దుమ్ము రేపుతున్న బిత్తిరి సత్తి ‘రాజన్న బిడ్డ’ పాట

8 Apr, 2019 14:52 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ యాస, భాషతో యాంకర్‌గా, ప్రెజెంటర్‌గా రాణిస్తున్న బిత్తిరి సత్తి అలియాస్ రవి ఇప్పుడు సింగర్‌గా తెలుగు ప్రజలను ఉర్రూతలూగిస్తున్నారు. ఇప్పటి వరకు తెలంగాణకు సంబందించిన పాటలు మాత్రమే పాడిన సత్తి తొలిసారి వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కోసం ఓ పాటను పాడారు. తీన్మార్ వార్తల యాంకర్‌గా కనిపించే బిత్తిరి సత్తిని ప్రాంతాలకు అతీతంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆదరిస్తున్నారు. ‘రాజన్న బిడ్డ అదుగో.. వస్తున్నాడు చూడరా.. అచ్చం రాజన్న లా నేడే ’ అంటూ సాగే పాటను బిత్తిరి సత్తి ఇరగదీశారు. 

అరచేతిలో స్వర్గం చూసే నాయకులే మనకొద్దురా.. ఆంధ్రప్రదేశ్‌కి జగనన్నే రావాలిరా.. రానే వచ్చాడు రానే వచ్చాడు నాయకుడే వచ్చాడు రా.. అంటూ మాస్ బీట్‌తో సాగే ఈ పాట లేటెస్ట్ సెన్సేషన్‌గా నిలిచింది. వైఎస్ జగన్‌ ప్రజాసంకల్పయాత్రలోని కొన్ని ప్రధాన దృశ్యాలను ఈ గీతానికి బ్యాక్ డ్రాప్‌గా చూపించారు. కొన్ని ఆసక్తికరమైన ఫొటోలను కూడా దీనికోసం వినియోగించారు. బిత్తిరి సత్తి తన సొంత యూట్యూబ్ ఛానల్‌లో పోస్ట్‌ చేసిన ఈ సాంగ్‌ తక్కువ సమయంలోనే యూట్యూబ్ టాప్ ట్రెండింగ్‌ జాబితాలో దూసుకుపోతోంది. వైఎస్‌ జగన్‌ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేలా లిరిక్స్‌ ఉన్నాయంటూ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

మరోవైపు సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గెలుపును కాంక్షిస్తూ రూపొందించిన ‘రావాలి జగన్‌.. కావాలి జగన్‌’ ప్రచార గీతం రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసిన మారుమోగుతోంది. ఒక పార్టీ ప్రచారగీతం 1.7 కోట్ల వ్యూస్‌ సాధించి దేశ రాజకీయ చరిత్రలోనే యూట్యూబ్‌ ఆల్‌టైం రికార్డ్‌లను తిరగరాసింది.

మరిన్ని వార్తలు