దొంగ ఈ తాతతో అనవసరంగా పెట్టుకున్నానంటూ అక్కడి నుంచి ఉడాయించే ప్రయత్నం చేశాడు. కానీ తాత అతన్ని అంత తేలిగ్గా ఏం వదల్లేదు. చివరకు ఎలాగోలా తాత పంచ్‌ల నుంచి బతుకుజీవుడా అనుకుంటూ దొంగ అక్కడినుంచి పారిపోయాడు. ఇదంతా అక్కడి సీసీ టీవీ ఫుటేజీల్లో రికార్డయింది. దీనిని కాస్త కార్డిఫ్‌ పోలీసులు తమ ట్విటర్‌లో షేర్‌ చేయడంతో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తాత చేసిన పనికి పొగడ్తలతో ముంచెత్తారు. తాత ప్రదర్శించిన ధైర్య సాహసాలు అదుర్స్‌ అని..  తాత తన స్కూల్లో నేర్చుకొన్న బాక్సింగ్‌ స్కిల్స్‌ ఇప్పుడు పనికివచ్చాయంటూ..  తాతయ్య చేసిన సాహసం మా కుర్రకారుకు ఇన్స్‌పిరేషన్‌ అంటూ నెటిజన్లు కామెంట్లు పెట్టారు. 

Read latest Social-media News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా