అది నకిలీ అకౌంట్‌: ఐఏఎస్‌ టీనా దాబీ

18 Dec, 2019 11:23 IST|Sakshi

న్యూఢిల్లీ:  దేశం నలుమూలలా పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ  అట్టుడుకుతున్న నేపథ్యంలో.. కొంతమంది దుండగులు ప్రముఖుల పేరుతో నకిలీ ఫేసుబుక్‌ ఖాతాలు సృష్టించి.. అగ్నికి ఆజ్యం పోస్తున్నారు. తాజాగా మంగళవారం ఐఏఎస్‌ అధికారిణి టీనా దాబి పేరుతో నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతా సృష్టించి పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నట్లుగా హిందీ భాషలో పోస్ట్‌ చేయడంతో వైరల్‌గా మారింది. 'ఐఏఎస్‌ టీనా దాబి' పేరుతో నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతా వెలువడటంపై టీనా దాబీ ప్రముఖ మీడియా సంస్థ ఏఎన్‌ఐకు వివరణ ఇచ్చారు. అది నకిలీ ఖాతా అని, ప్రజలను పక్కదోవ పట్టించడానికి ఇలా తప్పుడు మార్గాలను ఎంచుకున్న వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని పేర్కొన్నారు.

కాగా ఢిల్లీకి చెందిన దళిత యువతి టీనా దాబి నాలుగు సంవత్సరాల క్రితం (2015) ఆల్‌ ఇండియా సివిల్ సర్వీసెస్ పరీక్షలో మొదటి ర్యాంకును కైవసం చేసుకొన్నారు. ఆ తర్వాత తన బ్యాచ్‌మేట్‌ అయిన కశ్మిరీ ఐఏఎస్‌ అథర్‌ ఖాన్‌ను ప్రేమించి.. గతేడాది పెళ్లి చేసుకున్నారు. తరువాత, ఇద్దరికి రాజస్థాన్‌లోని భిల్వారాలో పోస్టింగ్‌ లభించింది. కాగా టీనా భర్త అథర్‌ సివిల్‌ సర్వీసెస్‌లో రెండవ ర్యాంకు సాధించడం విశేషం.  ఇక పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి మతపరమైన హింసను ఎదుర్కొని 2014 డిసెంబర్ 31 న లేదా అంతకు ముందు భారత్‌కు వచ్చిన ముస్లిమేతర శరణార్థులకు త్వరితగతిన భారత పౌరసత్వం కల్పించేందుకు వీలుగా పౌరసత్వ సవరణ చట్టం రూపొందించిన విషయం తెలిసిందే. 

చదవండి: సివిల్స్ టాపర్ టీనా దాబి

మరిన్ని వార్తలు