వైరలవుతోన్న ఓ ఫేస్‌బుక్‌ పోస్ట్‌

9 May, 2019 20:42 IST|Sakshi

న్యూఢిల్లీ : పిల్లలు పరీక్షల్లో నూటికి తొంభై శాతం మార్కులు సాధించినా కొందరు తల్లిదండ్రులు సంతృప్తి పడరు. వేలకువేలు పోసి చదివిస్తే.. ఈ మార్కులేనా అంటూ విమర్శలు. ఇలాంటివారిని చూస్తే.. అత్తెసరు మార్కులతో పాసయిన విద్యార్థుల పరిస్థితి ఎలా ఉంటుందో కదా అనిపిస్తుంది అప్పుడప్పుడు. చదువనేది రూపాయలు పోసి కొనే వస్తువు కాదని వీరంతా ఎప్పుడు తెలుసుకుంటారో ఏమో. మన చుట్టూ దాదాపు అందరూ ఇలాంటి వారే. కాబట్టి కాసేపు వీరి విషయాన్ని పక్కన పెడదాం. ఇప్పుడు ఫేస్‌బుక్‌లో వైరలవుతోన్న ఓ తల్లి మెసేజ్‌ గురించి మాట్లాడుకుందాం. రెండు రోజుల క్రితం సీబీఎస్‌ఈ పదో తరగతి ఫలితాలు వచ్చాయి కదా. ఈ ఫలితాల్లో తన కుమారుడు 60 శాతం మార్కులతో పాసయ్యాడంటూ ఓ తల్లి చాలా గర్వంగా ఫేస్‌బుక్‌ వేదికగా ప్రకటించి ఎందరికో ఆదర్శంగా నిలిచింది.

ఆ వివరాలు.. ఢిల్లీకి చెందిన వందన సూఫియా కతోచి అనే మహిళ తన ఫేస్‌బుక్‌లో చేసిన ఈ పోస్ట్‌ ఎందరినో ఆకర్షించడమే కాక ఆదర్శంగా కూడా నిలుస్తుంది. ఈ మెసేజ్‌లో ‘10వ తరగతి బోర్టు ఎగ్జామ్స్‌లో 60 శాతం మార్కులతో పాసయిన నా కొడుకును చూస్తే నాకు చాలా గర్వంగా ఉంది. మీరు చదివింది నిజమే. నా కొడుకు సాధించింది 90 శాతం కాదు.. 60 శాతం మార్కులు మాత్రమే. తొంభై శాతం సాధించినా.. అరవై శాతం సాధించినా నా సంతోషంలో ఏ మాత్రం మార్పు ఉండదు. ఎందుకంటే పరీక్షల ముందు కొన్ని సబ్జెక్ట్స్‌ విషయంలో మా అబ్బాయి చాలా ఇబ్బంది పడ్డాడు. తప్పకుండా ఫెయిల్‌ అవుతాననే భావించాడు. దాంతో చివరి నెలన్నర చాలా తీవ్రంగా కష్టపడ్డాడు. ఫలితం సాధించాడు’ అని తెలిపింది. 

అంతేకాక ‘ఈ మహా సముద్రంలో నీ లక్ష్యాన్ని నువ్వే ఎంచుకో. దాంతో పాటు నీ మంచితనాన్ని, తెలివిని, ఉత్సుకతను, హాస్య చతురతను కూడా సజీవంగా ఉంచుకో’ అంటూ కొడుకు సూచించింది వందన. ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసిన ఈ మెసేజ్‌ ఇప్పటికే కొన్ని వేల లైక్‌లు, షేర్స్‌తో పాటు కామెంట్స్‌ కూడా అందుకుంది. ఓ తల్లిగా ఆమె కొడుకును అర్థం చేసుకున్న తీరును చాలా మంద్రి తల్లిదండ్రులు, విద్యార్థులు మెచ్చుకుంటున్నారు. ‘మీరేవరో నాకు తెలీదు. కానీ మిమ్మల్ని చూస్తే చాలా చాలా గర్వంగా ఉందం’టూ కొందరు కామెంట్‌ చేయగా.. ‘మార్కుల గురించి వదిలేద్దాం. మన పిల్లల కష్టాన్ని గుర్తిద్దాం.. వారు చెప్పేది విని.. అండగా నిలుద్దాం’ అని మరి కొందరు కామెంట్‌ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు