‘నేనలా చేయను.. నా పెళ్లి నా ఇష్టం’

31 Jan, 2019 14:55 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : భారతీయ సంస్కృతి, సంప్రదాయాల్లో వివాహ కార్యక్రమానికి ప్రముఖ స్థానం ఉంది. పెళ్లి తంతు దేశంలోని ఒక్కో చోట ఒక్కోలా ఉంటుంది. కానీ, కన్యాదానం, పెళ్లి కూతురుని అత్తవారింటికి సాగనంపుట వంటివి మాత్రం తప్పసరిగా ప్రతీ పెళ్లిలో ఉంటాయి. బెంగాల్‌కు చెందిన ఓ యువతి మాత్రం ఇవన్నీ తనకు అవసరం లేదని కుండబద్దలు కొట్టారు. పాత కాలం నాటి పెళ్లి పద్ధతులు పాటించనని తేగేసి చెప్పారు. వినూత్నంగా తన వివాహా కార్యక్రమాన్ని జరిపించారు. తన తల్లితో వరుడి కాళ్లు కడిగించలేదు. అప్పగింతల సమయంలో అందరిలా కన్నీరు పెట్టుకోలేదు. 

‘ఏడవాల్సిన అవసరం నాకేముంది. నేనెక్కడికి పోతున్నాను. నా పుట్టింటికి తరచుగా వస్తుంటాను. ఇది నా ఇల్లు’ అని అక్కడున్న సంప్రదాయ వాదులకు సమాధామిచ్చారామే. వీడ్కోలు సందర్భంగా తన తల్లి ఒడిలో బియ్యం పోయాల్సిందిగా ఆమె బంధువొకరు చెప్పగా.. ‘ఎందుకూ..? తల్లిదండ్రుల రుణం తీరిపోయిందని చెప్పేందుకేనా ఈ సంప్రదాయం. అయితే, నాకు అలాంటిది అవసరం లేదు. ఎందుకంటే.. తల్లిదండ్రుల రుణం ఎప్పటికీ తీరిపోదు’ అని తనదైన స్టైల్‌లో బదులిచ్చారు. మెట్టినింటికి వెళ్తున్న క్రమంలో కూడా.. నవ్వుతూ ఫొటోలకు పోజిచ్చారు ఈ బెంగాలి యువతి. కాగా, ఈ పెళ్లికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. పాతకాలం నాటి.. మహిళలను, వధువు తరపున వారిని తక్కువగా చేసి చూపించే పెళ్లి పద్ధతులు పాటించాల్సి అవసరం లేదని పలువురు కామెంట్‌ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు