వైరల్‌ : కార్‌ను ఇలా కూడా వాడొచ్చా..?!

19 Dec, 2018 15:56 IST|Sakshi

ఆమిర్‌ ఖాన్‌, ఆర్‌ మాధవన్‌, శర్మన్‌ జోషి, కరీనా కపూర్‌ ప్రధాన పాత్రల్, రాజ్‌ కుమార్‌ హిరాణీ దర్శకత్వంలో వచ్చిన త్రీ ఇడియట్స్‌ సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిన సంగతి.  విద్యావ్యవస్థలోని లోపాలను, ఇంజనీరింగ్‌ పట్ల మనకున్న వ్యామోహాన్ని తప్పు పడుతూ.. చదువుకు అసలైన నిర్వచనం చెప్పింది ఈ సినిమా. ఈ సినిమాలో ఆమిర్‌ నటించిన ‘పున్సుక్‌ వాంగ్డు’ పాత్రకు ప్రేరణనిచ్చిని వ్యక్తి సోనమ్‌ వాంగ్చుక్‌. లడఖ్‌కు చెందిన వాంగ్చుక్‌.. ‘ఎడ్యుకేషనల్‌ అండ్‌ కల్చరల్‌ మూవ్‌మెంట్‌ ఆప్‌ లడఖ్‌’ అనే సంస్థను స్థాపించి జీవితాలకు పనికి వచ్చే విద్యను నేర్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో వాంగ్చుక్‌ చేసిన ఓ ప్రయోగం జనాలను విపరీతంగా ఆకట్టుకుంటుంది. కార్‌ను రీసైకిల్‌ చేసి ఇంటి కప్పుగా మార్చిన వైనం ఆశ్చర్యపరుస్తోంది.

వాంగ్చుక్‌ తన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసిన ఈ ఫోటో మహీంద్ర గ్రూప్‌ చైర్మెన్‌ ఆనంద్‌ మహీంద్రను తెగ ఆకర్షించింది. దాంతో ఆయన వాంగ్చుక్‌ను ప్రశంసిస్తూ ట్వీట్‌ చేశారు. ‘ఓ స్నేహితుడు పంపించిన ఈ ఫోటో ద్వారా వాంగ్చుక్‌ సృజనాత్మకత నాకు తెలిసింది. మహీంద్ర కారును ఇంటి పై కప్పుగా మార్చిన మీ ఆలోచన నిజంగా సూపర్బ్‌. మీ ఇన్‌స్టిట్యూట్‌లో పనికిరానిదంటూ దేన్ని వదిలేయరు కదా. ఇది మా ఆటో షెడ్డింగ్‌ వెంచర్‌తో పోటీ పడుతోంది. కానీ మీ ఆలోచన ఎంతో సృజనాత్మకంగా ఉందం’టూ అభినందిస్తూ ట్వీట్‌ చేశారు. 

వాంగ్చుక్‌ ఈ ట్వీట్‌కు బదులిస్తూ.. ‘ఆనంద్‌ మహీంద్ర మీరు మంచి స్టోరిని షేర్‌ చేశారు. 1997 - 2007 వరకూ ఈ కార్‌ మా దగ్గర చాలా విశ్వసనీయంగా పని చేసింది. ఎడ్యూకేషనల్‌ క్యాంపెయిన్‌ నిర్వహించడంలో ఈ కార్‌ మాకెంతో ఉపయోగపడింది. ఫలితంగా కేవలం 5 శాతంగా ఉన్నా మెట్రిక్యులేషన్‌ ఫలితాలు ఇప్పుడు 75 శాతానికి పెరిగాయి’ అంటూ రీట్వీట్‌ చేశారు.

దీనికి బదులిస్తూ ఆనంద్‌ మహీంద్ర ‘సోనమ్‌ మీరు చెప్పింది వాస్తవం. మీ ఎడ్యుకేషనల్‌ క్యాంపెయిన్‌ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నాను.. ఒక వేళ మీ క్యాంపెయిన్‌ ఇంకా వేటినైనా పూర్తి చేయలేదని భావిస్తే.. అందుకు నేను ఎలాంటి సాయం చేయగలనో తెలపండి’ అంటూ రీట్వీట్‌ చేశారు. వాంగ్చుక్‌, ఆనంద్‌ మహీంద్రల మధ్య జరిగిన ట్విట్టర్‌ సంభాషణ జనాలను విపరీతంగా ఆకట్టుకుంటుంది. నెటిజన్లు వీరిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. 

మరిన్ని వార్తలు