స్ఫూర్తిదాయక కథ.. వేలల్లో లైకులు, కామెంట్లు..!

14 Aug, 2019 14:55 IST|Sakshi
విక్కీ తీసిన అద్భుతమైన ఫొటోల్లో ఒకటి

ఢిల్లీ : తినేందుకు తిండి, ఉండేందుకు గూడులేని ఓ యువకుడి జీవన గమనం, అతను ఎదిగిన తీరు ఫోర్బ్స్ ఆసియా-2016 ‘30 అండర్‌ 30’ జాబితాలో చోటు దక్కించుకునేలా చేసింది. ఢిల్లీ నడి వీధుల్లో గడిచిన తన బాల్యం, ఓ ఎన్‌జీవో ఆపన్న హస్తంతో బడివైపు అడుగులు..  ఒక్కో మెట్టు ఎక్కుతూ ‘స్ట్రీట్‌’ ఫొటోగ్రాఫర్‌గా సాగుతున్న ఢిల్లీకి చెందిన విక్కీ రాయ్‌(32) జీవితం నిజంగా స్ఫూర్తిదాయకం. విక్కీ తన విజయగాథను ఎంతో పాపులర్‌ అయిన ‘హ్యూమన్స్‌ ఆప్‌ బాంబే’ ఫేస్‌బుక్‌ పేజీలో గత సోమవారం పంచుకున్నాడు. రెండు రోజుల వ్యవధిలోనే అతని పోస్టు వైరల్‌ అయింది. 28 వేలకు పైగా లైకులు, వేలాది కామెంట్లతో దూసుకుపోతోంది. ‘మబ్బు వీడిన తర్వాత వెలుగు రాక తప్పదు’ ‘మనసు కదిలించే కథ నీది గురూ..!’ అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. ‘స్ట్రీట్‌’ ఫొటోగ్రాఫర్‌ కథ విక్కీ మాటల్లోనే..

‘పశ్చిమ బెంగాల్‌లోని ఓ మారుమూల గ్రామం మాది. నాకు మూడేళ్ల వయస్సు ఉన్నప్పుడు అమ్మానాన్నలు నన్ను తాతయ్య దగ్గర వదిలేశారు. అయితే ఆయన ఎప్పుడూ నన్ను కొడుతుండే వాడు. బతుకుదెరువు కోసం ఊళ్లో చాలా మంది పట్టణానికి వెళ్తున్నారని తెలిసి నేను వెళ్లాలని నిర్ణయించుకున్నా. అప్పుడు నాకు పదకొండేళ్లు. ఓరోజు మా తాత దగ్గర డబ్బు దొంగలించి ఢిల్లీ రైలు ఎక్కేశా. దుర్భర పరిస్థితుల నుంచి బయటపడి గొప్పగా బతికేయాలని ఢిల్లీకి చేరాను. కానీ, ఇక్కడ నన్ను పట్టించుకునే వారెవరూ. నా ఆకలి తీర్చేవారెవరూ. పొట్టకూటి కోసం చెత్త ఏరుకోవడం మొదలు పెట్టాను. బతకాలంటే తిండి కావాలి కదా. బాగా బతకాలనే కోరిక బదులు బతికితే చాలు అనే పరిస్థితులు దాపురించాయి. అయినా పోరాటం ఆపలేదు. కొన్ని రోజుల తర్వాత రైళ్లలో నీళ్ల సీసాలు అమ్మాను. వచ్చిన ఆ కొద్దిపాటి చిల్లరతో దొరికిందేదో కొనుక్కుని తిని..  రోడ్డుపక్కన ఖాళీ స్థలాల్లో నిద్రపోయేవాడిని. దాబా హోటల్‌లో ప్లేట్లు కడిగేవాడిని. ఆకలితో అలమటించి కస్టమర్లు వదిలేసిన ఆహారాన్ని తిన్నరోజులూ ఉన్నాయి. అయితే, అక్కడికొచ్చే ఓ డాక్టర్‌ నా దీనస్థితిని గమనించి ‘సలాం బాలక్‌’ అనే ఎన్‌జీవోలో చేర్పించారు. చాలా కాలానికి నాకొక ఆశ్రయం దొరికింది. 

ఆ ట్రస్టు నిర్వాహకులు నాకు చేయూతనందించారు. మూడు పూటలా తిండి పెట్టేవారు. చదువు కూడా చెప్పించారు. అలా త్రివేణి కళా సంగంలో ఫొటోగ్రఫీ కోర్సు చేశాను. అయితే, ఓ ఫొటో ఎగ్జిబిషన్‌ జరుగున్నప్పుడు బ్రిటీష్‌ ఫొటోగ్రాఫరొకరు నా పనితనం చూసి మెచ్చుకున్నారు. అదే విషయాన్ని ఎన్‌జీవో నిర్వాహకులకూ చెప్పాడు. దాంతో నాకు రూ.500 విలువ చేసే ఒక బుల్లి కెమెరా కొనిచ్చారు. స్థానికుడైన ఒక ఫొటోగ్రాఫర్‌ సాయంతో ఫోటోగ్రఫీపై మరింత పట్టుసాధించా. ‘స్ట్రీట్‌ డ్రీమ్స్‌’ పేరుతో వీధి బాలల బతుకు చిత్రాలను చిత్రించి నేను తీసిన ఫొటోలతో ఓ ఎగ్జిబిషన్‌ పెట్టాను. అది సక్సెస్‌ అయింది. నా ఫొటోల్ని కొనేందుకు ప్రజలు ఆసక్తి చూపించారు. న్యూయార్క్‌, లండన్‌, దక్షిణాఫ్రికా, శాన్‌ఫ్రాన్సిస్కో నగరాల్లో పర్యటించి పలు డాక్యుమెంటరీ ఫొటోగ్రఫీ ఈవెంట్లలో పాల్గొన్నాను. నా ఫొటోలతో మంచి గుర్తింపు వచ్చింది. ఇంతలా నా జీవితం మారతుందని కలలో కూడా అనుకోలేదు’అని విక్కీ ఆనందం వ్యక్తం చేశాడు. 2014లో ప్రతిష్టాత్మక ఎంఐటీ మీడియా ఫెలోషిప్‌నకు కూడా విక్కీ ఎంపికవడం విశేషం.

మరిన్ని వార్తలు