చిన్నారుల ప్రాణాలు పోతుంటే.. స్కోర్‌ కావాలా?

18 Jun, 2019 11:26 IST|Sakshi
మంగల్‌ పాండే (ఫైల్‌ ఫొటో)

పట్నా: బిహార్‌లో మెదడువాపు వ్యాధి ముక్కుపచ్చలారని చిన్నారులను బలి తీసుకుంటోంది. ఇప్పటికే ఈ వ్యాధి బారినపడి 103 మంది చిన్నారులు మృతి చెందారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్థన్‌, బిహార్‌ ఆరోగ్యశాఖ మంత్రి మంగళ్‌ పాండేతో కలిసి ఆదివారం మీడియాతో ముచ్చటించారు. మెదడువాపు వ్యాది ప్రబలకుండా తీసుకుంటున్న చర్యలను వివరించారు. అయితే ఈ సందర్భంగా మంగల్‌ పాండే మీడియా మిత్రులను భారత్‌-పాక్‌ మ్యాచ్‌ స్కోర్‌ ఎంత? ఇప్పటి వరకు ఎన్ని వికెట్లు పడ్డాయని అడగడం వివాదస్పదమైంది. దీనికి సంబంధించిన వీడియో ఏఎన్‌ఐ ట్వీట్‌ చేయగా నెటిజన్లు మండిపడుతున్నారు. ఒకవైపు చిన్నారులు పిట్టల్లా రాలుతుంటే నీకు స్కోర్‌ కావాల్సి వచ్చిందా? అని ఘాటుగా కామెంట్‌ చేస్తున్నారు. దీంతో ఈ వీడియో నెట్టింట హల్‌ చల్‌ చేస్తోంది.

ఇక సోమవారం ఈ వ్యాధితో ముజఫర్‌పూర్‌లో ఆరుగురు పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. శ్రీకృష్ణ వైద్య కళాశాల, ఆస్పత్రి (ఎస్‌కేఎంసీహెచ్‌)లో సౌకర్యాలే లేవని రోగుల తరఫు బంధువులు ఆరోపిస్తున్నారు. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా బిహార్‌లో సైతం సోమవారం డాక్టర్లు సమ్మె చేయడంతో వైద్య సేవలు స్తంభించాయి. మరణాలపై సీఎం నితీశ్‌కుమార్‌ స్పందించారు. బాధిత కుటుంబాలు ఒక్కొక్కరికి రూ.4 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. బిహార్‌లో చిన్నారుల మరణాలపై  వివరణ కోరుతూ కేంద్ర ఆరోగ్య శాఖకు, బిహార్‌ ప్రభుత్వానికి జాతీయ మానవ హక్కుల కమిషన్‌ నోటీసులు పంపింది. 

మరిన్ని వార్తలు