‘పొగాకు ఆదాయం పెరగాలిగా.. అందుకే’

19 Sep, 2019 13:00 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

న్యూఢిల్లీ: ఇ- సిగరెట్లపై నిషేధం విధిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌ జారీ చేయడంపై సోషల్‌ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్రానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇ-సిగరెట్లతో పాటు మొత్తంగా పొగాకు ఉత్పత్తులన్నింటిపై నిషేధం విధించాలంటూ నెటిజన్లు డిమాండ్‌ చేస్తున్నారు. అదే విధంగా అత్యధిక ఆదాయం ఇచ్చే పొగాకు సిగరెట్లపై కూడా నిషేధం విధించడానికి కేంద్రానికి మనసు ఎలా ఒప్పుతుందిలే అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.

ఇ-సిగరెట్ల తయారీ, ఎగుమతులు, దిగుమతులు, రవాణా, పంపిణీ, నిల్వ, అమ్మకాలు, సిగరెట్ల వాణిజ్య ప్రకటనలపై నిషేధం విధిస్తూ కేంద్ర కేబినెట్‌ బుధవారం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వెల్లడిస్తూ.. అమెరికాలో ఇ-సిగరెట్లు యువతను ఎంతగా బలి తీసుకుంటున్నాయో గ్రహించాక ఆ దేశం నుంచి పాఠాలు నేర్చుకొని నిషేధం విధించామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. కాగా ఇ-సిగరెట్లపై నిషేధంతో ఖజానాకు రూ.2,028 కోట్ల నష్టం వాటిల్లే వీలుంది. కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్‌ ప్రకారం ఎవరి దగ్గరైనా ఇ-సిగరెట్లు ఉంటే వారికి (తొలిసారి) రూ. లక్ష వరకు జరిమానా, ఏడాది జైలు శిక్ష విధిస్తారు. మళ్లీ నేరం చేస్తే రూ.5లక్షల జరిమానా, మూడేళ్లు జైలు శిక్ష విధిస్తారు.(చదవండి : 460 బ్రాండ్లు.. 7,700 ఫ్లేవర్లు..ఎందుకు హానికరం)

ఇక ఈ విషయంపై స్పందించిన నెటిజన్లు...‘ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఇ-సిగరెట్లను నిషేధించలేదు. ఖజానాను నింపుకోవడానికే ఈ నిర్ణయం తీసుకుంది. సాధారణ సిగరెట్లపై నిషేధం విధిస్తే ఇబ్బడిముబ్బడిగా వచ్చే ఆదాయం కోల్పోతారు కదా. అందుకే వాటిని నిషేధించే ధైర్యం చేయలేరు. ప్రభుత్వానికి ప్రజల ఆరోగ్యం పట్ల చిత్తశుద్ధి ఉంటే అన్ని రకాల సిగరెట్లపై నిషేధం విధించాలి’ అని డిమాండ్‌ చేస్తున్నారు. అదే విధంగా..‘ ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం పొగాకు ఉత్పత్తుల వినియోగదారుల జాబితాలో భారత్‌ ప్రపంచంలోనే రెండోస్థానంలో ఉంది. పొగాకు ఉత్పత్తుల కారణంగా ఏడాదికి 9 లక్షల మందికి పైగా మృత్యువాత పడుతున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం తాజాగా తెచ్చిన ఆర్డినెన్స్‌లో వీటి గురించి ప్రస్తావన లేదు. చాలా ఆనందం. ఇ- సిగరెట్లపై నిషేధంతోనే సరిపెట్టండి. బాగుంది అంటూ వ్యంగ్యంగా ట్వీట్లు చేస్తున్నారు. సిగరెట్‌ తాగే అలవాటు మానుకోవడానికి ఇ- సిగరెట్లు ఆశ్రయించే వారు ఇప్పుడు సాధారణ సిగరెట్‌ కాలుస్తారు. కాబట్టి వాటిని అమ్మే వారి ఆదాయం బాగానే పెరుగుతోంది అంటూ వివిధ రకాల మీమ్స్‌తో విమర్శలు గుప్పిస్తున్నారు.

మరిన్ని వార్తలు