ఏనుగును కాపాడిన ‘ఆర్కిమెడిస్ సూత్రం'

2 Feb, 2020 13:15 IST|Sakshi

రాంచీ: ప్రమాదవశాత్తు బావి లోపల పడిపోయిన ఒక ఏనుగును ఆర్కిమెడిస్ సూత్రాన్ని ఉపయోగించి జార్ఖండ్‌లోని అటవీ అధికారులు బయటకు లాగారు. బావిలో పడిన గున్న ఏనుగును ఎలా బయటకు తీయాలా అని తలలు పట్టుకుంటున్న అటవీశాఖ అధికారులకు భౌతిక శాస్త్రవేత్త ఆర్కిమెడిస్‌ గుర్తొచ్చాడు. అతను చెప్పిన ఫార్ములా నీటికంటే తక్కువ సాంద్రత ఉన్న వస్తువులు నీటిలో తేలుతాయి. ఇదే సూత్రం ఆధారంగా వారు నూతిలోకి నీళ్లు పోశారు.

బావిలో బురద ఎక్కువగా ఉండటంతో సహజంగానే ఆ నీటి సాంద్రత ఏనుగు కంటే ఎక్కువగా ఉంది. దీంతో ఆ ఏనుగు నీటిలో తేలడం ప్రారంభించింది. అలా అందులో నీటి స్థాయి పెరుగుతూ వచ్చింది. దానితోపాటు ఏనుగు తేలుతూ పైకి వచ్చింది. ఎలాగైతేనేం ఏనుగు ప్రాణాలు కాపాడారు. ఆ తర్వాత వల సహాయంతో దాన్ని బయటకు లాగారు. ఇలా తాము చిన్నప్పుడు స్కూల్లో నేర్చుకున్న సూత్రాలను ఉపయోగించి అటవీ అధికారులు ఏనుగును బయటకు లాగారు. ఇండియన్ ఫారెస్ట్ అధికారి షేర్ చేసిన ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అటవీ శాఖ అధికారుల తీరుని, ఆ సూత్రం ఉపయోగించాలి అనే ఆలోచనను నెటిజన్లు  కొనియాడుతున్నారు.

మరిన్ని వార్తలు