వైరల్‌ స్టోరి : తండ్రికే పునర్జన్మనిచ్చింది

20 Apr, 2019 12:18 IST|Sakshi

కోల్‌కతా : కంటే కూతుర్నే కనాలనేది పెద్దల మాట. ఎందుకు.. తల్లిదండ్రుల కష్టాలను తనవిగా భావించి.. వారికి ఎల్లప్పుడు తోడుగా నిలుస్తుంది కాబట్టి. కానీ నేటికి మన సమాజంలో ఆడపిల్ల పుట్టిందనగానే ఏదో పాడుపిల్లను చూసినట్లు చూసే తల్లిదండ్రులు కోకొల్లలు. తను పుట్టిన దగ్గర నుంచి మరో ఇంటికి పంపే వరకూ ఓ బరువుగానే భావించే తల్లిదండ్రులు లక్షల్లో ఉన్నారు. కొడుకు కొరివిపెట్టడానికే ముందుటాడు.. కూతురు తల్లిదండ్రుల కష్టాల్లో పాలు పంచుకోవడానికి ముందుంటుంది. ఇందుకు నిదర్శనంగా నిలిచే సంఘటన ఒకటి కోల్‌కతాలో జరిగింది.

పారిశ్రామిక వేత్త హర్ష్‌ గోయాంక కూతుళ్ల గొప్పతనాన్ని తెలియజేస్తూ చేసిన ఓ ట్వీట్‌ ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ‘కోల్‌కతాకు చెందిన రాఖీ దత్తా అనే 19 ఏళ్ల యువతి.. కాలేయ సంబంధ వ్యాధితో బాధపడుతున్న తండ్రి కోసం తన లివర్‌లో 65 శాతాన్ని దానం చేసింది. భవిష్యత్తులో తనకు ఎదురయ్యే సమస్యల గురించి.. సర్జరీ వల్ల కలిగే నొప్పి గురించి.. ఏర్పడే గాట్ల గురించి గాని తను పట్టించుకోలేదు. కేవలం తన తండ్రి ఆరోగ్యాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకుంది. తండ్రి పట్ల కూతరు చూపే ప్రేమ ఎప్పుడు ప్రత్యేకమే. కూతుర్లను చిన్న చూపు చూసే తల్లిదండ్రులకు ఇదే కరెక్ట్‌ సమాధానం’ అంటూ హర్ష్‌ గోయాంక ట్వీట్‌ చేశారు.

దాంతో పాటు తండ్రి కూతుర్లిద్దరు తమ గాట్లను చూపిస్తూ దిగిన ఫోటోను కూడా షేర్‌ చేశారు. ప్రస్తుతం ఈ తండ్రీకూతుళ్ల కథ సోషల్‌ మీడియాలో తెగ వైరలవ్వడమే కాక.. రాఖీపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు నెటిజన్లు. కూతుళ్లు మీకు జోహార్లు అంటున్నారు.

Read latest Social-media News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు