‘ఎఫ్‌బీ, ట్విటర్‌ లేకుండానే ఆ సదస్సు’

8 Jul, 2019 14:43 IST|Sakshi

వాషింగ్టన్‌ : ఫేస్‌బుక్‌, ట్విటర్‌ లేని సోషల్‌ మీడియాను ఊహించలేని క్రమంలో వైట్‌ హౌస్‌ ఈ రెండు దిగ్గజ సంస్థలను మంగళవారం జరిగే సోషల్‌ మీడియా సదస్సుకు ఆహ్వానించలేదు. రిపబ్లికన్ల అభిప్రాయాలకు ఈ రెండు సంస్థలు సానుకూలంగా లేవనే కారణంతోనే ఎఫ్‌బీ, ట్విటర్‌లను ఈ సదస్సు నుంచి దూరం పెట్టినట్టు అమెరికన్‌ మీడియా భావిస్తోంది. ట్రంప్‌ యంత్రాంగం నిర్వహిస్తున్న ఈ సదస్సులో సోషల్‌ మీడియాకు సంబంధించిన అంశాలపై కూలంకషంగా చర్చిస్తారని సీఎన్‌ఎన్‌ వార్తాసంస్థ పేర్కొంది.

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సదస్సుకు ఎఫ్‌బీ, ట్విటర్‌లను ఆహ్వానించకపోవడంపై స్పందించేందుకు వైట్‌ హౌస్‌ నిరాకరించింది. రిపబ్లికన్ల ఉద్దేశాలను ఈ రెండు సంస్థలు గౌరవిం‍చడం లేదని ట్రంప్‌ ఇటీవల మండిపడటం కూడా ఈ సదస్సు ఆహ్వానితుల జాబితాలో ఆయా సంస్థలకు చోటు దక్కకపోవడానికి కారణమని ప్రచారం సాగుతోంది.

ఫేస్‌బుక్‌, గూగుల్‌, ట్విటర్‌ వామపక్ష డెమొక్రాట్లకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాయని ట్రంప్‌ ఇటీవల చేసిన ట్వీట్‌ పెనుదుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇక ఫేస్‌బుక్‌, ట్విటర్‌లో తమను ఎవరైనా తప్పుగా సెన్సార్‌ చేయడం, నిషేధించడం, సస్పెండ్‌ చేయడం జరిగితే ఫిర్యాదు చేయాలని వైట్‌ హౌస్‌ ఇటీవల ఓ నూతన ఫ్లాట్‌ఫాంను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ రెండు వేదికలపై తమ అభిప్రాయాలను, ప్రసంగాలను సెన్సార్‌ చేస్తున్నారని పలువురు రిపబ్లికన్లు బాహాటంగా ఎఫ్‌బీ, ట్విటర్‌లను టార్గెట్‌ చేయడంతో వీటిపై ఫిర్యాదు చేసేందుకు వైట్‌ హౌస్‌ నూతన టూల్‌ను ఏర్పాటు చేయడం విశేషం.

మరిన్ని వార్తలు