‘కేటీఆర్‌ సర్‌.. నా స్నేహితుడు చనిపోయాడు.. ఏం చేయమంటారు’

27 Nov, 2018 20:11 IST|Sakshi
నాగ్‌ అశ్విన్‌

ట్విటర్‌లో ప్రశ్నించిన సినీ డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌

సాక్షి, హైదరాబాద్‌ :  నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రుల తీరుపై సినీదర్శకుడు మహానటి ఫేం నాగ్ అశ్విన్ అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల నిర్లక్ష్యానికి తన స్నేహితుడు ప్రాణాలు కోల్పోయాడని ఆవేదన వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళ్తే.. ఆదివారం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో కెమెరామెన్ గా పని చేస్తున్నా అశ్విన్ స్నేహితుడు గాయపడ్డారు. చికిత్స నిమిత్తం ఆయనను సికింద్రాబాద్‌ గాంధీ ఆసుప్రతికి తరలించారు. అయితే, వైద్యులు అందుబాటులో లేకపోవడంతో అతను మరణించాడు. ఈ అంశంపై ట్విటర్‌ వేదికగా మంత్రి కేటీఆర్‌ను ప్రశ్నిస్తూ.. జరిగిన దారుణాన్ని  వివరించారు.

‘ఆదివారం రోజు నా స్నేహితుడు గాంధీ ఆసుపత్రిలో మరణించాడు. ప్రమాదం జరిగిన అనంతరం అతను మూడుగంటల పాటు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడాడు. ఆదివారం కావడంతో డాక్టర్లు అందుబాటులో లేరు. అతని తల్లిదండ్రులే అతన్ని స్ట్రెచర్ పై పడుకోబెట్టి... అటు, ఇటు తిరిగారు. మరే ఆసుపత్రికి తీసుకెళ్లినా అతను బతికేవాడు. గాంధీ ఆసుపత్రిలో పనిచేసే నా సోదరి ఆదివారం రాత్రి ఉండే పరిస్థితిని వివరించింది. ఆసమయంలో డాక్టర్లు ఎందుకు ఉండరు?  రాజధాని నగరమైన హైదరాబాదులోని ప్రభుత్వ ఆసుపత్రిలో మనుషులు ప్రాణాలను ఎందుకు కాపాడుకోలేక పోతున్నాం? కేటీఆర్ సార్.. ప్రభుత్వాసుపత్రి చావులకు, నిర్లక్ష్యానికి పర్యాయపదం కాదని చెప్పడానికి ఏం చేయమంటారు? వైద్యం అందక చనిపోయిన నా స్నేహితుడు రాష్ట్రంలోనే గొప్ప కెమెరామెన్. దీనిపై ఎవరిని ప్రశ్నించాలో కూడా నాకు అర్థం కావడం లేదు. వైద్యం అందక ఎవరూ చనిపోరాదు' అంటూ వరుస ట్వీట్లతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు