దర్శకుడు శంకర్‌పై తమిళులు ఫైర్‌

23 May, 2018 08:46 IST|Sakshi
దర్శకుడు శంకర్‌ (పాత ఫొటో)

సాక్షి, హైదరాబాద్‌ : ప్రముఖ తమిళ సినీ దర్శకుడు శంకర్‌పై తమిళులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తూత్తుకుడిలో వేదాంత కంపెనీకి చెందిన స్టెరిలైట్‌ కాపర్‌ యూనిట్‌ విస్తరణ ప్రతిపాదనల్ని వ్యతిరేకిస్తూ గత 100 రోజులుగా జరుగుతున్న ఆందోళనలు మంగళవారం హింసాత్మకంగా మారిన విషయం విదితమే. ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్తులను ధ్వంసం చేసి ఆందోళనకారులు బీభత్సం సృష్టించారు. కలెక్టరేట్‌ వద్ద నిరసనకారులను నిలువరించే క్రమంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో 11 మంది మరణించారు.

కాగా, మంగళవారం రాత్రి జరిగిన ఐపీఎల్‌ క్వాలిఫైయర్‌ మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీనిపై శంకర్‌ ‘వాట్‌ ఏ మ్యాచ్‌’ అంటూ ట్విటర్‌ ప్రశంసలు కురిపించారు. దీంతో శంకర్‌పై నెటిజన్లు భగ్గుమన్నారు. తూత్తుకుడి ఘటనలో 11 మంది తమిళుల మరణంపై బాధను వ్యక్తం చేయకుండా క్రికెట్‌ను ఆస్వాదిస్తున్నావా? అంటూ నిలదీశారు. ఈ పరిస్థితితుల్లో నీకు క్రికెట్ ముఖ్యమా..? నువ్వు మనిషివేనా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విటర్‌లో నెటిజన్ల ఆగ్రహం నేపథ్యంలో శంకర్‌ సదరు పోస్టును తొలగించినట్లు తెలుస్తోంది.

దీంతో నష్టనివారణలో భాగంగా శంకర్‌ బుధవారం తూత్తుకుడిలో మరణించిన వారికి నివాళులు అర్పించారు. ఈ మేరకు బుధవారం ట్వీట్‌ చేశారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.తూత్తుకుడి ఘటనపై నటి, దర్శకురాలు రాధిక శరత్‌కుమార్‌ స్పందించారు. 11 మంది మరణించాడాన్ని జీర్ణించుకోలేకపోతున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె ట్వీట్‌ చేశారు. నివాళి తెలిపితే అది ఒట్టి మాటే అవుతుందని అభిప్రాయపడ్డారు. మరణించిన వారి కుటుంబాల గురించే తన గుండె కొట్టుకుంటోందని ఆవేదన వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు