ఫేస్‌బుక్‌ వీడియో వారి తండ్రిని కలిసేలా చేసింది

19 Jan, 2020 17:00 IST|Sakshi

ఢాకా : ప్రస్తుతం సోషల్‌ మీడియా అనేది సమాజంలో మానవ సంబంధాలను దెబ్బతీస్తుందని ప్రతి ఒక్కరు ఆరోపిస్తున్నారు. కానీ అదే సోషల్‌ మీడియా 48 సంవత్సరాలుగా కుటుంబానికి దూరంగా బతుకుతున్న ఒక వ్యక్తిని తన వాళ్లకు దగ్గర చేసింది.  వివరాల్లోకి వెళితే..  బంగ్లాదేశ్‌లోని సిల్హెట్‌ నగరానికి  చెందిన హబీబుర్‌ రెహమాన్‌(78) అనే వ్యక్తి  స్టీల్‌ వ్యాపారం నిర్వహించేవాడు. అతనికి భార్య , నలుగురు కుమారులు ఉన్నారు. అయితే 1972లో ట్రేడ్‌ వార్‌ ఉద్యమం ఉదృతంగా ఉండంతో వ్యాపారంలో పూర్తిగా నష్టపోయాడు. దీంతో  రెహమాన్‌ 30 సంవత్సరాల వయసులో వ్యాపార నిమిత్తం వేరే ప్రదేశానికి వెళుతున్నాని చెప్పి ఇంటినుంచి వెళ్లిపోయి మళ్లీ తిరిగిరాలేదు. ఆ తర్వాత రెహమాన్‌ భార్య, ఆమె సోదరుడు కలిసి అతని గురించి వెతికే ప్రయత్నం చేశారు. రెహమాన్‌ను వెతికే ప్రయత్నం చేస్తుండగానే 2000 సంవత్సరంలో అతని భార్య మృతి చెందారు.

దీంతో అప్పటి నుంచి నలుగురు కుమారులు తండ్రి జాడ కోసం గాలిస్తూనే ఉన్నారు. ఇదిలా ఉండగా రెహమాన్‌ పెద్ద కుమారుడు అమెరికాలో నివాసం ఉంటున్నాడు. జనవరి 17న రెహమాన్‌ పెద్ద కోడలు ఫేస్‌బుక్‌లో ఒక వీడియో చూసింది. ఆ వీడియోలో దీనావస్థలో ఉన్న వ్యక్తి తనకు ఫైనాన్షియల్‌ సపోర్ట్‌ చేయాలంటూ తన పక్కన ఉన్న మరో పేషెంట్‌ను అడుగుతున్నట్లు కనిపించింది. దీంతో అనుమానమొచ్చి  ఆ వీడియోను తన భర్తకు చూపించింది. ఆ వీడియోలో తన తండ్రి హబీబుల్‌ రెహమాన్‌ కనిపించడంతో ఆశ్చర్యానికి గురయ్యాడు. వెంటనే బంగ్లాదేశ్‌లో ఉంటున్న తన సోదరులైన షాహబుద్దీన్‌, జలాలుద్దీన్‌లకు ఫోన్‌ చేసి విషయం మొత్తం వివరించాడు. దీంతో​ వీడియో చూసిన వాళ్లు ఆ పేషేంట్‌ తమ తండ్రేనని నిర్ధారణకు వచ్చారు. వెంటనే రెహమాన్‌ ఉన్న మాగ్‌ ఉస్మానియా మెడికల్‌ కాలేజీకి వెళ్లి కలుసుకున్నారు. వారి తండ్రిని చూడగానే వారి సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.

25 సంత్సరాలుగా రెహమాన్‌ తమ దగ్గరే ఉంటున్నాడని మౌల్వీబజార్‌ జిల్లాకు చెందిన రజియా బేగం వెల్లడించారు. '1995లో హజరత్‌ షాహబుద్దీన్‌ ష్రైన్‌ సెంటర్‌ వద్ద రెహమాన్‌  మా కుటుంబసభ్యులకు దొరికాడు. అతను దొరికినప్పుడు అతని మానసిక పరిస్థితి సరిగా లేదని, అందుకే అప్పుడు ఎలాంటి వివరాలు మాకు వెల్లడించలేదు. మా దగ్గర  ఉంటున్నప్పటి నుంచి  ఏదో ఆలోచిస్తూ ఉండేవాడు. కానీ అతన్ని మేము ఏం అడగకుండా జాగ్రత్తగా చూసుకునేవాళ్లం. ఒకరోజు హఠాత్తుగా మంచం మీద నుంచి కిందపడడంతో కుడిచేయి విరిగింది. దాంతో రెహమాన్‌ను మాగ్‌ ఉస్మానియా మెడికల్‌ ఆసుపత్రిలో జాయిన్‌ చేశామని' రజియా బేగం చెప్పుకొచ్చారు.

రెహమాన్‌ పరిస్థితిని గమనించిన డాక్టర్లు అతను కోలుకోవడానికి కొంత సమయం పడుతుందని తెలిపారు. ఇదే విషయమై  రెహమాన్‌ మనవడు కెఫాయత్‌ అహ్మద్‌ స్పందిస్తూ.. నేను మళ్లీ మా తాతను చూస్తాననుకోలేదు. అతని కోసం మేం గాలించని ప్రదేశం లేదు. ఈరోజుకు మా కల నెరవేరిందని, మా తాతగారిని కలుసుకోవడం ఆనందంగా ఉందని పేర్కొన్నాడు.

Read latest Social-media News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా