వైరల్‌ వీడియో.. ఫేక్‌ న్యూస్‌ అన్న పీఐబీ

20 Jul, 2020 14:16 IST|Sakshi

కరోనా వైరస్‌ వ్యాప్తి ప్రారంభమైన నాటి నుంచి సోషల్‌మీడియాలో ఫేక్‌ న్యూస్‌కు అడ్డుఅదుపు లేకుండా పోతుంది. సారా, ఆవు పంచకం తాగితే కరోనా రాదని చెప్పడంతో జనాలు ఎగబడిన వైనం చూశాం. అలానే ఫలానా కషాయాలు తాగినా, వేప చెట్టుకు నీళ్లు పోయడం వంటి పూజలు చేసినా కరోనా బారిన పడరనే వార్తలు తెగ వైరలయిన సంగతి తెలిసిందే. ఓ వైపు కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి వార్తలు ప్రజలను మరింత భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఈ క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి ఫేక్‌ న్యూస్‌ కట్టడి కోసం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికి నిత్యం ఏదో ఒక కొత్త వార్త వెలుగులోకి వస్తూనే ఉంది. తాజాగా కరోనాకు సంబంధించి మరో ఫేక్‌ న్యూస్‌ వీడియో తెగ ప్రచారం అవుతోంది.(ఫేక్‌ న్యూస్‌: నటి ఆవేదన)

కరోనా అనేది వైరస్‌ కాదని.. బ్యాక్టీరియా అని.. అస్పిరిన్‌తో కోవిడ్‌ భరతం పట్టవచ్చని ఈ వీడియో సారాంశం. 5జీ ఎలక్ట్రోమాగ్నటిక్‌ రేడియేషన్‌ వలన కరోనా వ్యాపిస్తుందని.. అస్పిరిన్‌ తీసుకుంటే తగ్గిపోతుందని వీడియో వెల్లడిస్తుంది. ఈ నేపథ్యంలో పీఐబీ ఫ్యాక్ట్‌ చెక్‌ ట్విట్టర్‌ ఇది ఫేక్‌ న్యూస్‌ అని స్పష్టం చేసింది. ఇలాంటి వార్తలను నమ్మవద్దని కోరింది. కరోనా అనేది వైరస్‌ అని.. దానికి ఇంతవరకు ఎలాంటి మందు తయారు చేయలేదని పీఐబీ స్పష్టం చేసింది. కొద్ది రోజుల క్రితం శానిటైజర్‌ను ఎక్కువగా వాడితే.. చర్మ సంబంధ వ్యాధులు, క్యాన్సర్‌ వచ్చే అవకాశం ఉందనే వార్త ప్రచారం అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 70శాతం అల్కహాల్‌ ఉన్న శానిటైజర్‌ను వాడితే ఎలాంటి ప్రమాదం లేదని.. కరోనా నుంచి కాపాడుకోవడానికి ఇది ఎంతో ముఖ్యమని పీఐబీ స్పష్టం చేసింది.(ఎందరినో రక్షించి.. బలయ్యాడు)

మరిన్ని వార్తలు