మెన్‌ ఇన్‌ బ్లూ; కలర్‌ బ్లైండ్‌నెస్‌ వచ్చిందా?!

16 Oct, 2018 08:51 IST|Sakshi

వెస్టిండీస్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను టీమిండియా 2-0 తేడాతో క్లీన్‌స్వీప్‌ చేసిన సంగతి తెలిసిందే. ఆదివారం ముగిసిన రెండో టెస్టులో విరాట్ సేన10 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఈ విక్టరీని సెలబ్రేట్‌ చేసుకుంటూ అభిమానులంతా సోషల్‌ మీడియా వేదికగా టీమిండియాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే కాంగ్రెస్‌ పార్టీ కూడా విరాట్‌ సేనకు అభినందనలు తెలపాలనే ఉత్సాహంతో... ‘ వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకున్న మెన్‌ ఇన్‌ బ్లూకు అభినందనలు’ అంటూ ట్వీట్‌ చేసింది. దీంతో కాంగ్రెస్‌ పార్టీ సోషల్‌ మీడియా వింగ్‌పై నెటిజన్లు జోకులు పేలుస్తూ ట్రోల్‌ చేయడం మొదలు పెట్టారు.

‘వాళ్లకి(కాంగ్రెస్‌) ఇప్పుడు కంటి వైద్యుడి అవసరం కూడా వచ్చింది. తెలుపు రంగు కూడా నీలంలాగే కన్పిస్తోంది. టెస్టు మ్యాచులో తెలుపు రంగు జెర్సీ ధరిస్తారు కదా’ అంటూ ఓ నెటిజన్‌ కామెంట్‌ చేయగా.... ‘ పాపం కాంగ్రెస్‌ ఐటీ సెల్‌కి కలర్‌ బ్లైండ్‌నెస్‌ వచ్చింది దయచేసి రెండు నిమిషాలు మౌనం పాటిద్దాం’ అంటూ మరొకరు ట్వీట్‌ చేశారు. ‘మెన్‌ ఇన్‌ వైట్‌ వెస్టిండీస్‌ను ఓడించారు. తర్వాత జాతీయ ఎన్నికల్లో కాషాయ రంగు ధరించే భారతీయులు వెస్ట్రాన్‌ ఇండీస్‌ను ఓడిస్తారు. సిద్ధంగా ఉండండి’ అంటూ ఇంకో నెటిజన్‌ చమత్కరించారు. కాగా ఇలా నవ్వులు పాలవడం కాంగ్రెస్‌ ఐటీ సెల్‌కు కొత్తేమీ కాదు. గతంలో.. కాంగ్రెస్ చీఫ్ రాహుల్‌ జర్మనీ పర్యటన సందర్భంగా.. ఆ దేశ పార్లమెంటును సందర్శించిన సమయంలో.. ‘రాహుల్  వైవిధ్య భరిత హావభావాలు’ అని క్యాప్షన్ తగిలించి ఇలాగే ట్రోలింగ్‌ ఎదుర్కొంది.

మరిన్ని వార్తలు