అదరగొడుతున్న చిన్నారి రిపోర్టర్‌

22 Jul, 2019 13:25 IST|Sakshi

చండీగఢ్‌: మీడియా రంగంలో రిపోర్టింగ్‌కు ఉండే క్రేజే వేరు. ఈ ఫీల్డులోకి అడుగుపెట్టాలని భావించే వారి ప్రథమ ప్రధాన్యం రిపోర్టింగే. అయితే అనుకున్నంత సులువు కాదు రిపోర్టింగ్‌. ఏళ్లుగా అనుభవం ఉన్నవారు కూడా ఒక్కోసారి తడబడుతుంటారు. కానీ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలవుతోన్న ఈ చిన్నారి ఏమాత్రం తడబాటు లేకుండా.. సమస్యల గురించి రిపోర్ట్‌ చేస్తోన్న పద్దతికి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. వివరాలు.. గత కొద్ది రోజులుగా హరియాణలో కుండపోత వర్షాలు కురుస్తోన్న సంగతి తెలిసిందే. మ్యాన్‌హోల్స్‌ సరిగా లేకపోవడంతో ఎక్కడికక్కడే వర్షపు నీరు నిలిచిపోయి.. చిన్న సైజు తటకాలను తలపిస్తున్నాయి. కొన్ని చోట్ల వర్షపు నీరు ఇండ్లలోకి ప్రవేశించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఈ క్రమంలో కురుక్షేత్రకు చెందిన ఓ చిన్నారి ఈ సమస్య గురించి గ్రౌండ్‌ రిపోర్ట్‌ చేసింది. తన ఇంటి చుట్టపక్కల వర్షపు నీరు నిలిచి పోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపింది. నీరు నిలిచిపోయి నడవడానికి కూడా ఇబ్బందిగా ఉంది అన్నది. ఈ నీరు ఇళ్లలోకి ప్రవేశించకుండా ఉండటానికి కొందరు ఇంటి ముందు సిమెంట్‌ బస్తాలతో అడ్డు కట్టలు వేస్తున్నారన్నది. వెంటనే ఉన్నతాధికారులు ఈ సమస్యపై స్పందించి తగిన పరిష్కారం చూపాలని డిమాండ్‌ చేసింది. దీన్నంతా వీడియో తీసి ట్విటర్‌లో షేర్‌ చేయడంతో ప్రస్తుతం ఇది వైరల్‌గా మారింది. చిన్నారి  ఏమాత్రం తడబాటు లేకుండా సమస్య గురించి రిపోర్ట్‌ చేయడంతో నెటిజన్లు తెగ మెచ్చుకుంటున్నారు.
 

Read latest Social-media News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు