వినికిడి లోపం ఉన్న యువతికి సాయం చేసిన ఎయిర్‌హోస్టెస్‌

20 Sep, 2019 13:19 IST|Sakshi

వికలాంగులు అంటే మనలో చాలా మందికి ఎంతో చిన్న చూపు. వారికి సాయం చేయాల్సింది పోయి చీదరించుకుంటారు చాలా మంది. ఇక ప్రయాణాల్లో అయితే వేరే చెప్పక్కర్లేదు. సాయం చేయకపోగా సూటి పోటీ మాటలంటూ వారిని బాధపెట్టేవారిని నిత్యం చూస్తూనే ఉంటాం. ఈ క్రమంలో ఓ వికలాంగురాలి పట్ల ఓ ఎయిర్‌హోస్టెస్‌ చూపించిన కేర్ ఆమెపై ప్రశంసలు కురిపిస్తుంది. ఈ సంఘటన డెల్డా ఎయిర్‌లైన్స్‌కి చెందిన ఎండీవర్‌ విమానంలో చోటు చేసుకుంది. కొద్ది రోజుల క్రితం ఆష్లే అనే యువతి ఎండీవర్‌ విమానంలో ప్రయాణించింది. అయితే ఆమెకు వినికిడి లోపం ఉంది. ఆ విషయం తెలుసుకున్న ఎయిర్‌హోస్టెస్‌ జన్నా, ఆష్లేకి ప్రయాణంలో ఎలాంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో.. ఓ కాగితం మీద విమానంలో ఉన్న సౌకర్యాల గురించి రాసిచ్చింది.

‘దానిలో హాయ్‌ ఆష్లే.. ఈ రోజు నేను ఈ ఫ్లైట్‌ అటెండెంట్‌ని. నీవు కూర్చున్న సీటు పై భాగంలో అనగా నీ తలపైన రెండు బటన్లు ఉన్నాయి. వాటిలో పసుపుపచ్చది లైట్‌ని కంట్రోల్‌ చేస్తుంది. నీకు నాతో ఏమైనా అవసరం ఉంటే బూడిదరంగులో పెద్దగా ఉన్న బటన్‌ను ప్రెస్‌ చేస్తే నేను నీ దగ్గరకు వస్తాను. అత్యవసర పరిస్థితులు తలెత్తితే.. నీ వెనకే ఉన్న ఎక్జిట్‌ బటన్‌ను ప్రెస్‌ చేయ్‌. నీకు ఏ సాయం కావాలన్న నన్ను అడుగు. మొహమాట పడకు’ అంటూ కాగితం మీద రాసిచ్చింది. దీన్ని ఆష్లే తల్లి తన ట్విటర్‌లో పోస్ట్‌ చేయడంతో ప్రస్తుతం ఇది తెగ ట్రెండ్‌ అవుతోంది. జన్నా మంచిమనసును నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
 

మరిన్ని వార్తలు